దక్షిణ రాష్ట్రాలకు ఇదేనా ప్రతిఫలం? | Let the black flags rise, warns Stalin over delimitation issue | Sakshi
Sakshi News home page

దేశ ప్రగతికి పాటుప‌డితే శిక్ష విధిస్తారా?

Apr 15 2026 2:16 PM | Updated on Apr 15 2026 3:54 PM

Let the black flags rise, warns Stalin over delimitation issue

కేంద్రంపై మ‌రోసారి త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ ఫైర్‌

చెన్నై: మోదీ స‌ర్కారు త‌ల‌పెట్టిన నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్‌వ్య‌వ‌స్థీక‌ర‌ణపై త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ఎంకే స్టాలిన్ మ‌రోసారి ఫైర్ అయ్యారు. డీలిమిటేష‌న్‌పై కేంద్ర ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న వైఖ‌రికి నిర‌స‌న‌గా గురువారం రాష్ట్ర‌ వ్యాప్తంగా న‌ల్ల‌జెండాలు ఎగుర‌వేయాల‌ని త‌మిళ‌నాడు ప్ర‌జ‌ల‌కు ఆయ‌న పిలుపునిచ్చారు. ద‌క్షిణాది రాష్ట్రాల‌కు అన్యాయం జ‌రిగితే స‌హించ‌బోమ‌ని మ‌రోసారి తీవ్ర హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. బుధవారం ఈ మేర‌కు ఎక్స్‌లో వీడియో సందేశం విడుద‌ల చేశారు.

"నల్ల జెండాలు ఎగరనివ్వండి! భారతదేశ ప్రగతికి దోహదపడినందుకు మాకు శిక్ష విధిస్తారా? తమిళనాడు, దక్షిణ రాష్ట్రాలకు ఇదేనా ప్రతిఫలం? కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రేపు పార్లమెంటులో ప్రవేశపెట్టాలని యోచిస్తున్న డీలిమిటేషన్ సవరణ బిల్లు.. తమిళనాడు, దక్షిణ రాష్ట్రాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఒక భారీ చారిత్రక అన్యాయం. డీలిమిటేషన్‌కు నిరసనగా రేపు తమిళనాడు వ్యాప్తంగా ఇళ్లపైనా, బహిరంగ ప్రదేశాల్లోనూ నల్ల జెండాలు ఎగురుతాయి. తమిళనాడు గ‌ళాన్ని గౌరవించి వెనక్కి తగ్గడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తే, తీవ్ర‌ పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది. భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వ‌స్తుంది. డీఎంకే అధ్యక్షుడిగా, అన్నింటికంటే ముఖ్యంగా ఆత్మగౌరవం గల తమిళుడిగా ఇది నా హెచ్చరిక'' అని స్టాలిన్ త‌న సందేశంలో పేర్కొన్నారు.

ఎంపీల‌తో అత్య‌వ‌స‌ర భేటీ
నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్‌వ్య‌వ‌స్థీక‌ర‌ణ బిల్లు పార్ల‌మెంట్‌లో చ‌ర్చ‌కు రానున్న నేప‌థ్యంలో డీఎంకే ఎంపీల‌తో స్టాలిన్ ఈ రోజు ఉద‌యం అత్య‌వ‌స‌ర భేటీ నిర్వ‌హించారు. పార్ల‌మెంట్ స‌మావేశాల్లో త‌మ పార్టీ అనుస‌రించాల్సిన వ్యూహాల గురించి ఎంపీల‌తో ఆయ‌న‌ చ‌ర్చించారు. కాగా, గురువారం నుంచి మూడు రోజుల పాటు జ‌ర‌గ‌నున్న పార్ల‌మెంట్ ప్ర‌త్యేక స‌మావేశాల‌పై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. 

కేంద్రానికి మరోసారి సీఎం స్టాలిన్ హెచ్చరిక

స్టాలిన్‌కు ఓట‌మి భ‌యం: అన్నామ‌లై
స్టాలిన్ వ్యాఖ్య‌ల‌పై త‌మిళ‌నాడు బీజేపీ మాజీ అధ్య‌క్షుడు, జాతీయ కార్య‌వ‌ర్గ స‌భ్యుడు అన్నామ‌లై స్పందించారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓడిపోతామ‌నే భ‌యంతో స్టాలిన్ ప్ర‌తి అంశాన్ని రాజ‌కీయం చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. డీలిమిటేష‌న్ అంశాన్ని రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం వివాదం చేస్తున్నార‌ని ఆరోపించారు. కోయంబ‌త్తూరులో అన్నామ‌లై మీడియాతో మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ వీలైనంత త్వ‌ర‌గా అమ‌లు చేయాల‌ని త‌మిళ‌నాడు మ‌హిళ‌లు కోరుకుంటున్నారని చెప్పారు. త‌మిళ‌నాడులో ఈసారి భారీ మెజారిటీతో ఎన్డీఏ అధికారంలోకి వ‌స్తుంద‌ని విశ్వాసం వ్య‌క్తం చేశారు. ప్ర‌జ‌లు మార్పు కోరుకుంటున్నార‌ని, డీఎంకే ప్ర‌భుత్వం పోవాల‌ని భావిస్తున్నార‌ని చెప్పారు. భారీ మెజారిటీతో ఎడ‌ప్పాడి ప‌ళ‌నిస్వామి ముఖ్య‌మంత్రి అవుతార‌ని జోస్యం చెప్పారు. 

  చ‌ద‌వండి: గెలిస్తే ఏఐ యూనివ‌ర్సిటీ, మంత్రిత్వ శాఖ‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement