రాజ్యసభకు సిద్దరామయ్య నో! | Karnataka Leadership Change Nears, Siddaramaiah Rejects Rajya Sabha, DK Shivakumar Set To Take Charge As CM? | Sakshi
Sakshi News home page

రాజ్యసభకు సిద్దరామయ్య నో!

May 28 2026 7:44 AM | Updated on May 28 2026 10:50 AM

Karnataka News: Siddaramaiah rejects Rajya Sabha

కర్ణాటక రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా ఉత్కంఠ రేపుతున్న నాయకత్వ మార్పు అంశంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అధిష్టానం బుజ్జిగింపుతో ముఖ్యమంత్రి పదవి నుంచి సిద్ధరామయ్య తప్పుకునేందుకు సిద్ధమైనట్లు స్పష్టమైన సంకేతాలు అందుతున్నాయి. అయితే జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారన్న ప్రచారానికి మాత్రం ఆయన బ్రేక్‌ వేసినట్లు తెలుస్తోంది.

రాజ్యసభకు వెళ్లే ఆలోచన ప్రస్తుతం తనకు లేదని, మరో రెండేళ్లు ఎమ్మెల్యేగా కొనసాగాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో కాంగ్రెస్‌లో జరుగుతున్న ‘పవర్‌ ట్రాన్సిషన్‌’ మరింత ఆసక్తికరంగా మారింది. సిద్దరామయ్య రాజ్యసభకు వెళ్లేందుకు నిరాకరించడం కర్ణాటక కాంగ్రెస్‌లో శక్తి సమీకరణాలు ఇంకా పూర్తిగా డీకే శివకుమార్‌వైపు మారలేదనే సంకేతంగా కనిపిస్తోంది. 

మరో రెండేళ్లు ఎమ్మెల్యేగా కొనసాగాలని నిర్ణయించడం ద్వారా రాష్ట్ర రాజకీయాలపై తన పట్టు కొనసాగించాలని ఆయన భావిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా తన వర్గానికి ప్రభుత్వంలో ప్రాధాన్యం తగ్గకుండా చూడాలన్న వ్యూహం ఇందులో కనిపిస్తోంది. మరోవైపు సీఎం మార్పు జరిగినా.. సిద్దరామయ్య ప్రభావం అలాగే కొనసాగుతుందనే సందేశాన్ని పార్టీ హైకమాండ్‌ కూడా ఇవ్వాలనుకుంటోందని అంటున్నారు. దీంతో డీకే శివకుమార్‌కు సీఎం పదవి దక్కినా.. కాంగ్రెస్‌లో అసలు పవర్‌ సెంటర్‌ ఎవరు అనే చర్చ మాత్రం ఇంకా కొనసాగుతోంది.

ఇప్పటికే కాంగ్రెస్‌ అధిష్టానం బెంగళూరు-ఢిల్లీ మధ్య వరుస చర్చలు నిర్వహిస్తోంది. సీఎం మార్పుపై ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో పార్టీ కార్యాలయాలు, కీలక నేతల నివాసాలు రాజకీయ చర్చలకు కేంద్రాలుగా మారాయి. ఈ నేపథ్యంలో సిద్దరామయ్య గురువారం మధ్యాహ్నం తర్వాత రాజీనామా చేసే అవకాశముందని కాంగ్రెస్‌ వర్గాలు సంకేతాలు ఇస్తున్నాయి. ఆయన రాజీనామా అనంతరం డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను కొత్త ముఖ్యమంత్రిగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.

అయితే ఈ మార్పు కేవలం పదవి బదిలీ మాత్రమే కాదని.. కాంగ్రెస్‌ అంతర్గత శక్తి సమీకరణాలకు సంబంధించినదిగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా సిద్దరామయ్య వర్గానికి ప్రభుత్వంలో తగిన ప్రాధాన్యం కొనసాగించేలా ఫార్ములా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. డీకే శివకుమార్‌ నేతృత్వంలో ఏర్పడే కొత్త మంత్రివర్గంలో సిద్దరామయ్య అనుచరులకు కీలక పదవులు దక్కే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

శనివారం డీకే శివకుమార్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశాలపై కాంగ్రెస్‌లో జోరుగా చర్చ జరుగుతోంది. అయితే అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. ఈ నేపథ్యంలో సిద్దరామయ్య గురువారం సాయంత్రం ఢిల్లీలో పార్టీ అధిష్టానంతో సమావేశమై మార్పు ప్రక్రియకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉందని సమాచారం.

ఇదిలా ఉండగా, కాంగ్రెస్‌ హైకమాండ్‌ కూడా కర్ణాటకలో అధికారం మార్పును ఎలాంటి అసంతృప్తులు లేకుండా నిర్వహించాలని చూస్తోంది. ఒకవైపు డీకే శివకుమార్‌కు సీఎం పదవి ఇచ్చే హామీని నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి ఉండగా.. మరోవైపు సిద్దరామయ్య ప్రభావాన్ని కూడా తగ్గించకుండా సమతౌల్యం పాటించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఇక ప్రతిపక్ష బీజేపీ మాత్రం కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలను “అధికార పోరు”గా అభివర్ణిస్తోంది. సీఎం కుర్చీ కోసం కాంగ్రెస్‌లో అంతర్గతంగా తీవ్ర పోటీ నడుస్తోందని విమర్శిస్తోంది. అయితే కాంగ్రెస్‌ నేతలు మాత్రం ఇది పార్టీ అంతర్గత వ్యవహారమని, మార్పు ప్రక్రియ పూర్తిగా సమన్వయంతోనే జరుగుతోందని చెబుతున్నారు.

కర్ణాటక రాజకీయాల్లో ఇప్పుడు అందరి దృష్టి ఒక్కటే.. సిద్దరామయ్య నిజంగా రాజీనామా చేస్తారా? డీకే శివకుమార్‌ ఎప్పుడు సీఎం అవుతారు? అనే దానిపైనే నిలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement