
ధర్మస్థళ: కర్ణాటకలోని మంగళూరు జిల్లాలోగల ధర్మస్థళ పుణ్యక్షేత్రం పరిధిలో సామూహిక ఖననాల ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒక మాజీ పారిశుద్ధ్య కార్మికుడు తాను వందలాది మృతదేహాలను ఇదే ప్రాంతంలో ఖననం చేశానంటూ అధికారులకు ఫిర్యాదు చేసిన దరిమిలా దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఆ పారిశుద్ధ్య కార్మికుడు సూచించిన ప్రాంతాల్లో తవ్వకాలు చేపట్టింది.

11 వ సమాధి స్థలంలో..
ఈ నేపధ్యంలో సిట్ అధికారులు తాము ఈ ప్రాంతంలో ఆరో రోజున సోమవారం కూడా తవ్వకాలు జరిపామన్నారు. ఈ తవ్వకాల్లో పలు ఎముకలు, ఒక పుర్రె లభ్యమయ్యిందని వెల్లడించారు. 11వ సమాధి స్థలంలో తవ్వకాలు ప్రారంభించిన కొద్దిసేపటికే, ఒక వ్యక్తి తమ దగ్గరకు వచ్చి, సమీపంలోని వేరే ప్రదేశానికి తీసుకెళ్లాడన్నారు. అక్కడ తవ్వకాలు జరిపినప్పుడు అనేక ఎముకలు, ఒక పుర్రె దొరికాయన్నారు. తాము
భోజన విరామం తీసుకోకుండా, గంటల తరబడి తవ్వకాలు జరిపామని సిట్ అధికారులు తెలిపారు. అయితే లభ్యమైన ఎముకలు, పుర్రెకు సంబంధించిన వివరాలపై వారు ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. సిట్ అధికారులు తాము గుర్తించిన 13 సమాధులలో తవ్వకం పూర్తి చేసే పనిలో ఉన్నారు. అయితే ప్రస్తుతం తవ్వకాలు జరుపుతున్న 11 వ సమాధి స్థలంలో తవ్వకాలు పూర్తయ్యాయా? లేదా అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. అయితే తాజాగా లభ్యమైన ఆధారాలు ఈ కేసు దర్యాప్తులో కీలక పరిణామంగా భావిస్తున్నారు.

మరో ఫిర్యాదు..
ఇదిలా ఉండగా, మంగళూరు జిల్లాలోని ఇచిలంపాడి గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త టి. జయంత్ సోమవారం సిట్ అధికారులకు ఒక ఫిర్యాదు సమర్పించారు. చట్టపరమైన విధానాలను పాటించకుండా మైనర్ బాలిక మృతదేహాన్ని ఒక పోలీసు అధికారి ఇక్కడ పూడ్చిపెట్టారని ఆరోపించారు. దీనిపై కేసు కూడా నమోదు కాలేదని పేర్కొన్నారు. ఈ ఘటనకు తానే ప్రత్యక్ష సాక్షినని, భయం కారణంగా ఆ సమయంలో ఎవరికీ ఈ విషయం చెప్పలేదన్నారు. ఈ ఫిర్యాదు అందిన తర్వాత అధికారులు.. ఫిర్యాదుదారు జయంత్‌ను దీనిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు దాఖలు చేయాలని సూచించారు.


ఫోరెన్సిక్ పరీక్షలకు ఎముకలు
సిట్ తాజాగా నేత్రావతి నది సమీపంలో జరిపిన తవ్వకాల్లో మానవ ఎముకలు లభ్యమయ్యాయి. నాలుగు అడుగుల లోతున 15 ముక్కలుగా ఉన్న ఎముకలను కనుగొన్నారు. అవి పురుషునికి చెందినవిగా భావిస్తున్నారు. వయస్సు, లింగం, మరణానికి కారణాన్ని నిర్ధారించేందుకు ఆ ఎముకలను ఫోరెన్సిక్ నిపుణుల పరీక్షలకు పంపారు. దీనికిముందు 2000–2015 మధ్యకాలంలో ఇక్కడ చోటచేసుకున్న మరణ రికార్డులను బెల్తంగడి పోలీసులు తొలగించారనే ఆరోపణలు వినిపించాయి. ఇది స్థానికుల్లో ఆందోళన కలిగించింది. మరోవైపు ఈ ఘటనపై యూట్యూబ్ ఛానళ్లు వివరాలను నివేదించేందుకు అనుమతిస్తూ కర్ణాటక హైకోర్టు మీడియా గ్యాగ్ ఆర్డర్‌ను ఎత్తివేసింది. మరోవైపు సిట్ మంగళూరులో తమ తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. స్థానికుల సలహాలు, సూచనల కోసం హెల్ప్‌లైన్‌ను ప్రారంభించింది.
ఇది కూడా చదవండి: ధర్మస్థళ మిస్టరీ: ఆధారాలపై షాకిచ్చిన ఆర్టీఐ సమాధానం