
రూ. 5,080 ఒక్క రోజే పెరిగిన ధర
రూ. 1,12,750 కొత్త ఆల్‌టైమ్ గరిష్టం
ఈ ఏడాదిలో పెరిగింది 43%
న్యూఢిల్లీ: కనకం ‘ల’కారం దాటినా తగ్గేదేలే అంటూ కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తోంది! కొన్నిరోజులుగా రూ. లక్షపైనే కదలాడుతున్న పుత్తడి ఒక్కసారిగా మళ్లీ హైజంప్ చేసింది. బంగారం ధర మంగళవారం బుల్లెట్‌లా దూసుకెళ్లింది. ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత పసిడి 10 గ్రాముల రేటు ఏకంగా రూ. 5,080 పెరిగి రూ. 1,12,750 స్థాయికి చేరింది.
దేశీయంగా బంగారానికి ఇది మరో కొత్త ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి. అంతేకాదు.. ఒకేరోజు పసిడి ఇంతలా పెరగడం కూడా ఇదే తొలిసారి కావడం గమనార్హం. వెండి ధర సైతం కిలోకు రూ. 2,800 లాభపడటంతో రూ. 1,28,800 స్థాయిని తాకింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం 3,698 డాలర్ల వద్ద సరికొత్త గరిష్టాన్ని నమోదు చేసింది. ‘బంగారం మరో రికార్డు స్థాయిని చేరింది.
ఈ ఏడాది ఎప్పటికప్పుడు కొత్త గరిష్టాలు నమోదు చేస్తూ అంతర్జాతీయ మార్కెట్లో 35 శాతం పెరిగింది. సెంట్రల్ బ్యాంక్‌ల నుంచి బలమైన డిమాండ్‌కు తోడు ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)లోకి పెట్టుబడుల రాక, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోత అంచనాలు.. బంగారం, వెండిలో రికార్డు బ్రేకింగ్ ర్యాలీకి కారణమవుతున్నాయి’అని హెచ్‌డీఎఫ్‌సీ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు.
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతుండటం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ వార్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిస్తాయన్న ఆందోళనలు సైతం సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించే బంగారం ధరలకు మద్దతుగా నిలుస్తున్నట్టు గాంధీ వివరించారు.