
ముంబై: కొంకణ్ రైల్వే(Konkan Railway) భారతీయ రైల్వేలో విలీనం కానుంది. మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ (కేఆర్‌సీఎల్)ను భారతీయ రైల్వేలలో విలీనం చేయడానికి అధికారికంగా అంగీకరించింది. గోవా, కర్ణాటక, కేరళలు ఇప్పటికే ఈ విలీనాన్ని ఆమోదించాయి. కొంకణ్ రైల్వే విలీనంపై మహారాష్ట్ర నిర్ణయం తీసుకున్న దరిమిలా కీలకమైన ఈ రైల్వే లైన్ జాతీయ నెట్‌వర్క్‌తో అనుసంధానం కానుంది.
పశ్చిమ కనుమల మీదుగా రైల్వే లైన్లను నిర్మించే కష్టతరమైన పనిని చేపట్టేందుకు కొంకణ్ రైల్వే (కేఆర్) 1990లో రైల్వే మంత్రిత్వ శాఖలో ప్రత్యేక విభాగంగా ఏర్పాటయ్యింది. 1998, జనవరిలో అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్.. మహారాష్ట్ర(Maharashtra)లోని రోహా, గోవా, కర్ణాటకలోని మంగళూరు, తీరప్రాంత కేరళను అనుసంధానించడానికి, కొంకణ్ తీరం వెంబడి సరుకులు, ప్రయాణికుల రాకపోకలకు అనువుగా మారింది. ఈ రైల్వేలైన్ పొడవు 741 కి.మీ. ఈ రైలు మార్గం ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించింది. వివిధ రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాలు, నగరాలకు అనుసంధానమయ్యింది.
కేఆర్‌సీఎల్ ఒక జాయింట్ వెంచర్‌గా ఏర్పాటయ్యింది. దీనిలో భారత ప్రభుత్వం 51శాతం వాటాను కలిగి ఉంది, మహారాష్ట్ర 22 శాతం, కర్ణాటక 15శాతం, గోవా, కేరళలుఘ ఆరు శాతం చొప్పున వాటాను కలిగి ఉన్నాయి. ఈ లైన్ 1990లో ప్రారంభమయ్యింది. కార్యాచరణపరంగా ఈ ప్రాజెక్టు విజయవంతం అయినప్పటికీ, కేఆర్‌సీఎల్ ఏళ్ల తరబడి ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతోంది. తక్కువ ఆదాయం, పెరుగుతున్న మౌలిక సదుపాయాల డిమాండ్లు కేఆర్‌సీఎల్‌కు భారంగా మారాయి. ఈ నేపధ్యంలో కేఆర్‌సీఎల్(KRCL) భారత రైల్వేలో విలీనం కావాలని నిశ్చయించింది. దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వ ఆమోదాన్ని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ఒక లేఖ ద్వారా తెలియజేశారు.
ఈ విలీనం ఈ మార్గంలో కొత్త ప్రాజెక్టులకు నాంది పలకడంతోపాటు, కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది. అయితే ఈ విలీనం రెండు షరతులకు లోబడి ఉండాలని ఫడ్నవిస్ ఆ లేఖలో పేర్కొన్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం సమ్మతించినట్లు సమాచారం. ఈ మేరకు కొంకణ్ రైల్వే అనే పేరు ఈ మార్గానికి కొనసాగడంతో పాటు, భారతీయ రైల్వే మహారాష్ట్రకు రూ. 394 కోట్లకు పైగా మొత్తాన్ని చెల్లించనుంది. సంబంధిత వర్గాలు అందించిన సమాచారం ప్రకారం ఈ విలీన ప్రక్రియ వాస్తవ రూపం దాల్చడానికి కొన్ని నెలలు పట్టే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: సెమికోలన్ ఎక్కడ?.. ఎందుకు మాయమవుతోంది?