పాక్‌ మధ్యవర్తిత్వం? ఇరాన్‌ ఏమందంటే? | Iran Supreme Leader's representative in India refutes Pakistan's mediation role | Sakshi
Sakshi News home page

పాక్‌ మధ్యవర్తిత్వం? ఇరాన్‌ ఏమందంటే?

Apr 5 2026 8:11 PM | Updated on Apr 5 2026 8:22 PM

Iran Supreme Leader's representative in India refutes Pakistan's mediation role

పట్నా: పశ్చిమాసియా యుద్ధాన్ని ఆపడానికి పాకిస్థాన్ మధ్యవర్తిత్వ పాత్రను పోషిస్తోందంటూ వస్తున్న ప్రచారాన్ని ఇరాన్ సుప్రీం లీడర్ భారత ప్రతినిధి అబ్దుల్ మజీద్ హకీమ్ ఇలాహి తిరస్కరించారు. బిహార్‌ రాజధాని పట్నాలో ఆదివారం ఇలాహి ఓ ఇంటరర్వ్యూలో మాట్లాడారు. యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్, అమెరికా మధ్య చర్చలు పాకిస్థాన్ ద్వారా జరుగుతున్నాయనే వాదనలు నిజం కాదని తెలిపారు.

"ఈ విషయంలో పాక్‌కు ఎలాంటి పాత్ర లేదు. పాకిస్థాన్ ద్వారా ఇరాన్, అమెరికా మధ్య చర్చలు జరిగాయన‍్న వాదనల్లో నిజం లేదు. ఇటువంటి మాటలను అమెరికా కేవలం చమురు ధరలను తగ్గించడానికే చెబుతోంది. వారు నిజంగా చర్చలకు సిద్ధంగా లేరు. కొన్ని దేశాలను ఉపయోగించాలనుకున్నారు. చర్చలు జరపాలనుకుంటున్నామని చెప్పారు.. కానీ, అది నిజం కాదు" అని ఆయన తెలిపారు.

శాంతి ప్రయత్నాల్లో భారతదేశం పాత్ర పోషించగలదా? అనే ప్రశ్నకు ఇలాహి స్పందిస్తూ.. భారతదేశం సహా ఇతర అన్ని దేశాలు కూడా ఈ యుద్ధాన్ని ఆపడానికి సహకరించవచ్చని అన్నారు. ఈ సంక్షోభాన్ని పరిష్కరించడానికి మంచి పాత్రను పోషించవచ్చని పేర్కొన్నారు.

యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందనే ప్రశ్నకు ఇలాహి స్పందిస్తూ.. యుద్ధం ముగింపు అనేది అమెరికా, ఇజ్రాయెల్ చర్యలపై ఆధారపడి ఉందని చెప్పారు. ఫిబ్రవరి 28న వారు యుద్ధాన్ని ప్రారంభించారు. ఆసుపత్రులు, పాఠశాలలు, నివాస ప్రాంతాలు వంటి పౌర మౌలిక సదుపాయాలపై దాడులు జరిగాయని అన్నారు.

"ఈ యుద్ధాన్ని ప్రారంభించిన దేశాలపైనే యుద్ధం ముగింపు అంశం ఆధారపడి ఉంది. వారు ఇరాన్‌పై దాడులు ప్రారంభించారు. ఆసుపత్రులు, పాఠశాలలు, మానవ వనరుల కేంద్రాలు, గనులపై దాడులు చేశారు. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. చాలా మంది పౌరులు మరణించారు. వారు ఆపితే యుద్ధం ముగుస్తుంది" అని చెప్పారు.

ఇరాన్ యుద్ధాన్ని కోరుకోలేదని.. ఈ ఘర్షణ వల్ల అనేక దేశాల పౌరులు బాధపడుతున్నారని ఇలాహి చెప్పారు. ప్రపంచ నాయకులు జోక్యం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

"దురదృష్టవశాత్తు ఇది అధర్మ యుద్ధం. ప్రపంచంలోని అనేక మంది బాధపడుతున్నారు. ప్రపంచ నాయకులు కలిసి ఈ యుద్ధాన్ని ప్రారంభించిన దేశాలను ఆపాలని కోరాలి" అని తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement