
2035 కల్లా రెట్టింపు కానున్న ప్రమాదం
ఢిల్లీకి చెందిన ఐఫారెస్ట్ సంస్థ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ: ఎండల తీవ్రత పెరిగిన కొద్దీ దేశంలో ఎయిర్ కండిషనర్లను కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఒకప్పటి విలాస ఉపకరణం నేడు ముఖ్యావసరంగా మారింది. ధనవంతులకు మాత్రమే పరిమితమైన ఏసీ ఇప్పుడు మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి ప్రజల ఇళ్లలోనూ కనిపిస్తోంది. అయితే, కారు మాదిరిగానే ఏసీకూడా వాతావరణం మరింత వేడెక్కేందుకు కారణమవుతోందని తాజా అధ్యయనం హెచ్చరించింది.
వాతావరణం కోణంలో చూస్తే ఏసీ కూడా ప్రమాదకరమైన గృహోపకరణమేనని ఢిల్లీకి చెందిన ఐఫారెస్ట్ సంస్థ సర్వే తేల్చింది. ఇంకా ఏం చెప్పిందంటే.. 2030 నాటికి భారత్‌లో గ్రీన్‌హౌస్ వాయువులను విడుదల చేసే అతిపెద్ద గృహోపకరణంగా ఎయిర్ కండిషనర్లు మారనున్నాయి. దేశంలో 2035 నాటికి వాతావరణంలో కలిసే కార్బన్ డయాక్సైడ్ రెట్టింపయ్యి 329 మిలియన్ టన్నులకు చేరుకోనుంది.
2024లో ఒక్క ఏడాదిలోనే ఎయిర్ కండిషనర్లు (ఏసీలు) 156 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ సమాన ఉద్గారాలను విడుదల చేశాయని, ఇది దేశంలోని అన్ని ప్రయాణికుల కార్ల ఉద్గారాలకు సమానమని వెల్లడైంది. ఇందులో 52 మిలియన్ టన్నుల ఉద్గారాలు కూలింగ్ గ్యాస్ లీకేజీల (రెఫ్రిజిరెంట్లు) వల్లనే జరిగాయని పేర్కొంది. 2035 నాటికి ఏసీల వల్ల విడుదలయ్యే మొత్తం ఉద్గారాలు 329 మిలియన్ టన్నులకు పెరిగే అవకాశం ఉంది.
ఇది ఇప్పటి వాటితో పోలిస్తే రెట్టింపునకు మించి ఉంటుందని నివేదిక పేర్కొంది. ఒక ఏసీని రెండేళ్లకోసారి గ్యాస్ రీఫిల్ చేయిస్తే, అది ఓ కారు విడుదల చేసేంత ఉద్గారాలను విడుదల చేస్తుంది. వాతావరణ పరంగా చూస్తే ఏసీ కూడా కారు లాంటిదే, అంతే ప్రమాదకరమైందని ఐఫారెస్ట్ అధ్యక్షుడు, సీఈవో చంద్ర భూషణ్ చెప్పారు. రెఫ్రిజిరెంట్ల తయారీదారులు ఉద్గారాలను మరింతగా అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకునేలా ఒత్తిడిపెంచాలి.
ప్రభుత్వం జాతీయ రెఫ్రిజిరెంట్ డేటాబేస్ ఏర్పాటు చేయాలి. వాతావరణంపై తీవ్రప్రభావాన్ని తగ్గించేందుకు కఠినమైన నిబంధనలను అమలు చేయాలని పేర్కొన్నారు. ఈ చర్యలతో వచ్చే దశాబ్దంలో 500–650 మిలియన్ టన్నుల రెఫ్రిజిరెంట్ ఉద్గారాలను తగ్గించవచ్చని, వాటి విలువ 25 నుంచి 33 బిలియన్ల డాలర్ల కార్బన్ క్రెడిట్లుగా ఉండొచ్చని ఐఫారెస్ట్ నివేదిక పేర్కొంది. అలాగే, వినియోగదారులు 10 బిలియన్ డాలర్ల వరకు రీఫిల్లింగ్ ఖర్చులు ఆదా చేసుకోగలరని తెలిపింది.
ఏసీ వాడకం ఎలా ఉంటుందంటే..
2024లో 62 మిలియన్లు ఉన్న ఏసీలు, 2035 నాటికి 245 మిలియన్లకు చేరనున్నాయి. వార్షిక విక్రయాలు సైతం 14 మిలియన్ల నుంచి 40 మిలియన్లకు పెరిగే అవకాశం ఉంది. 2020 నుంచి ఏసీల విక్రయాలు ఏడాదికి 15 నుంచి 20% చొప్పున పెరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణాల్లో నగరీకరణ, వ్యక్తుల ఆదాయాల్లో పెరుగుదల, పెరిగిన ఎండల తీవ్రత తదితరాలు ముఖ్యమైనవిగా ఉన్నాయి.
సర్వే ఎలా జరిపారంటే..
ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నై, అహ్మదాబాద్, పుణె, జైపూర్ నగరాల్లో 3,100 కుటుంబాలపై ఈ సర్వే చేపట్టారు. ఆయా నివాసాలు, కార్యాలయాల్లోని 80% ఏసీలు ఐదేళ్ల లోపు తయారైనవి. ఇందులో 87% కుటుంబాలు ఒకే ఏసీ కలిగి ఉండగా, 13% మంది రెండు, అంతకంటే ఎక్కువ ఏసీలను వాడుతున్నారు. చెన్నై, జైపూర్, కోల్‌కతా, పుణెల్లోని ఎక్కువ కుటుంబాలు ఒకటికి మించి ఏసీలను కలిగి ఉన్నాయి. కోల్‌కతా, జైపూర్, పుణె వాసులు ఏసీలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నట్లు సైతం నివేదిక వెల్లడించింది.
రెఫ్రిజిరెంట్ రీఫిల్లింగ్
భారత్‌లో రీఫిల్లింగ్ ఖర్చు ప్రపంచంలోనే అత్యధికంగా ఉంది. సాధారణంగా ఏసీలను ఐదేళ్లకోసారి రీఫిల్ చేస్తే సరిపోతుంది. కానీ, భారత్‌లో సగటున 40% ఏసీలు ఏటా రీఫిల్ అవుతున్నాయి. ఐదేళ్లకు మించి ఉన్న ఏసీలలో 80%కు పైగా ఏటా రీఫిల్ చేయించాల్సిన అవసరం ఉంటుంది. వినియోగదారులు 2024లో రూ.7,000 కోట్ల విలువైన రెఫ్రిజిరెంట్ల రీఫిల్లింగ్ చేసుకున్నారు. ఇది 2035 నాటికి రూ. 27,540 కోట్లకు పెరగవచ్చని నివేదిక అంచనా వేసింది.
హానికరమైన రెఫ్రిజిరెంట్లు
దేశంలో ప్రధానంగా వాడే హెచ్‌ఎఫ్‌సీ–32 అనే గ్యాస్, కార్బన్ డయాక్సైడ్ కంటే 675 రెట్లు ఎక్కువ ఉష్ణతాపాన్ని కలుగ జేస్తుంది. 2024లో రెఫ్రిజిరెంట్ లీకేజీల వల్ల 52 మిలియన్ టన్నుల ఉద్గారాలు వెలువడగా, 2035 నాటికి ఇది 84 మిలియన్ టన్నులకు చేరే అవకాశం ఉంది.
వినియోగం తీరు ఎలా ఉంది?
దేశంలో కుటుంబాలు సగటున ఏసీని రోజుకు 4 గంటల పాటు వాడుతున్నాయి. వేసవిలో ఎక్కువగా 7.7 గంటలపాటు వాడుతున్నారు. వర్షాకాలంలో 3.2 గంటలు మాత్రమే వినియోగించుకుంటున్నారు. దాదాపు 98% కుటుంబాలు 3 స్టార్ నుంచి 5 స్టార్ రేటెడ్ ఏసీలు వాడుతున్నారు. త్రీస్టార్ ఏసీలు 60% ఇళ్లలో ఉంటే 5 స్టార్ ఏసీలు 28% మంది వినియోగిస్తున్నారు.
థర్మోస్టాట్ సెట్టింగ్స్
దేశంలో సగటున 67% కుటుంబాలు ఏసీని 23నిసెల్సియస్–25సెల్సియస్ మధ్య ఉంచుతున్నాయి. కేవలం 33% మాత్రమే 22 సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతకు సెట్ చేస్తున్నారు. వీరిలో అత్యధికులు ఢిల్లీ, ముంబయి, పుణెకు చెందినవారేనని సర్వేలో తేలింది. విద్యుత్ వినియోగంపై ప్రజలు జాగ్రత్తగా ఉన్నా, రెఫ్రిజిరెంట్ల విషయంలో అవగాహన తక్కువగా ఉంది. ప్లాస్టిక్ లాగే రెఫ్రిజిరెంట్ల జీవిత కాలంపై కూడా సమగ్ర అవగాహన అవసరమని ఐఫారెస్ట్ చైర్మన్ చంద్ర భూషణ్ అంటున్నారు.