
వీడియో విడుదల చేసిన ప్రతిపక్ష ఎన్‌సీపీ
ముంబై: మహారాష్ట్రలో అధికార ఎన్‌సీపీ నేత, వ్యవసాయ శాఖ మంత్రి మాణిక్‌రావ్ కొకటే మరో వివాదంలో చిక్కుకున్నారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో సెల్‌ఫోన్‌లో రమ్మీ ఆడుతూ దొరికిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోను ప్రతిపక్ష ఎన్‌సీపీ(ఎస్‌పీ) ఎమ్మెల్యే రోహిత్ పవార్ ఎక్స్‌లో పోస్ట్ చేయడంతో గందరగోళం మొదలైంది. బీజేపీని సంప్రదించకుండా ఎన్‌సీపీ పక్షం ఏపనీ చేయలేకపోతోంది.
దీంతో, పనిలేక ఆ పార్టీ మంత్రులు మొబైల్ గేమ్స్ ఆడుకుంటున్నారని ఆరోపించారు. అన్నదాతల సమస్యల పరిష్కారంపై అధికార పక్షానికి శ్రద్ధ లేదని కాంగ్రెస్ నేత విజయ్ వడెట్టివార్ మండిపడ్డారు. విమర్శలపై కొకటే స్పందించారు. ‘అసెంబ్లీ సమావేశాల తీరును తెల్సుకునేందుకు నా సెల్‌ఫోన్‌ను తీశా. అయితే, అప్పటికే డౌన్‌లోడ్ చేసిన గేమ్ సడన్‌గా ఓపెనైంది. దాన్ని క్లోజ్ చేశాను.
ఇదంతా కేవలం 5, 10 సెకన్లలోనే జరిగిపోయింది. అంతేతప్ప, గేమ్‌ను ఆడటానికి ఓపెన్ చేయలేదు’అని వివరణ ఇచ్చుకున్నారు. కాగా, కొకటే ఏప్రిల్‌లోనూ ఓ వివాదంలో చిక్కుకున్నారు. రైతులు ప్రభుత్వ వ్యవసాయ పథకాల ద్వారా అందిన డబ్బును వివాహాలకే ఖర్చు చేస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీంతో, ఆయన క్షమాపణ చెప్పాల్సి వచ్చింది.