శత్రువు గుండె పగిలే కొత్త ఆయుధం : ఇరాన్‌ సంచలన హెచ్చరిక | Can Get Heart Attack Iran Touts New Weapon After Trump Rejects Peace Plan | Sakshi
Sakshi News home page

శత్రువు గుండె పగిలే కొత్త ఆయుధం : ఇరాన్‌ సంచలన హెచ్చరిక

Apr 30 2026 10:47 AM | Updated on Apr 30 2026 10:58 AM

Can Get Heart Attack Iran Touts New Weapon After Trump Rejects Peace Plan

ఇరాన్‌పై అమెరికా ఇజ్రాయెల్‌  ప్రకటించిన యుద్ధం మరింత భీకర రూపం దాల్చనుందా? అంటే  ఇరాన్‌ తాజా హెచ్చరికలు అవుననే సంకేతాలు అందిస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దళాలపై కొత్త ఆయుధాన్ని ఉపయోగించబోతున్నామంటూ సంచలన ప్రకటన చేసింది. ఈ ఆయుధం శత్రువులకు "గుండెపోటు" తెప్పించేంత భయంకరమైనదని ఇరాన్ నావికాదళ కమాండర్ రియర్ అడ్మిరల్ షహరామ్ ఇరానీ పేర్కొన్నారు.

ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రెస్ టీవీ ప్రకారం, ఇరాన్ నావికాదళ కమాండర్ రియర్ అడ్మిరల్ షహ్రామ్ ఇరానీ మాట్లాడుతూ, శత్రు దళాలు దేనికైతే "తీవ్రంగా భయపడుతున్నాయో", అటువంటి ఆయుధంతో త్వరలోనే వారిని ఎదుర్కోబోతున్నామని ఇరానీ తెలిపారు. ఆ ఆయుధం వారి పక్కనే ఉందని, అది చూసి వారికి గుండెపోటు రావచ్చు అని ఆయన ఎద్దేవా చేశారు. ఇస్లామిక్ రిపబ్లిక్ చాలా త్వరలోనే భయంకర ఆయుధంతో ఎదుర్కొంటుందన్న హెచ్చరికలు భయాందోళనలు రేపాయి.

అమెరికా దిగ్బంధనాన్ని ఎత్తివేయడానికి బదులుగా హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలన్న ఇరాన్ ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించిన తర్వాత ఈ హెచ్చరిక వెలువడింది. ఈ ప్రతిపాదన టెహ్రాన్ అణు కార్యక్రమంపై చర్చలను కూడా వాయిదా వేసేది. అయినప్పటికీ, హోర్ముజ్ జలసంధి సమీపంలో అమెరికా నావికా దిగ్బంధనాన్ని కొనసాగించాలని ట్రంప్ నిర్ణయించారు.

ఇరాన్ చమురు వ్యాపారాన్ని అడ్డుకోవడం ద్వారా చర్చలకు తీసుకురావచ్చనే ట్రంప్ వ్యూహం సైనిక అకాడమీల్లో ఒక "జోక్" గా మారిందంటూ ధ్వజమెత్తారు.  అమెరికా విమాన వాహక నౌక అబ్రహం లింకన్ పై ఇరాన్ కనీసం ఏడుసార్లు క్షిపణి దాడులు చేసిందని, దీనివల్ల అమెరికా కొంతకాలం పాటు విమాన కార్యకలాపాలను నిర్వహించలేకపోయిందని ఆయన వెల్లడించారు.

కాగా ఫిబ్రవరి 28న ఇరాన్ అణుకార్యక్రమంపై  విభేదాల కారణంగా ఇరాన్‌పై అమెరికా,ఇజ్రాయెల్ యుద్ధాన్ని ప్రారంభించాయి. అప్పటి నుండి ఇరాన్ అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యాలపై సుమారు 100 సార్లు ప్రతీకార దాడులు చేసినట్లు పేర్కొంది. తమ పౌరుల మరణాలకు ప్రతీకారం తీర్చుకుంటామని పేర్కొంది.

హోర్ముజ్ జలసంధి దిగ్బంధనం
ప్రపంచ ముడి చమురు రవాణాలో 20% వాటా కలిగిన హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది శత్రు దేశాల నౌకలు ఇరాన్ అనుమతితోనే ప్రయాణించాలని నిబంధన విధించింది. అరేబియా సముద్రం నుండి కూడా ఈ మార్గాన్ని ఇరాన్ అదుపులోకి తీసుకుంది. అమెరికా దళాలు తమ నౌకలను అక్రమంగా పట్టుకోవడం "పైరసీ" కంటే ఘోరమని ఇరానీ మండిపడ్డారు.

హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరుస్తామని, దానికి బదులుగా అమెరికా విధిస్తున్న ఆర్థిక దిగ్బంధనాన్ని (blockade) తొలగించాలని, అలాగే అణు కార్యక్రమ చర్చలను వాయిదా వేయాలని ఇరాన్ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను వ్యతిరేకించిన ట్రంప్‌ బాంబు దాడుల కంటే దిగ్బంధనం చాలా ప్రభావం చూపిస్తోందని, ఇరాన్ ఎప్పటికీ అణు ఆయుధాన్ని కలిగి ఉండకూడదని  స్పష్టం చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement