Man Breaks Barrier To Garland PM Modi At Roadshow In Karnataka - Sakshi
Sakshi News home page

Karnataka: ప్రధాని భద్రతలో వైఫల్యం.. మోదీ వద్దకు దూసుకొచ్చిన యువకుడు

Published Thu, Jan 12 2023 5:31 PM

Man Breaks Barrier To Garland  PM Modi At Roadshow In Karnataka - Sakshi

బెంగళూరు: ప్రధానమంత్రి నరేంద్రమోదీ కర్ణాటక పర్యటనలో భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. జాతీయ యువజనోత్సవాలను ప్రారంభించేందుకు గురువారం సాయంత్రం హుబ్బళి చేరుకున్న మోదీ.. విమానాశ్రయం నుంచి జాతీయ యూత్‌ ఫెస్టివల్‌ జరిగే వేదిక వరకు రోడ్‌ షో కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా కారు ఫుట్‌బోర్డుపై నిలబడి రోడ్డుకు ఇరువైపులా జనాలకు అభివాదం చేస్తూ వెళ్తున్నారు. ఇంతలో మోదీ కాన్వాయ్‌ వద్దకు ఓ యువకుడు ఆకస్మాత్తుగా దూసుకొచ్చాడు. జనాల మధ్య నుంచి పరుగుత్తుకొచ్చిన వ్యక్తి సెక్యూరిటీ బారికేడ్‌ను దాటుకొని  ప్రధానికి పూలదండ వేసేందుకు ప్రయత్నించాడు.

భద్రతా సిబ్బందిని తోసుకుంటూ రావడంతో స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌(ఎస్పీజీ) అప్రమత్తమైంది. మోదీకి అత్యంత సమీపానికి వచ్చిన యువకుడిని చివరి నిమిషంలో  అడ్డుకొని వెనక్కి లాగేశారు. అనంతరం ప్రధాని యథావిధిగా రోడ్డు షో కొనసాగించారు. అయితే బాలుడి వద్ద నుంచి పూల దండను తీసుకొని తన కారు బానెట్‌పై ఉంచినట్లు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోల ద్వారా తెలుస్తోంది. మరోవైపు హుబ్బలిలో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్‌షో సందర్భంగా ఎలాంటి భద్రతా ఉల్లంఘన జరగలేదని పోలీసులు తెలిపారు.

కాగా ప్రధాని మోదీ గురువారం కర్ణాటకలో పర్యటిస్తున్నారు. హుబ్బళ్లిలోని రైల్వే స్పోర్ట్స్ గ్రౌండ్‌లో 26 వ జాతీయ యువజనోత్సవాలను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్, కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, అనురాగ్ సింగ్ ఠాకూర్..  దాదాపు 30 వేల మంది యువతీ, యువకులు హాజరయ్యారు. జనవరి 12 స్వామి వివేకానంద జన్మదినం సందర్భంగా ఏటా నిర్వహించే ఈ ఉత్సవాలు అయిదు రోజులపాటు (జనవరి 16 వరకు) కొనసాగనున్నాయి. గతేడాది పుదుచ్చేరి జరగ్గా లకు తొలిసారి కర్ణాటక రాష్ట్రం ఆతిథ్యం ఇచ్చింది.
చదవండి: PM Modi Mumbai Visit: ఈ నెల 19న ముంబైకి ప్రధాని రాక.. బీఎంసీ ఎన్నికల కోసమేనా? 

Advertisement
Advertisement