భార్య‌ను కాపాడ‌బోయి బ‌లైపోయాడు | Man dies shielding wife in Gujarat Sabarkantha | Sakshi
Sakshi News home page

మంత్రాల నెపం.. ఇంకెంత కాలం

May 30 2026 5:27 PM | Updated on May 30 2026 5:38 PM

Man dies shielding wife in Gujarat Sabarkantha

అహ్మ‌దాబాద్‌: దేశం ఎంత పురోగ‌తి సాధించినా ఇంకా అక్క‌డ‌క్క‌డ అంధ‌కార యుగ‌పు ఆన‌వాళ్లు వెలుగులోకి వ‌స్తూనే ఉన్నాయి. మూఢ విశ్వాసుల‌ గుడ్డి న‌మ్మ‌కాలకు గ‌రీబులు బ‌లైపోతూనే ఉన్నారు. మూఢ విశ్వాసాల‌కు మూక‌స్వామ్యం తోడుకావ‌డంతో మ‌నుషులు మాన‌వ‌త్వం మ‌రిచిపోతున్నారు. మూఢనమ్మకాలు, గుంపు మనస్తత్వం.. ఒంటరి కుటుంబాలను ఎలా నాశనం చేయగలవో చూపే ఒక భయంకరమైన ఘ‌ట‌న గుజ‌రాత్‌లో వెలుగులోకి వచ్చింది. మంత్రాల నెపంతో ఓ కుటుంబంపై మూకుమ్మ‌డిగా దాడి చేసి ఒక‌రి ప్రాణాల‌ను బ‌లిగొన్నారు. మూక దాడి నుంచి త‌న కుటుంబాన్ని కాపాడుకునే క్ర‌మంలో ఇంటిపెద్ద క‌డ‌తేరిపోయాడు.

సబర్కాంత జిల్లా (Sabarkantha district) విజయ్‌నగర్ తాలూకాలోని గడివన్‌కాడ గ్రామంలో ఈ అనాగరిక హ‌త్యోదంతం చోటుచేసుకుంది. మను రామ్‌జీ దామోర్, అత‌డి కుటుంబ స‌భ్యుల‌ను మంత్ర‌గాళ్ల నెపంతో కొంతకాలంగా గ్రామస్థులు వేధిస్తున్నారు. రామ్‌జీ భార్య‌ను 'మంత్రగత్తెస ముద్ర‌వేసి ఈ వేధింపుల‌కు పాల్ప‌డుతున్నారు. దాడి జ‌రిగిన రోజున, వేధింపులు హింసగా మారాయి. మను భార్యను లక్ష్యంగా చేసుకుని గ్రామస్థుల గుంపొక‌టి వారి ఇంట్లోకి బలవంతంగా చొరబడింది. మూక దాడి నుంచి త‌న భార్య‌ను త‌ప్పించేందుకు ఆమెకు ర‌క్ష‌ణ‌గా నిల‌బ‌డ్డాడు. అత‌డి ఇద్ద‌రు కొడుకులు కూడా త‌మ క‌న్న‌వాళ్ల‌ను కాపాడుకునేందుకు క‌దిలారు. కానీ గుంపు ముందు వారు నిస్స‌హాయులుగా మిగిలిపోయారు.

12 మంది అరెస్టు
త‌మ‌కు అడ్డుగా నిలిచిన ఈ ముగ్గురిపై మూఢ‌విశ్వాసులు ప‌దునైన ఆయుధాలతో విచ‌క్ష‌ణార‌హితంగా దాడికి పాల్ప‌డ్డారు. తీవ్రంగా గాయ‌ప‌డిన వీరిని పోలీసులు స‌హాయంతో స‌మీపంలోని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. తన కుటుంబాన్ని కాపాడుకునే క్రమంలో తగిలిన గాయాల కారణంగా మను మరణించాడు. మూక దాడి నుంచి భార్యను ర‌క్షించి అత‌డు ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణ ఘ‌ట‌న‌పై చిటోడా పోలీసులు కేసు న‌మోదు చేశారు. స్థానిక క్రైమ్ బ్రాంచ్ సహాయంతో గంటలోపే 12 మంది నిందితుల‌ను అరెస్టు చేశారు.

నిందితుల్లో న‌లుగురు మ‌హిళ‌లు
చిటోడా పోలీసులు హత్యతో కూడిన అల్లర్ల కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వేగంగా స్పందించిన పోలీసులు, స్థానిక క్రైమ్ బ్రాంచ్ సహాయంతో గంటలోపే 12 మందిని అరెస్టు చేశారు. వీరిలో న‌లుగురు మ‌హిళ‌లు ఉన్నార‌ని మీడియాకు ఖేడ్‌బ్రహ్మ డివిజన్ డీఎస్పీ ఉల్దీప్ నాయి వెల్ల‌డించారు. అరెస్టయిన వారు.. వాల్జీ సాలూజీ దామోర్, జిగ్నేష్ వాల్జీ దామోర్, రోహిత్ రాయ్, జివాజీ సాలూజీ దామోర్, నాగ్జీ సాలూజీ దామోర్, హిరాజీ సాలూజీ దామోర్, విజయ్ హిరాజీ దామోర్, కాంతి సాలూజీ దామోర్, సంగీతా నాగ్జీ దామోర్, అరుణ వాల్జీ దామోర్, శారదా కాంతి దామోర్, సీతా హిరాజ్ అని డీఎస్పీ తెలిపారు. 

చ‌ద‌వండి: ట్రాఫిక్‌ చలానా ఉంటే పిల్లనివ్వను

Advertisement
 
Advertisement
Advertisement