Rahul Gandhi: రాహుల్‌పై అనర్హత వేటు.. సెప్టెంబర్‌లో వయనాడ్‌ స్థానానికి ఉప ఎన్నిక?

Election To Rahul Gandhi Wayanad Seat Soon Poll Body To Decide - Sakshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు ప్రస్తుతం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ‘దొంగలందరి ఇంటి పేరూ మోదీయే ఎందుకుంటుందో’ అని వ్యాఖ్యానించిన కేసులో సూరత్‌ కోర్టు రాహుల్‌ను దోషిగా నిర్ధారించి రెండేళ్ల జైలు శిక్ష విధించడం తెలిసిందే.  కోర్టు తీర్పు నేపథ్యంలో ఎంపీగా రాహుల్‌పై అనర్హత వేటు పడింది. ఆయన లోక్‌సభ సభ్యత్వం రద్దు చేస్తూ పార్లమెంట్‌ సెక్రటేరియట్‌ శుక్రవారం నిర్ణయం తీసుకుంది.

కాగా రాహుల్‌పై అనర్హత వేటు వేయడంతో లోక్‌సభలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కేరళలోని వయనాడ్‌ స్థానం ఖాళీ అయినట్టు లోక్‌సభ వెబ్‌సైట్‌ పేర్కొంది. ప్రజాప్రాతినధ్య చట్టం 2015లోని సెక్షన్‌ 151(ఏ) ప్రకారం.. ఏ కారణం చేతనైనా ఎమ్మెల్యే, ఎంపీ స్థానం ఖాళీ అయితే  6 నెలల్లోపు ఉప ఎన్నికల నిర్వహించి ఆ స్ధానాన్ని  భర్తీ చేయాల్సి ఉంటుంది. లోక్‌సభలో ప్రస్తుతం మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి.

రాహుల్‌పై అనర్హత వేటు కారణంగా ఖాళీ అయిన వయనాడ్‌ స్థానానికి నిబంధలన ప్రకారం సెప్టెంబర్‌ 23లోపు ఉప ఎన్నిక జరగాలి. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్‌లో ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు సమాచారం. అదే విధంగా ఎన్సీపీ ఎంపీ మహ్మద్‌ ఫైజల్‌పై హత్యా యత్నం నేరం రుజువై పదేళ్ల జైలు శిక్ష పడటంతో లక్షద్వీప్, కాంగ్రెస్‌ ఎంపీ సంతోఖ్‌ సింగ్‌ చౌదరి మృతితో జలంధర్‌ (పంజాబ్‌) స్థానాలు కూడా ఖాళీగా ఉన్నాయి. 2019లో వయనాడ్‌తో పాటు గాంధీల కంచుకోట అయిన యూపీలోని అమేఠీ నుంచి కూడా పోటీ చేసిన రాహుల్‌ అక్కడ బీజేపీ నేత స్మృతీ ఇరానీ చేతిలో ఓటమి చూవిచూశారు. దీనిపై ఎన్నికల కమిషన్‌ తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉంది.

మరోవైపు రాహుల్‌పై అనర్హత వేటును కాంగ్రెస్‌ తీవ్రంగా నిరసించగా విపక్షాలన్నీ ముక్త కంఠంతో ఖండించాయి. ఆయనకు బాసటగా నిలిచాయి. లోక్‌సభ సభ్యత్వం రద్దుపై చట్టపరంగా, రాజకీయంగా పోరాడుతామని కాంగ్రెస్‌ పేర్కొంది. ఈక్రమంలో దేశ వ్యాప్తంగా జనాందోళన్‌కు పిలుపునిచ్చింది. ఇదిలా ఉండగా  అపీలుకు వీలుగా శిక్ష అమలును నెల రోజుల పాటు నిలిపేస్తున్నట్టు సూరత్‌ కోర్టు పేర్కొనడం తెలిసిందే.

అయినా లోక్‌సభ సెక్రటేరియట్‌ మాత్రం 24 గంటల్లోపే ఎంపీగా ఆయనను అనర్హుడిగా ప్రకటిస్తూ వేటు వేయడం గమనార్హం! శిక్షపై ఉన్నత న్యాయస్థానంలో స్టే లభించని పక్షంలో రెండేళ్ల జైలు శిక్షా కాలం, అనంతరం మరో ఆరేళ్లు కలుపుకుని మొత్తం ఎనిమిదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాహుల్‌ అనర్హుడవుతారు.
చదవండి: రాహుల్‌పై అనర్హత వేటు.. సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top