సాక్షి, చెన్నై : టీవీకే అధికారంలోకి వస్తే తమిళనాడును దేశానికే ఏఐ రాజధానిగా మారుస్తామని ఆ పార్టీ అధినేత విజయ్ ప్రకటించారు. రాష్ట్రంలో మొట్టమొదటి ఏఐ సాంకేతిక విశ్వవిద్యాలయాన్ని, అలాగే ఒక ప్రత్యేక ఏఐ నగరాన్ని నిర్మిస్తామని వివరించారు. ఇక ఒక ప్రత్యేక ఏఐ మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం టీవీకే అధినేత విజయ్ కన్యాకుమారిలో పర్యటించారు. జాతీయ రహదారిలో ప్రజల్ని ఆకర్షించే విధంగా సైకిల్ తొక్కు తూ ముందుకు సాగారు.
నా గుండెల్లో..
కన్యాకుమారిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో విజయ్ మాట్లాడుతూ: ‘నా గుండెల్లో నివసించే కన్యాకుమారి, కారైక్కుడి ప్రజలకు నా నమస్కారాలు అని వ్యాఖ్యానించారు. ఆ రోజు కారైక్కుడిలో తాను మాట్లాడలేకపోయానని గుర్తు చేశారు. ఇప్పుడు టీవీకే ప్రభుత్వం చేపట్టబోయే కొన్ని పథకాలను ఇక్కడ ప్రకటిస్తున్నానని వివరించారు. టీవీకే ప్రభుత్వం ఏర్పడితే, పాలనలో ఎటువంటి అవినీతి లేకుండా ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతాయన్నారు.
ఇందుకోసం ఆధార్ కార్డు తరహాలోనే తమిళనాడులో ఒక ప్రత్యేక గుర్తింపు కార్డును రూపొందిస్తామన్నారు. ఏఐ డేటా సహా యంతో, ఎటువంటి మధ్యవర్తులు లేకుండా, లంచం ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఈ కార్డు ద్వారా పథకాలు నేరుగా ప్రజలకు అందుతాయని వివరించారు. దీని కోసం ప్రజలు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాల్లో ఏదైనా పని కావాలంటే రకరకాలుగా తిప్పించుకుంటున్నారని, ఇందుకు ప్రధాన కారణం లంచం. లంచం... అంటూ ఇలా తీసుకునే లంచం కేవలం అధికారులకే కాకుండా, మంత్రుల వరకు వెళ్తోందని ఆరోపించారు.
సేవా ధృవీకరణ పథకం
టీవీకే అధికారంలోకి రాగానే ‘తమిళనాడు సేవ «ధృవీకరణ పథకం రూపొందిస్తామని ప్రకటించారు. ఒక మొబైల్ యాప్ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్ సహా అన్ని ప్రభుత్వ సేవలను మధ్యవర్తులు లేకుండా, లంచం ఇవ్వకుండా పొందవచ్చు అని వివరించారు. ప్రస్తుతం బడ్జెట్ అనేది కేవలం ఒక పత్రం లాగే కనిపిస్తున్నదని, ఆ నిధులు ఎక్కడికి వెళ్తున్నా యో తెలియడం లేదంటూ, ఇది చిదంబర రహ స్యం లాగా స్టాలిన్ రహస్యంగా ఉంటోందని ఆరోపించారు. ఇక, జాలర్ల భద్రత గురించి ప్రస్తావిస్తూ, నిషేధ కాలంలో ఇస్తున్న రూ. 8 వేలు సాయాన్ని రూ. 20 వేలకు పెంచుతామని ప్రకటించారు.
పడవల్ని రక్షించేందుకు రాయబార కార్యాలయం ద్వారా దౌత్య పరంగా చర్యలు తీసుకుంటామని పేర్కొంటూ, అంత వరకు బ్యాంక్ రుణాల చెల్లింపు, జాలర్ల కుటుంబాలకు సాయం నిమిత్తం పడవ యజమానికి రూ. 5 లక్షల వరకు మధ్యంత నివారణ నిధులు అందజేస్తామని వివరించారు. కడల్ తాయ్ ఇల్లం పేరిట సముద్ర తీరంలో ఉన్న గుడిసెలు, పాడు బడ్డ గృహాలను తొలగించి, వాటి స్థానంలో ఎలాంటి విపత్తులైనా ఎదుర్కొనే విధంగా గృహాలను నిర్మించి ఇస్తామన్నారు. అలాగే, ఇంధన రక్షణ పథకం ద్వారా నెలకు 1800 లీటర్ల నుంచి 3 వేల లీటర్లుగా కోటాను పెంచుతామని, లీటరకు రూ. 15 సబ్సిడీ పడవ యజామాని బ్యాంక్‌ఖాతాలో నేరుగా జమ చేస్తామని ప్రకటించారు.


