దేశంలో మరో లాక్‌డౌన్‌ అక్కర్లేదా? ఎందుకో వివరించిన ఎయిమ్స్‌ మాజీ డైరెక్టర్‌

Former AIIMS chief Reacts Amid BF7 variant scares - Sakshi

న్యూఢిల్లీ: పొరుగు దేశంలో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తున్నా.. మన దగ్గర మాత్రం పరిస్థితి ఇంకా అదుపులోనే ఉంది. అయితే.. ముందస్తు జాగ్రత్తగా రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది కేంద్రం. ఈ తరుణంలో.. 

ఒమిక్రాన్‌ వేరియెంట్‌ బీఎఫ్‌.7 స్ట్రెయిన్‌ గనుక విజృంభిస్తే.. భారత్‌లో మరోసారి లాక్‌డౌన్‌ విధిస్తారా? అనే చర్చ తెర మీదకు వచ్చింది. అఫ్‌కోర్స్‌.. కేంద్రం ఆ పరిస్థితి తలెత్తకపోవచ్చనే సంకేతాలను ఇప్పటికే పంపింది కూడా. ఈ తరుణంలో ఎయిమ్స్‌ మాజీ డైరెక్టర్‌, భారత్‌లో కరోనా కల్లోలాన్ని పర్యవేక్షించిన డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా స్పందించారు. 

భారత్‌లో కరోనా ఇప్పుడు పూర్తిగా అదుపులోనే ఉందని, వైరస్‌ పట్ల అప్రమత్తంగా ఉంటే చాలని డాక్టర్‌  గులేరియా పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో.. లాక్‌డౌన్‌ పెట్టడంగానీ, అంతర్జాతీయ విమానాలపై ఆంక్షలు విధించడం లాంటి చర్యలు అసలు అక్కర్లేదని ఆయన అభిప్రాయపడ్డారు. గత అనుభవాలను పరిశీలిస్తే.. విమానాల నిషేధం ఎలాంటి ప్రభావం చూపించలేదు. వైరస్‌ వ్యాప్తిని ఆ నిర్ణయం అడ్డుకోలేకపోయింది. అన్నింటికి మించి చైనాను కుదిపేస్తున్న వేరియెంట్‌.. ఇప్పటికే భారత్‌లోకి ప్రవేశించింది కూడా. 

ఒకవేళ.. భారత్‌లో అత్యధికంగా కేసులు నమోదు అయినా, ప్రజలు ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి వచ్చినా కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఇప్పటికే దేశంలో వ్యాక్సినేషన్‌ అధికంగా నమోదు అయ్యింది. అలాగే..  వైరస్‌ సోకి తగ్గిపోయిన జనాభా కూడా అధికంగానే ఉంది. ప్రజల్లో రోగ నిరోధక శక్తి పెరిగింది అని పల్మనాలజిస్ట్ అయిన గులేరియా తెలిపారు. ఇలాంటి పరిస్థితులన్నింటిని గనుక పరిగణనలోకి  తీసుకుంటే లాక్‌డౌన్‌ ప్రస్తావనే అక్కర్లేదు అని అన్నారు.

మరోవైపు చైనా సహా కరోనా కేసులు అధికంగా నమోదు అవుతున్న దేశాల నుంచి వస్తున్న విమానాలపై భారత ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు విధించలేదు. కాకపోతే.. ప్రయాణికుల కోసం కొన్ని మార్గదర్శకాలను ప్రత్యేకంగా విడుదల చేసింది. ఎయిర్‌ సువిధా ఫామ్‌లో ఆరోగ్య స్థితిని తెలియజేయడంతో పాటు ఆర్టీ పీసీఆర్‌ టెస్ట్‌ ఫలితాన్ని తప్పనిసరి చేసింది కేంద్రం. 

అక్కడ పరిస్థితులు భయానకం..ఏ క్షణంలోనైనా లాక్‌డౌన్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top