కాండ్లా : పశ్చిమాసియా సంక్షోభంతో ఇంధన సరఫరాపై ఆందోళన నెలకొన్న వేళ పెద్దమొత్తంలో ఎల్పీజీ సరకుతో మరో నౌక భారత్‌కు చేరుకుంది. 20వేల మెట్రిక్ టన్నుల ద్రవీకృత పెట్రోలియం గ్యాస్(ఎల్పీజీ)తో మార్షల్ ఐలాండ్ జెండాతో ఉన్న ట్యాంకర్ హార్మూజ్ జలసంధిని దాటి శనివారం గుజరాత్‌లోని కాండ్లా నౌకాశ్రయానికి చేరుకుంది.
ఖతర్ నుంచి బయలుదేరిన ఈ నౌక మే 13వ తేదీన హార్మూజ్ జలసంధిని విజయవంతంగా దాటింది. 46,427 టన్నుల ఎల్పీజీతో నిండిన మరో నౌక ‘సన్‌షైన్’ గురువారం హార్మూజ్‌ను దాటిందని, సోమవారం నాటికి న్యూ మంగళూరు పోర్టుకు చేరుకుంటుందని అధికారులు తెలిపారు. కాగా,హార్మూజ్ జలసంధిలో భారతీయ నౌకలపై దాడులు, నావికా సిబ్బందిని ప్రమాదంలో పడేయడంపై ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక మండలి ప్రత్యేక సమావేశంలో భారత్ ఆందోళన వ్యక్తం చేసింది.


