
లక్నో: యూపీలోని గ్రేటర్ నోయిడాలో చోటుచేసుకున్న వరకట్న వేధింపుల ఘటనలో ఒక మహిళ బలయ్యింది. ఆమెను భర్త, అత్తింటివారు సజీవదహనం చేసిన ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇది దేశంలో వివాహిత మహిళలు ఎదుర్కొంటున్న హింసాయుత ఘటనల తీవ్రతను మరోసారి వెలుగులోకి తెచ్చింది.
అత్యాచారాల కంటే అధికం
దేశంలో వరకట్న మరణాలనేవి అత్యాచారాల కంటే అధికంగా ఉన్నాయని హోం మంత్రిత్వశాఖకు చెందిన జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్‌సీఆర్బీ) తెలియజేసింది. బ్యూరో వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం 2022లో భారత్‌లో 6,516 వరకట్న మరణాలు చోటుచేసుకున్నాయి. అత్యాచారం, గ్యాంగ్‌రేప్ తరువాత హత్యకు గురైన మహిళల మరణాల కంటే ఈ మరణాలు 25 రెట్లు ఎక్కువ అని వెల్లడయ్యింది.
ప్రతి మూడో మహిళ..
2022లో 13,641 మహిళలు వరకట్న వేధింపులకు గురయ్యారు. ఈ ఉదంతాలు పోలీస్ స్టేషన్లలో నమోదయ్యాయి. ఈ సంఖ్యను అనుసరించి చూస్తే, వరకట్న వేధింపులకు గురైన ప్రతి మూడో మహిళ మరణిస్తున్నదని తెలుస్తోంది. బాధితులు చివరివరకు న్యాయపరమైన సహాయాన్ని కోరడంలో వెనుకడుగు వేస్తుండటమే ఇందుకు కారణమని నిపుణులు అంటున్నారు.
న్యాయం దొరకే అవకాశాలు బహు స్వల్పం
2022 చివరి నాటికి 60,577 వరకట్న కేసులు కోర్టుల్లో పెండింగ్‌లో ఉండగా, అందులో 54,416 కేసులు ఎప్పటి నుంచో కొనసాగుతున్నాయి. ఆ ఏడాది 3,689 కేసులకు సంబంధించిన విచారణ పూర్తయినా, కేవలం 33శాతం తీర్పులలో నిందితులకు శిక్ష పడింది. కోర్టులకు పంపిన 6,161 నూతన కేసుల్లో కేవలం 99 కేసుల్లో మాత్రమే శిక్షలు అమలయ్యాయి. దీని ప్రకారం చూస్తే బాధిత కుటుంబాలకు ఏడాదిలోపు న్యాయం దొరకే అవకాశాలు రెండు శాతం కంటే చాలా తక్కువేని తేలింది.
వరుడి కుటుంబంతో పోలిస్తే..
భారతదేశంలో వరకట్నం ఇప్పటికీ ఒక ఆచారంగా కొనసాగుతోంది. పలు అధ్యయనాలు ఈ సమస్య నేటికీ తీవ్రంగానే ఉందని తెలియజేస్తున్నాయి. ఇండియా హ్యూమన్ డెవలప్మెంట్ సర్వే (2004-05)లో వెల్లడైన వివరాల ప్రకారం పెళ్లిళ్లలో వరుడి కుటుంబంతో పోలిస్తే వధువు కుటుంబం 1.5 రెట్లు ఎక్కువ ఖర్చు చేస్తున్నది. 24 శాతం కుటుంబాలు టీవీలు, ఫ్రిజ్‌లు, కార్లు, బైక్‌లు తదితర వస్తువులను వరునికి కట్నంగా ఇచ్చాయి.
మహిళల్లో 29 శాతం మంది..
2019-21 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్) తెలిపిన వివరాల ప్రకారం 18-49 ఏళ్ల మధ్య వయస్సు గల మహిళల్లో 29 శాతం మంది భర్తలు లేదా భాగస్వాముల నుంచి శారీరక లేదా లైంగిక హింస అనుభవిస్తున్నారు. వరకట్న దురాచారాన్ని రూపుమాపేందుకు వివిధ స్వచ్ఛంద సంస్థలు విశేష కృషి చేస్తున్నాయి.