
బిహార్‌లో కుక్కకు రెసిడెన్స్ సర్టిఫికెట్
పట్నా: బిహార్‌లో రెవెన్యూ అధికారులు ఓ శునకానికి రెసిడెన్స్ సర్టిఫికెట్ జారీ చేశారు. డాగ్ బాబు పేరిట ఈ నివాస ధృవీకరణ పత్రం జారీ అయింది. ఇందులో అభ్యర్థి పేరు డాగ్‌బాబు అని, అతని తండ్రి పేరు కుత్తా బాబు, తల్లి పేరు కుత్తియా దేవి అని రాసి ఉంది. వీళ్ల ఇంటి చిరునామా కాలమ్‌లో ‘మొహల్లా కౌలిచక్, వార్డు నంబర్–15, నగర పరిషత్, మసౌరీ పట్టణం’’అని రాసి ఉంది.
గోల్డెన్ రిట్రీవర్ జాతి వీధి శునకం ఫొటోతో ఈ ధృవపత్రం జారీచేశారు. ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్‌పై అక్కడి రెవెన్యూ అధికారి మురారీ చౌహాన్ డిజటల్ సంతకం ఉంది. ఇది 2025 జూలై 24న ఈ సర్టిఫికేట్‌ను జారీచేశారు. సంబంధిత ప్రభుత్వ పోర్టల్‌లో ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమవడంతో ఈ అంశం ఇప్పుడు బిహార్‌లో చర్చనీయాంశమైంది. ఢిల్లీకి చెందిన ఒక మహిళ పత్రాలకు ఈ సర్టిఫికేట్ జారీ కోసం దురి్వనియోగం చేసినట్లు తెలుస్తోంది.
బిహార్‌లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్) నేపథ్యంలో శునకానికీ రెసిడెన్స్ సర్టిఫికెట్ జారీకావడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఎస్‌ఐఆర్ ఆమోదం పొందుతున్న సర్టిఫికెట్లలో ఇలాంటి వింతలు ఎన్నో ప్రత్యక్షమవుతున్నాయని స్వరాజ్ ఇండియా నేత యోగేంద్ర యాదవ్ సోషల్ మీడియా వేదికగా విమర్శించారు. ‘మీరే చూడండి. జూలై 24వ తేదీన ఒక శునకానికి బిహార్‌లో నివాస ధ్రువీకరణ పత్రం జారీ చేశారు.
రాష్ట్రంలో ఎస్‌ఐఆర్ ఆమోదం పొందుతున్న సర్టిఫికెట్లలో చాలా వరకు ఇలాంటివి ఉన్నాయి. అన్ని రకాల డాక్యుమెంట్లు ఉన్న ఓటర్లకు గతంలో జారీ అయిన ఆధార్, రేషన్ కార్డులు నకిలీవని అధికారులు ఓవైపు చె బుతూనే మరోవైపు ఇలా శునకాలకు నివాస ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్నారు’’అని విమర్శకులు సంబంధిత శునకం సర్టిఫికెట్‌ను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌చేశారు. దీంతో ఈ విషయం ఇప్పుడు వైరల్‌గా మారింది.
సర్టిఫికెట్ జారీపై అంతటి విమర్శలు రావడంతో పట్నా జిల్లా మేజి్రస్టేట్ వెంటనే స్పందించారు. ‘మసౌరీ జోన్‌లో డాగ్ బాబు పేరుతో నివాస ధ్రువీకరణ పత్రం జారీ చేసిన అధికారిపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తున్నాం. దోషులైన ఉద్యోగులు, అధికారులపై శాఖాపరమైన, క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాం’’అని జిల్లా మేజి్రస్టేట్ తన ‘ఎక్స్’ఖాతాలో పోస్ట్ చేశారు.