
అసెంబ్లీలో ఆమోదించిన బిల్లు యోగ్యతను వారు ప్రశ్నించలేరు
లెజిస్లేటివ్ విధుల్లో ఎగ్జిక్యూటివ్ వర్గం జోక్యం చేసుకోవద్దు
సుప్రీంకోర్టు ధర్మాసనం ఎదుట పశ్చిమ బెంగాల్ సర్కార్ వాదన
న్యూఢిల్లీ: శాసన నిర్వాహక వర్గం విధులు, ప్రక్రియలో కార్యనిర్వాహక వర్గం జోక్యం చేసుకోవడానికి వీల్లేదని సుప్రీంకోర్టుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తెలియజేసింది. బిల్లు రూపంలోని ప్రజల ఆకాంక్ష, అవసరాన్ని గవర్నర్లు లేదా రాష్ట్రపతి ఇష్టాయిష్టాలకు లోబడి ఉంచలేమని పేర్కొంది. శాసనసభలో ఆమోదించిన బిల్లు యోగ్యతను గవర్నర్లు ప్రశ్నించజాలరని తేల్చిచెప్పింది.
బిల్లుకు సమ్మతి తెలియజేసే విషయంలో గవర్నర్లు/రాష్ట్రపతికి సుప్రీంకోర్టు 3 నెలల గడువు విధించిన సంగతి తెలిసిందే. దీనిపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అభ్యంతరం తెలిపారు. గవర్నర్లు లేదా రాష్ట్రపతికి గడువు నిర్దేశించే అధికారం కోర్టులకు ఉందా? అని ప్రశ్నించారు. దీనిపై స్పష్టత ఇవ్వాలని సుప్రీంకోర్టుకు సూచించారు. రాష్ట్రపతి రిఫరెన్స్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారణ ప్రారంభించింది.
ఈ వ్యవహారంపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తన వాదనను బుధవారం ధర్మాసనం దృష్టికి తీసుకొచి్చంది. ప్రభుత్వం తరఫున సీనియర్ లాయర్ కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. అసెంబ్లీలో ఆమోదించిన బిల్లు కార్యనిర్వాహక వర్గం పరిధిలోకి రాదని పేర్కొన్నారు. ప్రజల సంకల్పమే అత్యున్నతం అని ఉద్ఘాటించారు. ధర్మాసనం స్పందిస్తూ... లెజిస్లేటివ్ నిబంధనలకు అనుగుణంగా లేని బిల్లులను కూడా గవర్నర్లు/రాష్ట్రపతి సమ్మతించాలని మీరు భావిస్తున్నారా? బిల్లుల యోగ్యతను కోర్టులు పరీక్షించవచ్చా? అని ప్రశ్నించింది.
చట్టాల రాజ్యాంగబద్ధతను కోర్టులను పరీక్షించవచ్చని సిబల్ బదులిచ్చారు. కార్యనిర్వాహక వర్గానికి ఆ అధికారం లేదన్నా రు. అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లులపై గవర్నర్లు తక్షణమే త్వరగా నిర్ణయం తీసుకోవాలన్నారు. మూడు నెలలు లేదా ఆరు నెలలు అనడం సరైంది కాదన్నారు. మన దేశానికి స్వాతంత్య్రం వచి్చన తర్వాత బిల్లును గవర్నర్లు లేదా రాష్ట్రపతి నిలిపివేసిన సందర్భాలు ఎక్కువగా లేవని గుర్తుచేశారు. ఒక బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందితే దానికి రాజ్యాంగబద్ధత వచ్చేసినట్లేనని అభిప్రాయపడ్డారు. ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 9వ తేదీకి వాయిదా వేసింది.