
ఢిల్లీ: నగరంలో హైఅలర్ట్ ప్రకటించారు. ఇండియా గేట్ దగ్గర భద్రతను మరింత పెంచారు. ఢిల్లీ నుంచి జమ్మూ వెళ్లే రైళ్లన్నీ నిలిపివేశారు. ఢిల్లీ నుంచి గుజరాత్, రాజస్థాన్ వెళ్లే వాహనాలను కూడా బంద్ చేశారు. ఢిల్లీ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే 90 విమానాలను వివిధ విమానయాన సంస్థలు రద్దు చేశాయి. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లోని 27 విమానాశ్రయాలను ఇప్పటికే మూసివేశారు. దీంతో గురువారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలవరకు పలు విమానాలు రద్దయ్యాయి. మొత్తం 46 దేశీయ ప్రయాణాలు, 33 రాకపోకలు రద్దయ్యాయి.
మరో వైపు, భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటున్న పంజాబ్, గుజరాత్ రాష్ట్రాలు హై అలర్ట్ ప్రకటించాయి. పాకిస్తాన్‌తో పంజాబ్ 532 కిలోమీటర్లు, రాజస్థాన్ 1,070 కిలోమీటర్లు సరిహద్దును పంచుకుంటోంది. రెండు రాష్ట్రాల్లో పోలీసుల సెలవులను రద్దు చేశారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు పాఠశాలలను కూడా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం దుకాణాల ముందు క్యూ కట్టారు. పంజాబ్‌లోని సరిహద్దుకు సమీపంలోని అన్ని జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఆరు సరిహద్దు జిల్లాలైన ఫిరోజ్‌పూర్, పఠాన్‌కోట్, ఫాజిల్కా, అమృత్‌సర్, గురుదాస్‌పూర్, తార్న్ తరన్ జిల్లాల్లో పాఠశాలలను మూసివేశారు. పోలీసుల సెలవులను రద్దు చేశారు.
ఇక అమృత్‌సర్‌లో నిత్యావసర వస్తువుల బ్లాక్ మార్కెటింగ్‌ను నిరోధించడానికి జిల్లా యంత్రాంగం ఒక టాస్‌్కఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. జిల్లాలో నిత్యావసర వస్తువుల కొరత లేదని, బ్లాక్ మార్కెటింగ్‌ను ప్రోత్సహించవద్దని, ప్రజలు అనవసరంగా అదనపు వస్తువులను కొనుగోలు చేయవద్దని అధికారులు కోరారు. మరోవైపు పప్పులు, వంటనూనె, గోధుమ పిండి, పంచదార, ఉప్పు వంటి వస్తువులను పెద్దమొత్తంలో కొనుగోలు చేసేందుకు అమృత్‌సర్‌లోని కిరాణా దుకాణాలు, డిపార్ట్‌మెంటల్ స్టోర్ల వద్ద ప్రజలు క్యూ కట్టారు. సరిహద్దు జిల్లాల్లో ఒకటైన గురుదాస్‌పూర్‌లో గురువారం రాత్రి 9 గంటల నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు బ్లాకవుట్ విధించారు. ప్రజల భద్రత కోసం పోలీసు స్క్వాడ్లు, క్విక్ రెస్పాన్స్ బృందాలను నియమించింది. అత్యవసర సహాయం కోసం హెల్ప్‌లైన్లను ఏర్పాటు చేసింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం అన్ని బహిరంగ కార్యక్రమాలను రద్దు చేసింది.
ప్రజల భద్రత దృష్ట్యా పాక్ సరిహద్దుల్లో రిట్రీట్ వేడుకలను బీఎస్‌ఎఫ్ నిలిపివేసింది. పంజాబ్‌లోని పాకిస్తాన్ వెంబడి ఉన్న మూడు సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద రిట్రీట్ వేడుకలను నిర్వహించబోమని సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) తెలిపింది. పాకిస్తాన్ వాఘాకు ఎదురుగా ఉన్న అట్టారీ (అమృత్‌సర్), ఫిరోజ్‌పూర్ జిల్లాలోని హుస్సేనీవాలా, ఫజిల్కా జిల్లాలోని సద్కీ వద్ద ఉన్న జేసీపీల వద్ద పాకిస్తాన్ రేంజర్లతో కలిసి బీఎస్‌ఎఫ్ దళాలు ప్రతిరోజూ సాయంత్రం రిట్రీట్ కార్యక్రమాన్ని నిర్వమిస్తాయి.
ఇక గుజరాత్ తీరం వెంబడి భద్రతను కట్టుదిట్టం చేసింది. పోలీసు సిబ్బంది సెలవులను రద్దు చేసింది. తీరం వెంబడి ఉన్న రాజ్‌కోట్ రేంజ్‌లోని జామ్‌నగర్, మోర్బి, దేవభూమి, ద్వారకాల్లో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. పోలీసులు తీరప్రాంత గ్రామాలు, బోట్‌ల్యాండింగ్ పాయింట్లను సందర్శిస్తున్నారు. అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని గ్రామస్తులను పోలీసులు కోరుతున్నారు.