
కౌంటర్–డ్రోన్ సిస్టమ్‌ను విజయవంతంగా పరీక్షించిన భారత్
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో, తక్కువ ఖర్చుతో ‘భార్గవాస్త్ర’ అభివృద్ధి
గగనతల ముప్పును ఎదుర్కోవడంలో గొప్ప ముందడుగు
న్యూఢిల్లీ: ప్రత్యర్థి దేశాల డ్రోన్లు, మానవ రహిత గగనతల వాహనాలను తుత్తునియలు చేసే స్వదేశీ కౌంటర్–డ్రోన్ సిస్టమ్ ‘భార్గవాస్త్ర’ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఆధునిక యుద్ధాల్లో డ్రోన్ల రూపంలో ఎదురవుతున్న ముప్పును సమర్థంగా తిప్పికొట్టడంలో గొప్ప ముందడుగు వేసింది.
సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్(ఎస్‌డీఏల్) అభివృద్ధి చేసిన ఈ డ్రోన్ల నిరోధక వ్యవస్థను ఒడిశా రాష్ట్రం గోపాల్‌పూర్‌లోని సీవార్డ్ ఫైరింగ్ రేంజ్‌లో ఆర్మీ ఎయిర్ డిఫెన్స్(ఏఏడీ) అధికారుల సమక్షంలో మంగళవారం పరీక్షించారు.
మొత్తం మూడు ట్రయల్స్ నిర్వహించగా, అన్నీ విజయవంతమయ్యాయి. ఎక్కడా గురి తప్పలేదు. ‘భార్గవాస్త్ర’లోని నాలుగు మైక్రో రాకెట్లు అన్ని నిర్దేశిత లక్ష్యాలను ఛేదించాయి. తొలుత రెండు రాకెట్లను వేర్వేరుగా ఫైర్ చేశారు. దాంతో రెండు ట్రయల్స్ పూర్తయ్యాయి. మూడో ట్రయల్‌లో భాగంగా.. మరో రెండు రాకెట్లను ఒకేసారి సాల్వో మోడ్‌లో కేవలం రెండు సెకండ్ల వ్యవధిలోనే పరీక్షించారు.
నాలుగు రాకెట్ల పనితీరూ అద్భుతంగా ఉన్నట్లు తేలింది. అవి నిర్దేశిత లాంచ్ పారామీటర్లను సాధించాయి. భారీ డ్రోన్లతో దాడులు జరిగినప్పుడు వాటిని గురిపెట్టి కచ్చితంగా నేలకూల్చే సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత్ సొంతం చేసుకుంది. పాకిస్తాన్ ఉగ్రవాదులపై ‘ఆపరేషన్ సిందూర్’ ప్రారంభించిన కొన్ని రోజులకే భార్గవాస్త్రను విజయవంతంగా పరీక్షించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
→ భార్గవాస్త్రలో మొదటి దశలో ఆన్‌గైడెడ్ మైక్రో రాకెట్లు ఉంటాయి. ఇవి శత్రుదేశాల డ్రోన్లను కూల్చివేస్తాయి.
→ ఇక రెండో దశలో గైడెడ్ మైక్రో మిస్సైల్ ఉంటుంది. ఇది పిన్‌పాయింట్ కచ్చితత్వంతో ప్రత్యర్థి డ్రోన్లను చిత్తుచేస్తుంది. శత్రువు డ్రోన్లు తప్పించుకొనే అవకాశమే ఉండదు. గైడెడ్ మైక్రో మిస్సైల్‌ను గతంలోనే పరీక్షించారు.
→ అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో సమర్థంగా పనిచేసేలా భార్గవాస్త్రను అభివృద్ధి చేశారు. సముద్ర మట్టానికి 5 కిలోమీటర్లకుపైగా ఎత్తులోనూ చక్కగా పనిచేయగలదు. భారత సైనిక దళాల అవసరాలను అనుగుణంగా రూపొందించారు.
→ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో, చాలా తక్కువ ఖర్చుతో భార్గవాస్త్రను డిజైన్ చేయడం విశేషం. త్రివిధ దళాల అవసరాల మేరకు ఇందులో అదనంగా మార్పుచేర్పులు చేసుకోవచ్చని ఎస్‌డీఏఎల్ వెల్లడించింది.
→ అడ్వాన్స్‌డ్ సీ4ఐ(కమాండ్, కంట్రోల్, కమ్యూనికేషన్స్, కంప్యూటర్స్, ఇంటెలిజెన్స్) టెక్నాలజీతో భార్గవాస్త్ర పనిచేస్తుంది. గగనతలంలో ఎదురయ్యే ముప్పును రియల్–టైమ్‌లో ఎప్పటికప్పుడు గుర్తించవచ్చు.
→ ఇందులోని రాడార్ 6 నుంచి 10 కిలోమీటర్ల దూరంలోని డ్రోన్లను గుర్తించగలదు. అలాగే ఎలక్ట్రో ఆప్టికల్/ఇన్‌ఫ్రారెడ్(ఈఓ/ఐఆర్) సెన్సార్లు ‘లో రాడార్ క్రా–సెక్షన్’ లక్ష్యాలను కనిపెట్టగలవు.
→ కౌంటర్–డ్రోన్ టెక్నాలజీలో భార్గవాస్త్ర ఒక మైలురాయి అని ఎస్‌డీఏఎల్ అధికారులు చెబుతున్నారు.
→ కొన్ని దేశాలు భార్గవాస్త్ర తరహాలో మైక్రో–మిస్సైల్ సిస్టమ్స్‌ను రూపొందించినప్పటికీ... పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో, తక్కువ ఖర్చుతో ఇలాంటి బహుళ దశలతో కూడిన కౌంటర్–డ్రోన్ వ్యవస్థను ఎవరూ తయారు చేయలేకపోయారు.
→ భార్గవాస్త్రను హార్డ్‌కిల్ మోడ్‌లో రూపొందించారు. భారీ డ్రోన్లతోపాటు చాలా చిన్నస్థాయి డ్రోన్లను కూడా గుర్తించి, కూల్చివేయగలదు.