సుప్రీంకోర్టు: నాటి త్రిమూర్తులు ఒక్కరై మిగిలారు..

Justice Chandrachud: Only One Female Judge Remaining In SC - Sakshi

న్యూఢిల్లీ: జస్టిస్‌ ఇందు మల్హోత్రా తాజాగా పదవీ విరమణ పొందడంతో సుప్రీం కోర్టులో ప్రస్తుతం ఒకే ఒక మహిళా జడ్జి మిగిలారు! మూడేళ్ల క్రితం ఇందిరా బెనర్జీ చేరికతో సుప్రీం కోర్టులో ఒకేసారి ముగ్గురు మహిళా న్యాయమూర్తులు (అప్పటికే ఉన్న జస్టిస్‌ భానుమతి, జస్టిస్‌ ఇందు మల్హోత్రాలతో కలిపి) ఉండటం పెద్ద  విశేషం అయింది. గత ఏడాది జూలైలో జస్టిస్‌ భానుమతి రిటైర్‌ అయ్యారు. ఇప్పుడు జస్టిస్‌ ఇందు మల్హోత్రా పదవీ విరమణ పొందారు. ప్రస్తుతం జస్టిస్‌ ఇందిర ఒక్కరే ఉన్నారు! నాటి త్రిమూర్తులు ఒక్కరై మిగిలారు.

అరుదైన ఖగోళ అద్భుతంగా మూడేళ్ల క్రితం ఒక విశేషం వార్తల్లోకి వచ్చింది. ‘జస్టిస్‌ ఇందిరా బెనర్జీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా అడుగు పెట్టడంతో దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఒకేసారి ముగ్గురు మహిళా న్యాయమూర్తులు ఉన్నట్లయింది’ అన్నది ఆ విశేషం. 2018 ఆగస్టున సుప్రీం కోర్టుకు వచ్చారు జస్టిస్‌ ఇందిర. మిగతా ఇద్దరు జస్టిస్‌ ఆర్‌. భానుమతి, జస్టిస్‌ ఇందూ మల్హోత్రా. గత జూలైలో భానుమతి, మొన్న శనివారం ఇందూ మల్హోత్రా రిటైర్‌ అయ్యారు. ఇక మిగిలింది ఇందిరా బెనర్జీ ఒక్కరే. జస్టిస్‌ మల్హోత్రా పదవీ విరమణ సందర్భంగా సుప్రీంకోర్టు ‘యంగ్‌ లాయర్స్‌ ఫోరమ్‌’ ఆమెకు ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలో జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ మాట్లాడారు. సుప్రీంకోర్టులో మహిళా జడ్జిల సంఖ్య పెరగవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు. 

తాజాగా పదవీ విరమణ పొందిన జస్టిస్‌ ఇందూ మల్హోత్రా బార్‌ కౌన్సిల్‌ నుంచి నేరుగా జడ్జి అయిన తొలి మహిళా జస్టిస్‌. సుప్రీంకోర్టులో ఆమె 30 ఏళ్లు పాక్టీస్‌ చేశారు. ప్రస్తుతం మిగిలిన ఏకైక మహిళా జస్టిస్‌ ఇందిరా బెనర్జీ సుప్రీం కోర్టులో చరిత్రలో 8 వ మహిళా న్యాయమూర్తి. వచ్చే సెప్టెంబరులో జస్టిస్‌ ఇందిర పదవీ విరమణ పొందేలోపు కొత్త మహిళా న్యాయమూర్తి రాకపోతే ఆమె తర్వాత సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తులే కనిపించని పరిస్థితి ఉంటుంది.  

భారత సుప్రీంకోర్టు ఏర్పాటైన (1950) నలభై ఏళ్లకు 1989 అక్టోబరులో ఫాతిమా బీవీ సుప్రీంకోర్టుకు తొలి మహిళా జడ్జిగా వచ్చారు. 1992 ఏప్రిల్‌ వరకు ఉన్నారు. జస్టిస్‌ ఫాతిమా తర్వాత జస్టిస్‌ సుజాత మనోహర్‌ (1994–1999), జస్టిస్‌ రుమాపాల్‌ (2000–2006), జస్టిస్‌ జ్ఞాన సుధా మిశ్రా (2010–2014), జస్టిస్‌ రంజనా దేశాయ్‌ (2011–2014), జస్టిస్‌ భానుమతి (2014–2020), జస్టిస్‌ ఇందూ మల్హోత్రా (2018–2021) సుప్రీం కోర్టు మహిళా న్యాయమూర్తులుగా సేవలు అందించారు. ప్రస్తుతం ఉన్న జస్టిస్‌ ఇందిరా బెనర్జీ మద్రాసు హైకోర్టు జడ్జిగా ఉన్న సమయంలోనే సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన అనేక కమిటీలలో పనిచేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top