స్వార్థం కోసం తప్పుడు కేసులు! | False POCSO cases being used as a weapon against husbands | Sakshi
Sakshi News home page

స్వార్థం కోసం తప్పుడు కేసులు!

May 31 2026 12:37 AM | Updated on May 31 2026 12:37 AM

False POCSO cases being used as a weapon against husbands

వైవాహిక వివాదాల్లో ‘పోక్సో’దుర్వినియోగం

ఇలాంటి వాటితో బాధితులకు తీవ్ర నష్టం

ఆధారాల్లేవంటూ 10 కేసులను కొట్టివేసిన సుప్రీంకోర్టు

సాక్షి, న్యూఢిల్లీ: దంపతుల మధ్య విభేదాలు తలెత్తినప్పుడు కేవలం ఆర్థిక లబ్ధి, భారీ సెటిల్మెంట్లు ఆశించి భర్త, అతని కుటుంబ సభ్యులపై కేసులు బనాయిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కక్ష సాధింపులో భాగంగా భర్తను దారికి తెచ్చుకునేందుకు మహిళలు గృహహింస, కట్నం వేధింపులతో పాటు ఏకంగా ‘పోక్సో’ వంటి చట్టాలను సైతం దుర్వినియోగం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.

మూకుమ్మడి కేసులు సరికాదు
ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వైవాహిక వివాదంలో దాఖలైన 10 క్రిమినల్‌ కేసుల రద్దు పిటిషన్‌పై జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ల ధర్మాసనం ఇటీవల విచారణ జరిపింది. ‘దంపతుల మధ్య సంబంధాలు దెబ్బతిన్నప్పుడు, భర్తపై కక్ష తీర్చుకునేందుకు క్రిమినల్‌ చట్టాలను వాడుకుంటున్నారు. 

ఎలాంటి నిర్దిష్ట ఆధారాలు లేకుండానే క్రూరత్వం, గృహహింస పేరిట అత్తమామలు, వృద్ధులైన కుటుంబ సభ్యులందరిపైనా మూకుమ్మడిగా కేసులు పెడుతు న్నారు’అని ధర్మాసనం పేర్కొంది. ఈ తరహా తప్పుడు కేసుల వల్ల కోర్టుల విలువైన సమయం వృథా కావడమే కాకుండా, న్యాయం కోసం నిరీక్షించే అసలైన బాధితులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని స్పష్టం చేసింది. ఇలాంటి తప్పుడు కేసులు పెట్టేలా న్యాయవాదులు తమ క్లయింట్లను ప్రోత్సహించ రాదని కూడా ధర్మాసనం హితవు పలికింది.

పావులుగా పిల్లలు
వైవాహిక వివాదాల్లో సంతానాన్ని కూడా పావులుగా వాడుకుంటున్న ‘అతి దారుణమైన ధోరణి’గురించి కోర్టు ప్రస్తావించింది. తండ్రి తన మైనర్‌ కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ తల్లులు పోక్సో చట్టం కింద తప్పుడు కేసులు పెట్టిస్తున్న వైనాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. ఎక్కువ భరణం డిమాండ్‌ చేయడానికి లేదా రాజీకి రావాలని ఒత్తిడి చేయడానికి, పిల్లల ఇష్టానికి వ్యతిరేకంగా వారితోనే కన్నతండ్రిపై అబద్ధపు ఆరోపణలు చేయిస్తున్నారని ధర్మాసనం ఆవేదన చెందింది. కేవలం భార్యాభర్తల గొడవల్లోనే కాకుండా.. ఆస్తి వివాదాలు, వ్యాపార తగాదాలు, అప్పుల వ్యవహారాల్లో సైతం ఎదుటివారిని బెదిరించేందుకు పోక్సోను ఆయుధంగా వా డుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేసింది.

అలహాబాద్‌ హైకోర్టు తీర్పు కొట్టివేత
భర్త, అతడి సోదరుడు తన 14 ఏళ్ల కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డారని, ఇతర కుటుంబ సభ్యులు భౌతికంగా దాడి చేశారని ఓ మహిళ నమోదు చేసిన క్రిమినల్‌ కేసులను ధర్మాసనం కొట్టివేసింది. తల్లి ఒత్తిడి, ఆమె నేర్పించిన మాటల మేరకే బాలిక ఈ ఆరోపణలు చేసినట్లు స్పష్టమవుతోందని ధర్మాసనం తన తీర్పులో వెల్లడించింది.

 ఫిర్యాదులో తల్లీకూ తుళ్ల వాంగ్మూలాలు అక్షరం పొల్లుపోకుండా ఒకేలా ఉన్నాయని, ఆరోపణలకు ఎలాంటి వైద్యపరమైన ఆధారాలు లేవని పేర్కొంది. ఇలాంటి సాధారణ, అస్పష్టమైన ఆరోపణలతో క్రిమినల్‌ విచారణను కొనసాగించడం చట్టాన్ని దుర్వినియోగం చేయడమేనని స్పష్టం చేసింది. అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనపెడుతూ.. భర్త, అతని కుటుంబ సభ్యులపై నమోదైన పది కేసులను రద్దు చేస్తూ ధర్మాసనం తుది తీర్పు వెలువరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement