కర్ణాటక కాబోయే సీఎం.. కుటుంబం గురించి తెలుసా? | DK Shivakumar wealthy Congress strongman from powerful political family | Sakshi
Sakshi News home page

కర్ణాటక కాబోయే సీఎం.. కుటుంబం గురించి తెలుసా?

May 28 2026 1:56 PM | Updated on May 28 2026 2:16 PM

DK Shivakumar wealthy Congress strongman from powerful political family

కర్ణాటక రాజకీయాల్లో ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న నాయకత్వ మార్పు ఖాయమైంది. కాంగ్రెస్‌లో ట్రబుల్‌ షూటర్‌గా పేరొందిన డీకే శివకుమార్‌ త్వరలోనే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న డీకే.. ఇప్పుడు అధికార పీఠం ఎక్కబోతుండటంతో ఆయన వ్యక్తిగత జీవితం, కుటుంబ నేపథ్యం, రాజకీయ ప్రస్థానం, ఆస్తుల వివరాలపై నెట్టింట వెతుకులాట కనిపిస్తోంది.. 

డీకే శివకుమార్‌ పూర్తి పేరు దొడ్డలహళ్లి కెంపేగౌడ శివకుమార్‌. 1962 మే 15న కర్ణాటకలోని కనకపుర ప్రాంతంలో జన్మించారు. వొక్కలిగ సమాజానికి చెందిన ఆయన కుటుంబం వ్యవసాయ నేపథ్యంతో ఎదిగింది. తండ్రి కెంపేగౌడ, తల్లి గౌరమ్మ. చిన్నప్పటి నుంచే రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్న డీకే.. విద్యార్థి దశలోనే కాంగ్రెస్‌ రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నారు.

1989లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. అప్పటి నుంచి కర్ణాటక రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. సతనూరు నియోజకవర్గం నుంచి రాజకీయ ప్రయాణం ప్రారంభించిన ఆయన.. తర్వాత కనకపురకు మారి వరుస విజయాలు సాధించారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో అత్యంత ప్రభావవంతమైన వొక్కలిగ నేతగా గుర్తింపు పొందారు.

కుటుంబం కూడా హైప్రొఫైల్‌!
డీకే శివకుమార్‌ భార్య ఉషా శివకుమార్‌. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇద్దరు కుమార్తెలు ఐశ్వర్య, ఆభరణ.. ఒక కుమారుడు ఆకాశ్‌. పెద్ద కుమార్తె ఐశ్వర్య వివాహం ప్రముఖ వ్యాపారవేత్త, కేఫే కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ కుమారుడు అమర్త్యతో జరిగింది. ఈ వివాహం దేశవ్యాప్తంగా హైప్రొఫైల్‌ ఈవెంట్‌గా నిలిచింది.

డీకే కుటుంబంలో రాజకీయ ప్రభావం కూడా గట్టిగానే ఉంది. ఆయన సోదరుడు డీకే సురేష్‌ కుమార్‌ కూడా కాంగ్రెస్‌ నేతగానే గుర్తింపు పొందారు. బెంగళూరు రూరల్‌ నుంచి పలుమార్లు ఎంపీగా గెలిచారు. దీంతో డీకే కుటుంబం కర్ణాటక కాంగ్రెస్‌లో శక్తివంతమైన రాజకీయ కుటుంబంగా ఎదిగింది.

కాంగ్రెస్‌కు ‘ట్రబుల్‌ షూటర్‌’
డీకే శివకుమార్‌ కాంగ్రెస్‌ హైకమాండ్‌కు అత్యంత నమ్మకస్తుడిగా పేరొందారు. కర్ణాటకలో సంక్షోభాలు వచ్చినప్పుడల్లా ఎమ్మెల్యేలను కాపాడటం, రిసార్ట్‌ రాజకీయాలు నిర్వహించడం, ప్రభుత్వాలను నిలబెట్టడం వంటి వ్యవహారాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. గుజరాత్‌లో అహ్మద్‌ పటేల్‌ రాజ్యసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను బెంగళూరులో రక్షించడం ద్వారా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు.

దేశంలోనే ధనిక నేతల్లో ఒకరు
డీకే శివకుమార్‌ దేశంలోనే అత్యంత ధనిక రాజకీయ నాయకుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ఎన్నికల అఫిడవిట్ల ప్రకారం ఆయన ఆస్తులు వందల కోట్లలో ఉన్నాయి. 2018 ఎన్నికల సమయంలోనే దాదాపు రూ.840 కోట్లకు పైగా ఆస్తులు ప్రకటించారు. తర్వాతి అఫిడవిట్లలో ఈ ఆస్తుల విలువ మరింత పెరిగినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

వ్యవసాయ భూములు, కమర్షియల్‌ ప్రాపర్టీలు, బెంగళూరులో భారీ స్థలాలు, వ్యాపార పెట్టుబడులు, లగ్జరీ వాహనాలు, ఆభరణాలు, ఖరీదైన గడియారాలు ఆయన పేరుతో ఉన్నట్లు అఫిడవిట్లలో నమోదైంది. ఇటీవల రూ.43 లక్షల విలువైన కార్టియర్‌ వాచ్‌పై కూడా రాజకీయ వివాదం చెలరేగింది. దానిపై స్పందించిన డీకే.. “నా దగ్గర రోలెక్స్‌ కూడా ఉంది” అంటూ సెటైరిక్‌గా బీజేపీకి కౌంటర్‌ ఇచ్చారు.

ఈడీ, ఐటీ కేసులతోనూ వార్తల్లో..
డీకే శివకుమార్‌ రాజకీయ జీవితంలో వివాదాలు కూడా తక్కువ లేవు. ఆదాయానికి మించిన ఆస్తులు, మనీలాండరింగ్‌, ఐటీ దాడుల కేసుల్లో ఆయన పేరు పలుమార్లు వార్తల్లో నిలిచింది. 2019లో ఈడీ కేసులో అరెస్టై జైలుకూ వెళ్లారు. అయితే ఆ తర్వాత మరింత బలంగా రాజకీయాల్లో తిరిగి నిలబడ్డారు.

ఇప్పుడు సీఎం కుర్చీ..
2023లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినప్పుడే డీకే సీఎం అవుతారన్న ప్రచారం జోరుగా సాగింది. అయితే పార్టీ హైకమాండ్‌ అప్పట్లో సిద్ధరామయ్యకు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించింది. అప్పటి నుంచి డీకే శివకుమార్‌ సహనంతో ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో.. ఆయన కల నిజం కాబోతోందన్న చర్చ కర్ణాటక రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement