
అమిటీ విద్యార్థికి 26 చెంపదెబ్బలు.. వీడియో వైరల్
లక్నో: యూపీ రాజధాని లక్నోలోని అమిటీ యూనివర్సిటీ లా కాలేజీ విద్యార్థిని క్లాస్‌మేట్స్ దూషిస్తూ దారుణంగా కొట్టారు. వర్సిటీ క్యాంపస్‌లోని పార్కు చేసి ఉన్న వాహనంలో ఆగస్ట్ 26వ తేదీన జరిగిన ఈ ఘటన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది. ఓ మహిళ ఎడాపెడా చెంపదెబ్బలు కొడుతుండగా పక్కనే ఉన్న మరొకరు దూషణల పర్వం సాగిస్తున్నట్లుగా అందులో ఉంది.
బాధిత విద్యార్థి శిఖర్ ముకేశ్ కేసర్‌వాని దెబ్బలను అడ్డుకునేందుకు ప్రయత్నించగా, ‘చెంపకు చెయ్యి అడ్డు తియ్యి..లేకపోతే మరిన్ని దెబ్బలు తగులుతాయి’అన్న హెచ్చరికలు సైతం రికార్డయ్యాయి. ఒకటిన్నర నిమిషాల వ్యవధిలో కనీసం 25, 30 సార్లు బాధితుడి చెంపలను వాయించారు.
దాదాపు ముప్పావు గంటపాటు శిఖర్‌పై దాడి కొనసాగిందని, ఆ దెబ్బలకు అతడు భయంతో అనారోగ్యం పాలై అప్పటి నుంచి ఇంట్లోనే ఉంటున్నాడంటూ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాలేజీకి వస్తే చంపేస్తామని వాళ్లు బెదిరించారన్నారు. శిఖర్ ఫోన్‌ను కూడా పగులగొట్టారన్నారు. ఫిర్యాదు ఆధారంగా ఐదుగురిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు కారణాలు తెలియరాలేదు. వర్సిటీ కూడా దీనిపై ఇప్పటి వరకు స్పందించలేదు.