బారాబంకి: ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. బారాబంకిలో ఐస్‌క్రీమ్ విక్రేత దారుణ హత్యకు గురయ్యాడు. ఓ వ్యక్తి.. యువకుడి గొంతు కోసి, తలను శరీరం నుండి వేరు చేశాడు. అంతటితో ఆగకుండా.. ఆ తెగిపడిన తలను తన ఇంటికి తీసుకెళ్లి.. పక్కనపెట్టి ఏమీ ఎరగనట్టు వంట చేసుకోవడం పోలీసులను సైతం షాక్‌కు గురి చేసింది.
బారాబంకి జిల్లాలోని పర్సావల్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. బాధితుడిని బబ్లూగా గుర్తించారు. అతను ప్రతిరోజూ లాగే ఐస్‌క్రీమ్ అమ్ముకోవడానికి ఆ గ్రామానికి వెళ్లాడు. పనిలో ఉండగా.. స్థానిక నివాసి శంకర్ యాదవ్‌తో బబ్లూకు వాగ్వాదం జరిగింది. మాట మాట పెరగడంతో, శంకర్ యాదవ్ ఒక్కసారిగా కొడవలితో బబ్లూపై దాడి చేశాడు. అందరూ చూస్తుండగానే అతని గొంతు కోసి తలను నరికేశాడు. అనంతరం అక్కడి నుండి పారిపోకుండా.. ఆ తెగిపడిన తలను పట్టుకుని గ్రామంలోని తన ఇంటికి వెళ్ళిపోయాడు. పోలీసులు అక్కడికి చేరుకునే సమయానికి నిందితుడు ఇంట్లో వంట చేసుకుంటున్నట్లు గుర్తించారు.
హత్య గురించి సమాచారం అందిన వెంటనే, ఎస్పీ అర్పిత్ విజయవర్గీయ ఆదేశాల మేరకు భారీ పోలీస్ బలగాలు గ్రామానికి చేరుకున్నాయి. పోలీసులు నిందితుడి ఇంటిని చుట్టుముట్టి లోపలికి వెళ్లగా.. అక్కడ బబ్లూ తల పక్కనే పడి ఉండగా.. శంకర్ యాదవ్ వంట చేస్తూ కనిపించాడు. పోలీసులు వెంటనే అతడిని అరెస్ట్ చేసి, హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు.
బబ్లూ తన ముగ్గురు సోదరులలో పెద్దవాడు. కూలీ పనులు చేస్తూ, ఐస్‌క్రీమ్ అమ్ముతూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. బబ్లూ భార్య, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. వారు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అసలు వారిద్దరి మధ్య గొడవ ఎందుకు మొదలైందనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించి, కేసు దర్యాప్తును వేగవంతం చేశారు.


