ముజఫర్‌పూర్: రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్న కాంగ్రెస్- ఆర్జేడీల మధ్య విభేదాలున్నాయని, అవి ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని ముజఫర్‌పూర్‌లో జరిగిన ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఆరోపించారు. తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ప్రతిపక్ష నేతలు, రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌లపై ఆయన పలు విమర్శలు గుప్పించారు. తనను చెడ్డ చేయడం వారి జన్మహక్కుగా భావిస్తున్నారని ప్రధాని నర్రేంద మోదీ వ్యాఖ్యానించారు.
ముజఫర్‌పూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ప్రధాని మోదీ.. ప్రతిపక్ష కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీల నేతలు, కార్యకర్తల మధ్య రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న గొడవలకు సంబంధించిన నివేదికలు తనకు అందుతున్నాయని అన్నారు. ఆ రెండు పార్టీలు పరస్పర విభేదాలతో నీరు, నూనె మాదిరిగా ఉన్నాయని, అవి అధికారాన్ని చేజిక్కించుకుని, బీహార్‌ను దోచుకునేందుకే కలిసి వచ్చాయని ప్రధాని ఆరోపించారు. బీహార్‌లో వారి ర్యాలీలు బూటకం తప్ప మరేమీ కాదని, ఆ పార్టీలు ఎప్పటికీ బీహార్‌ను అభివృద్ధి చేయలేవని ప్రధాని విమర్శించారు. ఈ రెండు పార్టీలు కొన్ని దశాబ్దాలుగా బీహార్‌ను పాలించాయని, అయితే వారు ప్రజలకు ఇచ్చినది ద్రోహం, తప్పుడు వాగ్దానాలు మాత్రమేనంటూ ప్రధాని మోదీ ప్రతిపక్ష పార్టీలపై విరుచుకు పడ్డారు.
ఐదు నిదర్శనాలు
ఆర్జేడీ, కాంగ్రెస్‌ల దుష్ప్రవర్తనకు నిదర్శనాలుగా ఐదు విషయాలు ఉన్నాయని, అవి.. దేశీయంగా తయారు చేసిన పిస్టల్స్, క్రూరత్వం, సామాజిక ద్వేషం, దుష్ఫరిపాలన, అవినీతి.. అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. బీహార్‌లో అత్యంత వేడుకగా జరుపుకునే ఛట్ పై ప్రధాని డ్రామా చేస్తున్నారని రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇటీవల ఆరోపించారు. దీనికి ప్రధాని సమాధానమిస్తూ కాంగ్రెస్, ఆర్జేడీ నేతలు ఓట్ల కోసం ఛటీ మయ్యాను అవమానించారని ఆరోపించారు. వారికి ఛటీ మయ్యాను పూజించడం కేవలం ఒక నాటకం, ప్రహసనంలా కనిపించిందా అని ప్రధాని ప్రశ్నించారు. ఛట్ పూజను అవమానించిన వారిని బీహార్ ప్రజలు ఎప్పటికీ క్షమించరని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ ఉత్సవానికి యునెస్కో సాంస్కృతిక వారసత్వ హోదా కల్పించేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదన్నారు.


