
ప్రమాణస్వీకారం చేయించిన రాష్ట్రపతి
పాల్గొన్న ఉపరాష్ట్రపతి, మోదీ తదితరులు
తొలి బౌద్ధుడు, రెండో దళితునిగా రికార్డు
న్యాయవాదులకు జై భీం అంటూ అభివాదం
న్యూఢిల్లీ: భారత 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. ఉదయం రాష్ట్రపతి భవన్‌లోని గణతంత్ర మండపంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, గవర్నర్లు తదితరులు పాల్గొన్నారు.
జస్టిస్ గవాయ్ హిందీలో ప్రమాణస్వీకారం చేశారు. ఆయన సుప్రీంకోర్టుకు తొలి బౌద్ధ ప్రధాన న్యాయమూర్తి. జస్టిస్ కేజీ బాలకృష్ణన్ తర్వాత రెండో దళిత సీజేఐ. ప్రమాణస్వీకారం తర్వాత తల్లి కమల్ తాయ్ పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం సుప్రీంకోర్టు ప్రాంగణంలో గాం«దీ, అంబేడ్కర్ విగ్రహాల వద్ద నివాళులర్పించారు. న్యాయవాదులు తదితరులు తనకు శుభాకాంక్షలు తెలపగా ‘జై భీమ్’ అంటూ నినదించారు.
న్యాయవ్యవస్థలోని అత్యున్నత స్థానం నుంచి సామాజిక న్యాయం తాలూకు శక్తిమంతమైన ప్రకటనకు ఆ నినాదం ప్రతీక అని సుప్రీంకోర్టు బార్ పేర్కొంది. జస్టిస్ గవాయ్ ప్రమాణస్వీకార ఫొటోలను మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఆయనతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తదితరులు జస్టిస్ గవాయ్‌కి శుభాకాంక్షలు తెలిపారు. 64 ఏళ్ల జస్టిస్ గవాయ్ మహారాష్ట్ర నుంచి సీజేఐ పదవి చేపట్టిన ఆరో వ్యక్తి. మంగళవారం రిటైరైన సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా స్థానంలో బాధ్యతలు స్వీకరించారు. ఆర్నెల్ల పాటు, అంటే నవంబర్ 23 దాకా విధులు నిర్వర్తిస్తారు.
ప్రజా పక్షపాతి
జస్టిస్ గవాయ్‌ది అతి సాధారణ కుటుంబంలో జన్మించి అత్యున్నత స్థానానికి చేరిన అత్యంత స్ఫూర్తిదాయక నేపథ్యం. ఆయన 1960 నవంబర్ 24న మహారాష్ట్రలో అవరావతి జిల్లాలోని ఓ కుగ్రామంలో జని్మంచారు. ఆయన తండ్రి ఆర్‌ఎస్ గవాయ్ రాజకీయ నాయకుడు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (గవాయ్)ని స్థాపించారు. జస్టిస్ గవాయ్ న్యాయప్రస్థానం 1985లో న్యాయవాదిగా మొదలైంది.
నాగపూర్, అమరావతి కార్పొరేషన్ల స్టాండింగ్ కౌన్సిల్‌గా వ్యవహరించారు. 1993లో బాంబే హైకోర్టు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్‌గా, ఏడాదికి అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా, 2000లో నాగపూర్ బెంచ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమితులయ్యారు. 2003లో బాంబే హైకోర్టు అదనపు న్యాయమూర్తి, రెండేళ్లకు శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. 2019లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.
చరిత్రాత్మక తీర్పులు
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్ 700కు పైగా ధర్మాసనాల్లో సభ్యునిగా, సారథిగా ఉన్నారు. 300కు పైగా తీర్పులు వెలువరించారు. రాజ్యాంగపరమైన అంశాలు, పౌర హక్కులకు సంబంధించిన పలు కీలక తీర్పులు వాటిలో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు బుల్డోజర్లతో ఇళ్లు కూల్చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనానికి జస్టిస్ గవాయ్ నాయకత్వం వహించారు.
కూల్చివేతలను తీవ్రంగా తప్పుబట్టడమే గాక వాటికి అడ్డుకట్ట వేస్తూ కఠిన నిబంధనలు రూపొందించారు. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆరి్టకల్ 370ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం సబబేనని తీర్పు వెలువరించిన, పారీ్టలకు విరాళాలిచ్చే ఎన్నికల బాండ్లను రద్దు చేసిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనాల్లో ఆయన సభ్యులు. పెద్ద నోట్ల రద్దు సబబేనని 4:1 మెజారిటీతో తీర్పు వెలువరించిన, ఎస్సీల్లో ఉప వర్గీకరణ చేసే అధికారాన్ని రాజ్యాంగం రాష్ట్రాలకు కల్పించిందంటూ 6:1తో తీర్పిచ్చిన రాజ్యాంగ ధర్మాసనాల్లో కూడా జస్టిస్ గవాయ్ ఉన్నారు.
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో క్రీమీలేయర్ నిబంధనను ప్రవేశపెట్టాలని ఈ కేసులో భాగంగానే తీర్పు వచ్చింది. మహిళల ఛాతీ పట్టుకోవడం, పైజామా లాగడం అత్యాచార యత్నం పరిధిలోకి రాబోవన్న అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యలను జస్టిస్ గవాయ్ ధర్మాసనం తీవ్రంగా తప్పుబట్టడమే గాక ఆ తీర్పుపై స్టే విధించింది. పలు రాజ్యాంగ, పర్యావరణ సంబంధ అంశాలపై కొలంబియా, హార్వర్డ్ తదితర ప్రపంచ ప్రఖ్యాత వర్సిటీల్లో జస్టిస్ గవాయ్ ప్రసంగాలిచ్చారు. దేశవ్యాప్త సంచలనానికి కారణమైన వక్ఫ్ చట్టం రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన కేసులను ఆయన ధర్మాసనమే విచారించాల్సి ఉంది.