
శ్రీనగర్: మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సైఫుల్లా మిర్ అలియాస్ డాక్టర్ సైఫుల్లా(31)భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో హతమయ్యాడు. ఈ ఏడాది మేలో హిజ్బుల్ చీఫ్‌గా ఉన్న రియాజ్ నైకూ భద్రతా బలగాల చేతుల్లో మృతి చెందడంతో సైఫుల్లా ఆ బాధ్యతలు చేపట్టాడు. ‘సైఫుల్లా మృతి మామూలు ఘటన కాదు. పోలీసులకు, భద్రతా బలగాలకు దక్కిన భారీ విజయం’అని ఎన్‌కౌంటర్ ప్రాంతాన్ని పరిశీలించిన కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ అభివర్ణించారు.
పుల్వామా జిల్లా మలంగ్‌పోరాకు చెందిన ఇతడు మెడికల్ ఎలక్ట్రానిక్స్‌లో డిప్లొమా, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డిగ్రీ చేసిన ఇతడిని డాక్టర్ అని పిలుస్తుంటారు. 2014 అక్టోబర్‌లో హిజ్బుల్ ముజాహిదీన్‌లో చేరాడు. కశ్మీర్ లోయలో భద్రతాబలగాలపై జరిగిన పలు ఘటనలకు సూత్రధారిగా ఉన్న సైఫుల్లా మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నాడు. సైఫుల్లా ఓ ఇంట్లో దాగున్నాడన్న విశ్వసనీయ సమాచారం మేరకు భద్రతా బలగాలు ఆదివారం ఉదయం శ్రీనగర్ శివారులోని రంగ్రేత్ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ చేపట్టాయి. అదే సమయంలో ఇద్దరు ఉగ్రవాదులు వారి పైకి కాల్పులకు దిగగా బలగాలు దీటుగా స్పందించాయి. ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాది చనిపోగా, మరొకరు పోలీసులకు పట్టుబడ్డాడు. మృతుడిని సైఫుల్లాగా గుర్తించారు. అతని వద్ద ఆయుధాలు, మందు గుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.