Vinayaka Chavithi: వినాయకుడికి రూ.6 కోట్ల విలువైన 5 కేజీల బంగారు కిరీటం 

On Ganesh Chaturthi Devotees Offer 5kg Gold Crown Pune Dagdusheth Halwai Ganpati - Sakshi

పుణె శ్రీమంత్‌ దగ్దుశేఖ్‌ హల్వాయి గణపతికి బంగారు కిరీటాన్ని బహుకరించిన భక్తులు

గణేష్‌ ఉత్పవాల సందర్భంగా ముంబైలో సెప్టెంబర్‌ 10-19 వరకు 144 సెక్షన్‌

ముంబై: దేశవ్యాప్తంగా ప్రజలు భక్తిశ్రద్ధలతో వినాయక చవితి పండుగ జరుపుకుంటున్నారు. కోవిడ్‌ కారణంగా గత ఏడాది ఉత్సవాలకు అనుమతి ఇవ్వలేదు. అయితే ప్రస్తుతం కేసులు తగ్గడంతో పలు రాష్ట్రాల్లో ఆంక్షలతో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించుకునేందుకు ప్రభుత్వాలు అనుమతిచ్చిన సంగతి తెలిసిందే.

ఇక వినాయక చవితి ఉత్సవాలు అనగానే ముందుగా ముంబై పేరు గుర్తుకు వస్తుంది. ఇక్కడ పది రోజుల పాటు అంగరంగ వైభవంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇక మహారాష్ట్రలో ముంబై లాల్‌ బాగ్చా గణేషుడు, పుణెలోని శ్రీమంత్ దగ్దుశేఖ్ హల్వాయి గణపతి మందిరాలు ఎంతో పురాతనమైనవే కాక చాలా ప్రసిద్ధి చెందినవి కూడా. (చదవండి: మీ ఇష్టం.. గణేష్‌ విగ్రహాల విషయంలో ఆంక్షల్లేవ్‌)

వినాయక చవితి సందర్భంగా ముంబై, పుణె ఆలయాల్లో భారీ ఎత్తున పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా హల్వాయి గణపతి మందిరంలో మహా భోగ్‌ పేరిట భారీ ఎత్తున మోదక్‌లు, మిఠాయిలు ప్రసాదంగా నివేదిస్తారు. ఈ క్రమంలో ఈ ఏడాది వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా భక్తులు హల్వాయి గణపతికి 6 కోట్ల రూపాయల విలువ చేసే 5 కిలోగ్రాముల బంగారు కిరీటాన్ని గణేషుడికి సమర్పించారు. పర్వదినం సందర్భంగా భక్తులు వినాయకుడిని కొత్త దుస్తులు, ఆభరణాలతో అలంకరించారు. అనంతరం బంగారు కిరీటాన్ని అలంకరించారు. 21 కేజీల మహాప్రసాదిన్ని నివేదించారు.
(చదవండి: జైలులో భర్త.. పండగ వేడుకల్లో శిల్పాశెట్టి)

ఓ వైపు కరోనా భయం.. మరోవైపు వినాయక చవితి ఉత్సవాల కారణంగా ముంబై పోలీసులు సెప్టెంబర్‌ 10-19 వరకు నగరంలో 144 సెక్షన్‌ విధించారు. బహిరంగ ప్రదేశాల్లో ఐదుగురికంటే ఎక్కువ మంది గుమికూడరాదని ఆదేశించారు. గణపతి ఊరేగింపు వేడుకలకు అనుమతి లేదని తెలిపారు. అంతేకాక జనాలు ఇళ్ల దగ్గరే వినాయక చవితి జరుపుకోవాలని సూచించారు. ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో ఆన్‌లైన్‌ దర్శనాలు ప్రారంభించారు. ప్రస్తుతం హల్వాయి గణపతి మందిరంలో కూడా హారతి కార్యక్రమాన్ని లైవ్‌ టెలికాస్ట్‌ చేశారు. 

చదవండి: గోమయ గణేషుడు.. ఇలా ఎందుకంటే..

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top