దశాబ్దంలో మూడో అతిపెద్ద ఎకానమీగా భారత్‌

India to be the third largest economy by 2031 - Sakshi

బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా సెక్యూరిటీస్‌

ముంబై: భారత్‌ ఆర్థిక వ్యవస్థ 2031-32 ఆర్థిక సంవత్సరం నాటికి ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవిస్తుందని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా(బీఓఏ) సెక్యూరిటీస్‌ తన తాజా నివేదికలో పేర్కొంది. నిజానికి 2028-29 ఆర్థిక సంవత్సరం నాటికే భారత్‌ ఈ స్థాయిని అందుకోవాల్సి ఉన్నప్పటికీ, కరోనా ప్రతికూలతలు భారత్‌ వృద్ధి వేగాన్ని అడ్డగించాయని వివరించింది. యువత అధికంగా ఉండడం, ఫైనాన్షియల్‌ మార్కెట్లలో పరిపక్వత భారత్‌ ఆర్థిక వ్యవస్థకు సానుకూలతలని నివేదిక వివరించింది.

గడచిన ఎనిమిది సంవత్సరాల్లో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) సమర్థవంతమైన స్థాయిలో విదేశీ మారకద్రవ్య నిల్వలను(ప్రస్తుతం దాదాపు 550 బిలియన్‌ డాలర్లు) నిర్వహిస్తోందని, రూపాయి స్థిరత్వానికి, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి ధోరణుల నుంచి భారత్‌ను రక్షించడానికి ఈ చర్య దోహదపడుతుందని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా విశ్లేషించింది. ఇక భారత్‌ బ్యాంకింగ్‌ మొండి బకాయిల సమస్య పరిష్కారంలో ‘బ్యాడ్‌ బ్యాంక్‌’ ఏర్పాటు ఆలోచన మంచి ఫలితాలను అందిస్తుందని వివరించింది. అయితే తీవ్ర స్థాయిలో ఉన్న క్రూడ్‌ ఆయిల్‌ ధరలు ఆర్థిక వ్యవస్థకు ఆందోళన కరమైన అంశంగా పేర్కొంది. 2024-25 నాటికి ఐదు ట్రిలియన్‌ డాలర్ల స్థాయికి చేరుకోవాలన్నది భారత్‌ లక్ష్యం.

ఇప్పటి స్థానాలు ఇవీ... 
ప్రస్తుతం అమెరికా, చైనాలు (వరుసగా దాదాపు 16, 10 ట్రిలియన్‌ డాలర్లు) ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో మొదటి రెండవ స్థానాల్లో ఉండగా, జపాన్‌ ఆర్థిక వ్యవస్థ మూడవ స్థానంలో ఉంది. జర్మనీ, భారత్‌లు నాలుగు, ఐదు స్థానాల్లో నిలుస్తున్నాయి. 2019-20లో భారత్‌ ఆర్థిక వ్యవస్థ పరిమాణం 2.65 ట్రిలియన్‌ డాలర్లుకాగా, 2020లో జపాన్‌ ఆర్థిక వ్యవస్థ పరిమాణం 4.87 ట్రిలియన్‌ డాలర్లు. జర్మనీ ఆర్థిక వ్యవస్థ పరిమాణం దాదాపు 3.8 ట్రిలియన్‌ డాలర్లు.

చదవండి:

కరోనా కాలంలో కొత్త కంపెనీల జోరు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top