ఆకట్టుకున్న త్రివిధ దళాల అద్భుత విన్యాసాలు
అబ్బురపర్చిన సాహస కృత్యాలు
పోర్బందర్: భారత త్రివిధ దళాలు సంయుక్తంగా తమ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించాయి. ఎక్సర్‌సైజ్ త్రిశూల్ పేరిట భారత సైన్యం, నావికా దళం, వైమానిక దళం గురువారం గుజరాత్‌లోని సౌరాష్ట్ర సముద్ర తీరంలో కలిసికట్టుగా విన్యాసాలు నిర్వహించాయి. దాదాపు గంటపాటు ఈ కార్యక్రమం కొనసాగింది. భూమిపై, ఆకాశంలో, సముద్రంలో త్రివిధ దళాల జవాన్ల సాహస కృత్యాలు అబ్బురపర్చాయి. భారత మిలటరీ శక్తిని ప్రపంచానికి చాటడమే లక్ష్యంగా త్రిశూల్ కొనసాగింది.
‘అంఫెక్స్–2025’అనే కోడ్ పేరుతో జరిగిన విన్యాసాల్లో టీ–72 యుద్ధ ట్యాంకులు, అసాల్డ్ దళాలు, జాగ్వార్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్, ఎస్–30 ఎంకేఐ యుద్ధ విమానాలతోపాటు మరికొన్ని నావికా దళం యుద్ధనౌకలు పాల్గొన్నాయి. నావికా దళం ఆధ్వర్యంలో గత రెండు వారాలుగా త్రివిధ దళాల విన్యాసాలు కొనసాగుతున్నాయి. అవి గురువారం ముగిశాయి. థార్ ఎడారి నుంచి కచ్ ప్రాంతం దాకా వేర్వేరు ప్రదేశాల్లో ఈ కార్యక్రమం జరిగింది.
ఉమ్మడి శక్తి, సమన్వయం
గుజరాత్ పోర్బందర్ సమీపంలోని మాధవ్‌పూర్ బీచ్‌లో జరిగిన విన్యాసాలకు త్రివిధ దళాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. మూడు దళాల ఉమ్మడి శక్తికి, సమన్వయానికి త్రిశూల్ ఒక బెంచ్‌మార్క్ అని వారు చెప్పారు. నూతన ఆయుధాలు, సైనిక పరికరాలను పరీక్షించినట్లు తెలిపారు. మన సైన్యం బలం పెరిగిందని అన్నారు. భవిష్యత్తులో ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టంచేశారు. 30 వేల మంది సైనికులు, యుద్ధ విమానాలు, దాదాపు 25 యుద్ధ నౌకలు, జలాంతర్గాములు ఈ ఎక్సర్‌సైజ్‌లో పాల్గొన్నట్లు వెల్లడించారు. యుద్ధక్షేత్రంలోని పరిస్థితులను సృష్టించి, విన్యాసాలు చేపట్టినట్లు తెలియజేశారు.


