బెంగళూరుకు తప్పిన ఎబోలా భయం! | Ebola Scare in Bengaluru Ugandan National Tests Negative | Sakshi
Sakshi News home page

బెంగళూరుకు తప్పిన ఎబోలా భయం!

May 27 2026 12:23 PM | Updated on May 27 2026 12:31 PM

Ebola Scare in Bengaluru Ugandan National Tests Negative

బెంగళూరు: కర్ణాటకలోని బెంగళూరు నగరాన్ని వణికించిన ఎబోలా భయం తొలిగిపోయింది. ఇటీవల ఉగాండా నుండి వచ్చిన ఒక 28 ఏళ్ల మహిళకు ఎబోలా సోకిందన్న అనుమానంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. అయితే, పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నిర్వహించిన రక్త పరీక్షల్లో ఆమెకు ఎబోలా లేదని స్పష్టమైంది. దేశంలో ఎబోలా కేసు ఏదీ నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

సందేహాల నుంచి ఉపశమనం వైపు..
ఉగాండా నుంచి అహ్మదాబాద్ మీదుగా బెంగళూరుకు చేరుకున్న సదరు మహిళకు ఒంటి నొప్పులు వంటి లక్షణాలు కనిపించడంతో, అధికారులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి రిస్క్ తీసుకోకూడదనే ఉద్దేశంతో ఆమెను వెంటనే బెంగళూరులోని ఎపిడెమిక్ డిసీజెస్ ఆసుపత్రికి తరలించి ఐసోలేషన్‌లో ఉంచారు. రక్త నమూనాలను పుణెకు పంపగా, ఫలితాలు నెగటివ్‌గా రావడంతో ఆందోళన వీడింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.

ప్రభుత్వ అప్రమత్తత, ప్రజలకు విజ్ఞప్తి
ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో, భారత్‌లో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిశితంగా పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ  మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎబోలాపై ఎటువంటి వదంతులను నమ్మవద్దని, కేవలం అధికారిక సమాచారాన్ని మాత్రమే అనుసరించాలని ప్రభుత్వం ప్రజలను కోరింది. అనవసర భయాందోళనలకు లోనుకావద్దని హెచ్చరించింది.

ప్రయాణాలపై ఆంక్షలు
ప్రపంచవ్యాప్తంగా ఎబోలాను 'గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ'గా డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటించడంతో, భారత ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. ప్రజా ప్రయోజనం దృష్ట్యా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా,  దక్షిణ సూడాన్ దేశాలకు అత్యవసరమైతే తప్ప ప్రయాణించవద్దని కేంద్రం ఇప్పటికే ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. అంతర్జాతీయ ప్రయాణికులపై నిఘా పటిష్టం చేయడంతో పాటు, ఆస్పత్రుల్లో ప్రత్యేక ఐసోలేషన్ వార్డులను సిద్ధం చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది.

Advertisement
 
Advertisement
Advertisement