
భారత్‌పై 50 శాతం సుంకాలతో టారిఫ్ బాంబ్ పేల్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తాజాగా H1B వీసా ఫీజు పెంపు నిర్ణయంతో మరో బాంబ్ పేల్చిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై తాజాగా భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు శనివారం భారత విదేశాంగ శాఖ స్పందిస్తూ..
భారతీయ ఐటీ ఉద్యోగులు, అమెరికాలో పనిచేస్తున్న వలస కార్మికులు, విద్యార్థులపై ఈ నిర్ణయం ఆర్థిక-మానవీయ ఒత్తిడిని కలిగించే అవకాశం లేకపోలేదు అని పేర్కొంది. అమెరికా హెచ్-1బీ వీసాలకు సంబంధించి కొత్త నిబంధనలను పరిశీలిస్తున్నట్లు.. అధ్యయంన చేస్తున్నట్లు భారత విదేశాంగశాఖ స్పష్టం చేసింది. అంతేకాదు..
నిపుణుల రాకపోకల వల్ల ప్రతిభావంతుల మార్పిడి (skilled talent exchange)తో ఇంతకాలం ఇరు దేశాలకూ పరస్పల లబ్ధి చేకూరింది. ఆర్థిక వృద్ధి, సాంకేతిక అభివృద్ధికి కీలకంగా ఉంటూ వచ్చిందని, కాబట్టి ఈ నిర్ణయం ఇరుదేశాలనూ ప్రభావితం చేసే అంశమేనని పేర్కొంది. అగ్రరాజ్యం నిర్ణయంతో ఎన్నో కుటుంబాలకు ఇబ్బందులు ఎదురవుతాయని అభిప్రాయపడింది. మానవీయ కోణంలో పరిశీలించి ఈ సమస్యపై చర్చించి పరిష్కారం కనుగొనాలని ఆశిస్తున్నట్లు తెలిపింది.
90వ దశకంలో ఇతర దేశాల నుంచి స్కిల్ ఉన్న ఉద్యోగులను అమెరికాకు రప్పించే ఉద్దేంతో హెచ్-1బీ వీసా తెచ్చారు. వీటిని మూడు నుంచి ఆరేళ్ల మధ్య కాలానికి మంజూరు చేయడం ప్రారంభించింది. అప్పటి నుంచి అక్కడి టెక్ కంపెనీలు విదేశీ నిపుణులను ఈ వీసా ద్వారా రప్పించుకుంటున్నాయి. ప్రస్తుతం.. హెచ్-1బీ వీసా దరఖాస్తుదారులకు లాటరీ విధానం ఉంది. తొలుత లాటరీ దరఖాస్తుకు సాధారణ ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది. లాటరీలో ఎంపికైతే అదనపు ఛార్జీలు చెల్లించాలి. చాలా సందర్భాల్లో కంపెనీలే వీసా ఛార్జీలను భరిస్తాయి. అలా.. అక్కడ ఎంతో మంది ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారు కూడా. అయితే..
తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసా (H1-B)పై కీలక నిర్ణయం తీసుకున్నారు. వీటి దరఖాస్తులపై ఏడాది అడ్మినిస్ట్రేషన్ ఫీజును ఏకంగా లక్ష డాలర్లుగా(రూ. 88 లక్షలకు పైగా) నిర్ణయిస్తూ ఉత్తర్వుపై సంతకం చేశారు. ఇక మీదట అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కొక్క వీసాపై ఏడాదికి అంతేసి చెల్లించాల్సి వస్తుంది. 2024 లెక్కల ప్రకారం.. హెచ్-1బీ వీసా దారుల్లో ఇండియా 71 శాతం వాటా కలిగి ఉండగా, చైనా 11.7 శాతం వాటా కలిగి ఉంది. దీంతో కొత్త హెచ్1బీ వీసా విధానం ఈ రెండు దేశాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది.