దారుణం : కాఫీలో మత్తుమందు కలిపి సామూహిక అత్యాచారం | DU student alleges four-day sexual assault in Lucknow | Sakshi
Sakshi News home page

దారుణం : కాఫీలో మత్తుమందు కలిపి సామూహిక అత్యాచారం

May 25 2026 2:21 PM | Updated on May 25 2026 2:53 PM

DU student alleges four-day sexual assault in Lucknow

దేశ రాజధాని నగరానికి సంబంధించి మరో ఘోర సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో మొదటి సంవత్సరం చదువుతున్న 19 ఏళ్ల విద్యార్థిని, కిడ్నాప్‌ చేసి నాలుగు రోజులు పాటు సామూహిక అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపుతోంది.

లక్నోలోని ఒక అద్దె గదికి తీసుకెళ్లి నాలుగు రోజుల పాటు పదేపదే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదు ప్రకారం ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌కు చెందిన బాధితురాలు దౌలత్ రామ్ కాలేజీలో పొలిటికల్ సైన్స్ చదువుతోంది. సెలవుల్లో తన సొంత గ్రామాన్ని సందర్శించి ఢిల్లీకి తిరిగి వస్తుండగా మే 15న జాఫరాబాద్ రైల్వే స్టేషన్‌లో రైలు ఎక్కింది. ఈ ప్రయాణంలో, 20 ఏళ్ల శివం యాదవ్ అనే పాత పరిచయస్తుడికి సందేశం పంపింది. అతను లక్నోలోని చార్‌బాగ్ రైల్వే స్టేషన్‌లో 19 ఏళ్ల సన్నీ యాదవ్ అనే మరో వ్యక్తితో కలిసి ఆమెను కలిశాడు. ఆమెను తిరిగి స్టేషన్‌లో దింపే ముందు ఇక్కడ కొద్ది  సేపు ఉండొచ్చు కదా అని ఆమెన బలవంతంగా ఒప్పించారు. 

ఆ తర్వాత ఆ ఇద్దరు వ్యక్తులు ఆమెను క్యాబ్‌లో సుశాంత్ గోల్ఫ్ సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి సమీపంలో ఉన్న అద్దె గదికి తీసుకెళ్లారు.  కోల్ట్‌ కాఫీలో  మత్తు మందు కలిపి ఇచ్చారు. మే 15, 16 తేదీల రాత్రి తనపై పలుమార్లు లైంగిక దాడి జరిగిందని ఆమె ఆరోపించింది. తరువాతి రెండు రోజుల పాటు ఇది కొనసాగింది.  మే 16న రెండవ వ్యక్తి ఆమెపై మళ్లీ దాడి చేశాడని, ఆ తర్వాత గుర్తుతెలియని మూడవ వ్యక్తిని గదిలోకి తీసుకువచ్చి అతను కూడా ఆమెపై  రేప్‌ చేయించాడు. ఎదురుతిరిగినా, ఎవరికైనా చెప్పినా జరిగిన విషయాన్ని బయటపెడితే చంపేస్తామని బెదిరించారు. 

ఆ తరువాత మే 18న ఆమెను తిరిగి చార్‌బాగ్ రైల్వే స్టేషన్‌కు తీసుకువెళ్లి, ఒక జనరల్ టికెట్ కొని ప్లాట్‌ఫామ్‌పై వదిలిపెట్టాడు. ఆమె ఢిల్లీకి వెళ్లే రైలు ఎక్కింది. ప్రయాణంలో ఉండగానే తన కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలియజేసి, రైల్వే హెల్ప్‌లైన్ 139ని  ఫిర్యాదు చేసింది.  దీంతో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌ను అప్రమత్తం చేశారు.

మే 19న ఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్న తర్వాత, వైద్య పరీక్షల కోసం హెడ్గేవార్ ఆసుపత్రికి తరలించారు పోలీసులు.  వైద్య నమూనాలను సేకరించి, సీల్ చేసి, సాక్ష్యంగా స్వాధీనం చేసుకున్నారు. సఖి వన్ స్టాప్ సెంటర్ కౌన్సిలర్ ద్వారా కౌన్సెలింగ్ సహాయం ఏర్పాటు  చేశారు.

దక్షిణ జోన్ అదనపు డీసీపీవసంత కుమార్, ప్రాథమికవిచారణలో శివమ్, సన్నీ ఇద్దరూ బాధితురాలు నివసించే జౌన్‌పూర్‌లోని అదే గ్రామానికి చెందినవారని తేలిందన్నారు.  నిందితుల్లో ఒకడైన శివమ్ కాఫీ షాప్‌లో పనిచేస్తున్నారని, మరో నిందితుడు సన్నీఈ-కామర్స్ కంపెనీలో డెలివరీ బాయ్‌గా ఉన్నాడు. నిందితులను అరెస్టు చేయడానికి ఐదు బృందాలను ఏర్పాటు చేశామని, వారు దాక్కునే అవకాశం ఉన్న ప్రదేశాలను తెలుసుకోవడానికి వారి కుటుంబ సభ్యులను విచారిస్తున్నామన్నారు.

ఆనంద్ విహార్‌లో రైల్వే పోలీసులు భారతీయ న్యాయ సంహిత, 2023లోని సెక్షన్లు 70(1) (సామూహిక అత్యాచారం), 123 (విషం ద్వారా గాయపరచడం), 127(3) (అక్రమ నిర్బంధం) మరియు 351(2) (నేరపూరిత బెదిరింపు) కింద జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని నివేదిక పేర్కొంది. ఈ కేసు మే 23న లక్నో పోలీసులకు బదిలీ చేయబడింది మరియు సుశాంత్ గోల్ఫ్ సిటీ పోలీస్ స్టేషన్‌లో అవే సెక్షన్ల కింద కొత్త ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడింది. ఆరోపిత నేరస్థలం లక్నో పరిధిలోకి వస్తుందని, తదుపరి దర్యాప్తు కోసం పత్రాలను పంపినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.  

ఇదీ చదవండి: ముంబై ఇండియన్స్‌పై చమక్కులు : నవ్వు ఆపుకోలేకపోయిన నీతా అంబానీ

Advertisement
 
Advertisement
Advertisement