సెల'వంటే' పండగ! | Make your holidays special | Sakshi
Sakshi News home page

సెల'వంటే' పండగ!

Aug 6 2025 4:55 AM | Updated on Aug 6 2025 4:55 AM

Make your holidays special

కుటుంబ సభ్యులంతా కలిసి వంట చేయండి

సెలవు రోజులను ప్రత్యేకంగా మలుచుకోండి

ఆరోగ్యానికి ఆరోగ్యం.. డబ్బు కూడా ఆదా

బంధాలు బలోపేతం.. ఒత్తిడి నుంచి ఉపశమనం

సెలవొచ్చిందంటే సువెన్  చక్ర ఇల్లు సందడిగా ఉంటుంది. బంధువులో, స్నేహితులో వస్తారని కాదు. సెల‘వంటే’ ఆ ఇంట పండగ. అవును.. వంటల పండగ. ఆ రోజు వంటకు కావాల్సిన కూరగాయలు, సరుకులు పొద్దున్నే తెచ్చుకోవడం మొదలు.. భోజనం అయ్యేదాకా ఇంటిల్లిపాది చేయిపడాల్సిందే. ‘అమ్మ చేతి వంట. భార్య చేతి వంట ఎప్పుడూ ఉండేదే.. రెస్టారెంట్‌కు వెళ్లి విందు ఆరగించడం, నిమిషాల్లో ఇంటికొచ్చే ఆన్ లైన్  ఫుడ్‌ ఆర్డర్లూ కొత్త కాదు. వారంలో ఒక్కరోజే అందరూ కలిసి ఉండేది. కాబట్టి సెల‘వంటే’ పండగ అని అంటారు చక్ర. – సాక్షి, స్పెషల్‌ డెస్క్‌

సెలవు రోజును ఎలాగైనా ప్రత్యేకంగా మలుచుకోవాలి. ఆ మధుర క్షణాలు వారమంతా గుర్తుండాలి. సెలవు మళ్లీ ఎప్పుడొస్తుందా అని కుటుంబ సభ్యులు అందరూ ఎదురు చూడాలి. ఇదంతా సాధ్యం చేయడానికి పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఇల్లు దాటాల్సిన అవసరం అంతకన్నా లేదు. సింపుల్‌.. అందరూ కలిసి ‘వంట’ చేయడమే. యస్‌.. ఫుడ్‌ అంటే ఎవరికి ఇష్టం ఉండదు.

 పైగా వారం వారం కొత్త రుచులను ఆస్వాదించే చాన్ ్స వస్తే ఎవరు కాదనుకుంటారు? ఇంటర్నెట్‌ వచ్చాక వంట చేయడం చాలా సులభం అయింది. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో విహరించి కొత్త వంటకం నిర్ణయిస్తాం. ఉద్యోగం చేసే మగవాళ్లు సెలవు రోజు వంట చేయడం పాత కాన్సెప్ట్‌. ఇంటిల్లిపాదీ కలిసి వంట చేయడంలో కొత్త ట్రెండ్‌. 

అందరూ కలిసి..
ఆడవాళ్లే వంట చేయాలన్న మూస పద్ధతికి స్వస్తి పలకాల్సిందే. కుటుంబం అంటేనే సమిష్టి బాధ్యత. కనీసం సెలవు రోజైనా కుటుంబ సభ్యులంతా కలిసి సరదాగా కబుర్లు చెప్పుకొంటూ వంట చేస్తే? ఒక్కసారి చేసి చూడండి. ఆదివారం, సెలవు రోజు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడడం మీ వంతు అవుతుంది. ఇలా అందరూ కలిసి వంట చేస్తే బోలెడన్ని ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు వైద్యులు, మానసిక నిపుణులు.

తినేది తెలుస్తుంది
బంధువులు, స్నేహితులు ఇంటికి వచ్చిన సందర్భాల్లోనూ, వారాంతాలు, పండుగలప్పుడు రెస్టారెంట్లకు వెళ్లడం పరిపాటి అయింది. వంట చేసే సమయం లేకపోతే ఆన్ లైన్ లో ఆర్డర్‌ చేసేస్తున్నారు. మనకు నచ్చినవి తింటున్నాం సరే.. ఆ ఆహారం ద్వారా చక్కెరలు, నూనెలనూ పరిమితికి మించి తీసుకుంటున్నాం. అలాకాకుండా మనమే వంట చేస్తే ఈ పదార్థాలను మితంగా వాడొచ్చు. 

ఇంట్లోని పిల్లలు, పెద్దలను అందరినీ దృష్టిలో పెట్టుకుని వంట చేస్తాం. అవసరమైతే ఉప్పూ, కారం తక్కువగా ఉన్నవి ముందు తీసిపెడతాం. ప్రాసెస్డ్, అల్ట్రా ప్రాసెస్డ్‌ ఆహార పదార్థాల వాడకం మన చేతుల్లో ఉంటుంది. మితంగానూ వాడొచ్చు.. పూర్తిగా వాడకుండానూ ఉండొచ్చు. ఇంటిల్లిపాదికీ ఎంత ఆరోగ్యం!

ఖర్చు తగ్గుతుంది
రెస్టారెంట్లు గల్లీకి ఒకటి పుట్టుకొచ్చాయి. వినూత్న వంటకాలు, రుచులతో ఒకదాన్ని మించి ఒకటి పోటీపడుతున్నాయి. ఖర్చూ అలాగే ఉంటోంది. నలుగురున్న కుటుంబానికి ఓ మోస్తరు రెస్టారెంట్లో భోజనానికి కనీసం రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు వెచ్చించాల్సిందే. కానీ, కాస్త మనసు పెట్టి.. ఇంట్లోని అందరూ తలో చేయి వేసి వండిన భోజనం.. అంతకు మించిన రుచి అందిస్తుంది. పైగా రెస్టారెంట్లో అయిన ఖర్చులో సగం కూడా కాదు. ప్రతీవారం రెస్టారెంట్‌కు వెళ్లే కుటుంబం నెలకు ఎంతకాదన్నా ఓ రూ.10 వేలు ఆదా చేసుకోవచ్చన్న మాట.

ఆరోగ్య ప్రయోజనాలు
బయట ఎక్కువగా తిన్నా, ఫుడ్‌ డెలివరీ యాప్‌ నుంచి ఆర్డర్‌ చేసినా.. ఆ ఆహారం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందనేది జగమెరిగిన సత్యం. ఆ ఫుడ్‌లో రుచి కోసం ఏం కలిపారో తెలియదు. తాజాగా చేసిందో.. వేడి చేసి పంపిందో తెలీదు. ఏ నూనెలు వాడారో తెలియదు. అదే, ఇంట్లో అందరూ కలిసి చేసుకుంటే.. ఇంట్లో బీపీ, షుగర్, ఇతర సమస్యలు ఉన్నవారికి తగినట్టుగా.. పిల్లలకు కూడా నచ్చినట్టుగా.. మనమే జాగ్రత్తగా ‘స్వయంపాకం’ చేసుకోవచ్చు. ఇంట్లోని అందరూ నిర్భయంగా ఇంటి ఫుడ్‌ని తీసుకోవచ్చు. అందరితో ఎంజాయ్‌ చేస్తూ రుచులు ఆస్వాదించొచ్చు.

పరిమితాహారం
ఎంత రుచికరంగా ఉన్నా మితంగా తినాలన్నది పెద్దల మాట. మనం రెస్టారెంట్‌కి వెళ్లేటప్పుడు తెలియకుండానే అపరిమితంగా తినేస్తాం. డబ్బులు పెట్టాం కదా అని టేబుల్‌ మీద మిగిలిన ఆహారాన్ని, లేదా స్విగ్గీ /జొమాటో ద్వారా ఇంటికి వచ్చిన ఫుడ్‌ను పాడేయకుండా ఆ కాస్తా మనమే లాగించేస్తాం. అంటే మన స్థాయికి మించి అతిగా తింటాం అన్నమాట. దాంతో అనారోగ్య సమస్యలూ మనమే కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. అదే ఇంట్లో వంట అయితే ఎంత తినాలనేది మనమే నిర్ణయించుకుని అందుకు తగ్గట్టుగా వండుకుంటాం. వృథా పోదు.. అపరిమితంగా మన పొట్టలోకీ పోదు.

బంధాలు బలంగా
ఈ సెల‘వంట’ద్వారా అందే అతి ముఖ్యమైన రహస్య పోషకాహారం.. బంధాలు మరింత బలపడటం. భార్య, తల్లిదండ్రులు, పిల్లలు, బంధువులతో ముచ్చట్లు పెట్టుకుంటూ ఇంట్లో వంట చేయడం, కలిసి తినడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు మరింత బలపడతాయి. ఒకవేళ అప్పటివరకూ నామమాత్రంగా ఉంటే.. బలంగా అతుక్కోవడం మొదలవుతుంది. 

పని ఒత్తిడితో అలసిపోయిన వారికి ఇదో మంచి స్ట్రెస్‌ బస్టర్‌ అవుతుంది. పిల్లలకు పనులు అలవాటవుతాయి. కూరగాయలు, సరుకులపై అవగాహన ఏర్పడుతుంది. ఇచ్చిపుచ్చుకోవడం అలవడుతుంది. ప్రేమ, ఆప్యాయతలు కరువవుతున్న నేటి రోజుల్లో.. ప్రతివారం వంటతో పండగ చేసుకుంటే.. కుటుంబ బలం పెరుగుతుంది.

ఎన్నో ప్రయోజనాలు
» వృథా ఉండదు, మితంగా తింటాం, ఖర్చూ తగ్గుతుంది 
» అనారోగ్య సమస్యలు ఉన్నవారికి ప్రత్యేకంగా వండుకోవచ్చు
» ఒత్తిడి నుంచి ఉపశమనం
» వారంలో 6 రోజులూ వండిపెట్టిన శ్రీమతికి మీ చేత్తో వండి పెట్టారన్న సంతృప్తి
షరతు: వంట చేస్తున్నంతసేపూ.. దాన్ని తృప్తిగా ఆస్వాదిస్తున్నంతసేపూ.. స్మార్ట్‌ ఫోన్‌ని (వంటల కోసం చూడాల్సి వస్తే తప్ప) దూరంగా పెడితే..  ఈ వంటకి మరింత ప్రేమానుభూతుల ‘రుచి’ చేకూర్చినవాళ్లవుతారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement