
సైనిక ఆపరేషన్స్ డీజీల వెల్లడి
పాక్ సైన్యం వేడుకున్నందుకే విరమణ
దుస్సాహసానికి దిగితే మళ్లీ గుణపాఠం
వారి దాడులను దీటుగా తిప్పికొట్టాం
కీలక ఎయిర్‌బేస్‌లను ధ్వంసం చేశాం
పలు యుద్ధ విమానాలు కూల్చేశాం
40 మందికి పైగా పాక్ సైనికులు మృతి
ఉగ్రవాదం అంతానికే ‘ఆపరేషన్ సిందూర్’
100కు పైగా ముష్కరులు హతం
పలువురు కీలక అగ్రనేతలు కూడా
మీడియాకు వెల్లడించిన డీజీలు
న్యూఢిల్లీ: త్రివిధ బలగాలు నాలుగు రోజుల పాటు చేపట్టిన సంయుక్త ఆపరేషన్‌లో పాకిస్తాన్ కోలుకోలేని రీతిలో దెబ్బతిన్నట్టు భారత సైన్యం వెల్లడించింది. పాక్ సైన్యం అత్యంత తీవ్రస్థాయిలో నష్టాలు చవిచూసిందని తెలిపింది. ఇకముందు కూడా పాక్ ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. మర్చిపోలేని రీతిలో గుణపాఠం చెప్పడం ఖాయమని స్పష్టం చేసింది.
‘‘పాకిస్తాన్ విజ్ఞప్తి మేరకే కాల్పుల విరమణకు అంగీకారం కుదిరింది. కానీ గంటల్లోనే ఒప్పందాన్ని ఉల్లంఘించి పాక్ సైన్యం కాల్పులు, దాడులకు దిగింది. ఇదే పరిస్థితి కొనసాగితే మన ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుంది. మన బలగాలు అందుకు పూర్తిగా సంసిద్ధంగా ఉన్నాయి. క్షేత్రస్థాయి పరిస్థితిని బట్టి ఎప్పటికప్పుడు దీటుగా స్పందించేందుకు బలగాలకు సైన్యాధ్యక్షుడు పూర్తి అధికారాలిచ్చారు’’ అని డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్(డీజీఎంఓ) లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ ప్రకటించారు.
డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎయిర్ ఆపరేషన్స్(డీజీఏఓ) ఎయిర్ మార్షల్ ఏకే భారతి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ నావల్ ఆపరేషన్స్(డీజీఎన్‌ఓ) వైస్ అడ్మిరల్ ఏఎన్ ప్రమోద్‌తో కలిసి ఆయన ఆదివారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్, తదనంతరం సరిహద్దు రాష్ట్రాలపై పాక్ దాడులు, మన సైనిక ప్రతిచర్య తదితరాల అంశాలను కూలంకషంగా వివరించారు. మొత్తం ఆపరేషన్‌లో ఐదుగురు భారత సైనికులు అమరులైనట్లు వెల్లడించారు. అమర జవాన్లకు, పాక్ మతిలేని దాడుల్లో దుర్మరణం పాలైన భారత పౌరులకు ఘనంగా నివాళులు అరి్పంచారు. సైనిక ఆపరేషన్ల గురించి త్రివిధ దళాల అత్యున్నతాధికారులు ఇలా సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించడం అత్యంత అరుదు కావడం విశేషం.
ఆ ముష్కరులు హతం
‘‘పలు అత్యాధునిక పాక్ యుద్ధ విమానాలను నేలకూల్చాం. మనకున్న సమాచారం మేరకే 40 మందికి పైగా పాక్ సైనికులు మరణించారు. 100 మందికిపైగా ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో కరడుగట్టిన ఉగ్రవాదులు యూసుఫ్ అజార్, అబ్దుల్ మాలిక్ రవూఫ్, ముదాసిర్ అహ్మద్ తదితరులు ఉన్నారు. 1999లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని హైజాక్ చేసినవారు, 2019లో పుల్వామా దాడికి పాల్పనవారు మరణించారు.
పాక్, పీఓకేలో తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేశాం. అజ్మల్ కసబ్, డేవిడ్ హెడ్లీ ఉగ్రవాద శిక్షణ పొందిన కేంద్రాలు నేలమట్టమయ్యాయి. పాక్ రాజధాని ఇస్లామాబాద్‌కు కూతవేటు దూరంలోని అతి కీలకమైన చక్లాలా సహా ప్రధాన వైమానిక స్థావరాలన్నీ మన దాడుల్లో కోలుకోలేని విధంగా దెబ్బతిన్నాయి. లాహోర్ తదితర సైనిక స్థావరాల్లోని కీలక రాడార్ వ్యవస్థలు నేలమట్టమయ్యాయి. ఉగ్రవాదాన్ని సహించే ప్రసక్తే లేదు’’ అని డీజీఎంఓ రాజీవ్ ఘాయ్ వివరించారు.
ఇకపై తమ భూభాగంలో ఏ ప్రాంతమూ సురక్షితం కాదని పాకిస్తాన్‌కు పూర్తిస్థాయిలో తెలిసొచ్చిందన్నారు. ‘‘మనం ఎంతో సంయమనం పాటించాం. కేవలం పాక్ ఉగ్రవాద స్థావరాలనే లక్ష్యంగా చేసుకొని కచ్చితత్వంతో కూడిన దాడులు చేశాం. సామాన్య ప్రజల నివాసాలకు ఎలాంటి నష్టం జరగకుండా జాగ్రత్తపడ్డాం. మన దేశ సార్వ¿ౌమత్వం ప్రాదేశిక సమగ్రతకు, పౌరుల భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లినా నిర్ణయాత్మకంగా ప్రతిస్పందిస్తాం’’ అని ఉద్ఘాటించారు. పాకిస్తాన్ డీజీఎంఓ శనివారం మధ్యాహ్నం తనతో మాట్లాడారని, దాడులు ఆపాలని కోరారని తెలిపారు.
ఉగ్రవాద క్యాంపులు భస్మీపటలం
పాక్ దాడుల్లో భారత్ కూడా యుద్ధ విమానాలు నష్టపోయిందా అని ప్రశ్నించగా, యుద్ధంలో కొన్ని నష్టాలు సహజమని ఎయిర్ మార్షల్ ఎ.కె.భారతి బదులిచ్చారు. అయితే, ‘‘లక్ష్యాలన్నీ సాధించాం. మన పైలెట్లంతా సురక్షితంగా తిరిగొచ్చారు’’ అని చెప్పారు. ‘‘పాక్ యుద్ధ విమానాలు మన భూభాగంలోకి ప్రవేశించకుండా తిప్పికొట్టాం. అయితే, కచ్చితంగా ఎన్ని యుద్ధ విమానాలు కూల్చేశామన్నది ఇప్పుడే బయటపెట్టలేం. పాకిస్తాన్ ఎయిర్‌బేస్‌లు, కమాండ్ సెంటర్లు, సైనిక మౌలిక సదుపాయాలు, గగనతల రక్షణ వ్యవస్థలను నాశనం చేశాం. పాక్ రాజధాని ఇస్లామాబాద్ దాకా చొచ్చుకెళ్లాం. అక్కడ వైమానిక స్థావరాన్ని నేలమట్టం చేశాం. ఉగ్రవాదుల క్యాంప్‌లను నామరూపాల్లేకుండా చేయాలన్న లక్ష్యం ఇప్పటికే సాధించాం. ఈ ఫలితాలు మొత్తం ప్రపంచానికి అనుభవంలోకి వస్తాయి’’ అని ఎ.కె.భారతి స్పష్టం చేశారు. పాక్ వైమానిక స్థావరాలకు జరిగిన నష్టాన్ని ఫొటోల సాయంతో వివరించారు.
పాక్ హార్బర్లకు తీవ్ర నష్టం
ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా సముద్రంతోపాటు భూఉపరితలంపై నిర్దేశిత లక్ష్యాలపై కచ్చితత్వంతో కూడిన దాడులు చేశామని వైస్ అడ్మిరల్ ఎ.ఎన్.ప్రమోద్ చెప్పారు. పాకిస్తాన్‌లో ప్రధానమైన కరాచీలోనూ దాడులు జరిగాయని తెలిపారు. ‘‘పహల్గాం ఉగ్రవాద దాడి అనంతరం మేము అప్రమత్తమయ్యాం. అరేబియా సముద్రంలో లైవ్–ఫైరింగ్ డ్రిల్స్, లాంచ్ టెస్టులు, కాంబాట్ ఆపరేషన్ డ్రిల్స్ నిర్వహించాం. పాకిస్తాన్ ముష్కరులకు గుణపాఠం నేర్పాలన్న లక్ష్యంతో మా కార్యాచరణ సిద్ధం చేసుకున్నాం.
మన సైనిక దళాలు అరేబియా సముద్రంలో నిత్యం అప్రమత్తంగా ఉన్నాయి. ఎలాంటి విపత్కర పరిణామాలు ఎదురైనా ఢీకొట్టేందుకు సిద్ధమయ్యాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందగానే ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడ్డాం. పాకిస్తాన్ సైన్యం దాడులను గట్టిగా తిప్పికొట్టాం. పాక్ నావికాదళంపై మన నావికాదళం పైచేయి సాధించింది. పాక్ ఎత్తుగడలు గమనిస్తూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాం. ఇండియన్ నేవీ దాడుల్లో పాక్ హార్బర్లకు తీవ్ర నష్టం వాటిల్లింది. పాక్ చర్యల పట్ల మన ప్రతిస్పందన దీటుగా, ప్రణాళికాబద్ధంగా సాగింది’’ అని ఎ.ఎన్.ప్రమోద్ స్పష్టం చేశారు.