దక్షిణాది ప్రాతినిధ్యానికి కోత దేశద్రోహమే: రాహుల్‌ | Delimitation is a conspiracy to change the face of the countrys elections says rahul | Sakshi
Sakshi News home page

దక్షిణాది ప్రాతినిధ్యానికి కోత దేశద్రోహమే: రాహుల్‌

Apr 18 2026 4:56 AM | Updated on Apr 18 2026 4:58 AM

Delimitation is a conspiracy to change the face of the countrys elections says rahul

‘డీలిమిటేషన్‌’ దేశ ఎన్నికల ముఖచిత్రాన్నే మార్చే కుట్ర 

అధికారం కోసమే రాష్ట్రాల హక్కులను కాలరాసే యోచన 

ఓబీసీలు, దళిత రిజర్వేషన్లకు గండి కొట్టడమే లక్ష్యం 

మోదీ సర్కారు తీరు సిగ్గుచేటంటూ లోక్‌సభలో నిప్పులు 

సాక్షి, న్యూఢిల్లీ: డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కేందుకు మోదీ సర్కారు కుట్ర పన్నుతోందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘కేవలం అధికారంలో కొనసాగడం కోసం దక్షిణాది, ఈశాన్య ప్రాంతాలకు, చిన్న రాష్ట్రాలకు లోక్‌సభలో ప్రాతినిధ్యాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది. కేంద్రం తలపెట్టిన డీలిమిటేషన్‌ నిజానికి దేశ ఎన్నికల ముఖచిత్రాన్నే మార్చే కుట్ర. 

ఇది ముమ్మాటికీ దేశద్రోహ చర్యే’’అంటూ దుయ్యబట్టారు. రాజ్యాంగ (131వ) సవరణ, డీలిమిటేషన్, కేంద్రపాలిత ప్రాంతాల బిల్లులపై శుక్రవారం లోక్‌సభలో జరిగిన చర్చలో రాహుల్‌ సుదీర్ఘంగా మాట్లాడారు. సవరణ బిల్లును ‘చాలా ప్రమాదకరమైనది’గా అభివర్ణించారు. ‘‘మోదీ సర్కారు పూనుకున్న ఈ దేశ వ్యతిరేక చర్యకు విపక్షాలు మద్దతిచ్చే ప్రసక్తే లేదు. సవరణ బిల్లును ఓడించి తీరతాయి’’అని పేర్కొన్నారు. అది ఆమోదం పొందదని బీజేపీకి కూడా తెలుసన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను, ప్రధాని మోదీ తీరును ఈ సందర్భంగా ఆయన తీవ్రంగా ఎండగట్టారు. 

దళితులు, ఓబీసీలకు అన్యాయం 
కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది అసలు మహిళా బిల్లు కానే కాదని రాహుల్‌ కొట్టిపారేశారు. ‘‘నిజమైన మహిళా బిల్లు 2023లోనే ఆమోదం పొందింది. దాన్ని పదేళ్ల తర్వాత అమలు చేస్తామని బీజేపీ చెబుతోంది. ఇది కేవలం మహిళల మాటున దాక్కుని దేశ ఎన్నికల ముఖచిత్రాన్ని మార్చేందుకు చేసిన సిగ్గుమాలిన చర్య! జమ్మూకశ్మీర్‌లో, అస్సాంలో బీజేపీ ఇదే పని చేసింది. దాన్నిప్పుడు దేశమంతటా అమలు చేసే పనిలో పడింది. వారికి దమ్ముంటే పాత బిల్లును ఇప్పుడే తేవాలి. దాన్ని ఈ క్షణం నుంచే అమలు చేసేలా విపక్షాలన్నీ మద్దతిస్తాయి’’అని సవాలు చేశారు. 

ఓబీసీలు, దళితులకు చట్టసభల్లో సరైన ప్రాతినిధ్యం కల్పించకుండా వారిని అధికారానికి దూరం చేయడమే బీజేపీ ఉద్దేశమని రాహుల్‌ ఆరోపించారు. అందుకే కులగణనకు ముందే హడావుడిగా బిల్లు తెచ్చిందని ఆక్షేపించారు. ‘‘బీజేపీ నేతలు ఓబీసీలను, దళితులను హిందువులని పిలుస్తారు. కానీ దేశ అధికార నిర్మాణంలో వారికి కనీస స్థానమివ్వరు! కార్పొరేట్‌ రంగంలో, న్యాయవ్యవస్థలో, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో, మీడియాలో దళితులు, ఓబీసీలు ఎక్కడున్నారు?’’అంటూ నిలదీశారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తూ ’మనువాదాన్ని’తీసుకురావాలని చూస్తున్నారని ఆరోపించారు. 

దక్షిణాది, ఈశాన్య ప్రజలకు అండగా కాంగ్రెస్‌ 
దక్షిణాది, ఈశాన్య, చిన్న రాష్ట్రాలకు కాంగ్రెస్‌ అండగా నిలుస్తుందని రాహుల్‌ అన్నారు. ‘‘అక్కడి సోదరసోదరీమణులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. భారత సమాఖ్యలో మీరంతా సమాన భాగస్వాములే. లోక్‌సభలో మీ ప్రాతినిధ్యాన్ని తాకే సాహసం చేయడానికి బీజేపీని అనుమతించబోం’’అని చెప్పారు. ‘‘గతంలో ఇందిరాగాం«దీ, వాజ్‌పేయి వంటి ప్రధానులు కూడా డీలిమిటేషన్‌ సవాలును ఎదుర్కొన్నారు. కానీ దానివల్ల దేశానికి జరిగే ప్రమాదాన్ని గుర్తించి వెనక్కి తగ్గారు’’అని ఆయన గుర్తు చేశారు. 

‘16’లోనే అంతా దాగుంది! 
ప్రసంగం సందర్భంగా దేశ ప్రజలకు రాహుల్‌ గాంధీ ఒక పజిల్‌ ఇచ్చారు. ‘‘నిన్న లోక్‌సభలో ప్రధాని ప్రసంగాన్ని జాగ్రత్తగా గమనించా. ఆయనలో ఉత్సాహమే లేదు. ఎందుకంటే ఈ బిల్లు పాస్‌ కాదని ఆయనకు తెలుసు. అంతలో తేదీ చూసి ఆశ్చర్యపోయా! అది ఏప్రిల్‌ ‘16’. అసలు మర్మమంతా అందులోనే దాగుంది! మీ సమస్యలన్నింటికీ సమాధానం ‘16’లోనే దొరుకుతుంది. అదేమిటో ఎవరికైనా అర్థమైతే ఎక్స్‌లో నాకు మెసేజ్‌ చేయండి’’అంటూ సభికుల్లో ఆసక్తి రేకెత్తించారు. 

మోదీ ఓ మాంత్రికుడు! 
ప్రధాని మోదీపై లోక్‌సభలో రాహుల్‌ వ్యంగ్యాస్త్రాలు  సంధించారు. ఆయనను బాలకోట్, సిందూర్, పెద్ద నోట్ల రద్దు మాంత్రికునిగా అభివర్ణించి సభలో కలకలం రేపారు. ‘‘ఒక బడా వ్యాపారవేత్తతో మోదీ కుమ్మక్కయ్యారు. ఈ మాంత్రికుని చరిత్ర, ప్రధాని అయ్యేదాకా జరిగిన ప్రతి విషయమూ ఆ బడా వ్యాపారవేత్తకు పూర్తిగా తెలుసు. ఆ రహస్యాల సాయంతోనే ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని శాసిస్తున్నారు. అమెరికాతో పలు ఒప్పందాలు కూడా ప్రధానిగా మోదీ రాజీ పడటం వల్లే జరిగాయి’’అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. 

రాహుల్‌ వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చారు. అభ్యంతరకర పదాలు వాడినందుకు ఆయన దేశానికి క్షమాపణ చెప్పాలని మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, కిరణ్‌ రిజిజు డిమాండ్‌ చేశారు. బాలాకోట్, సిందూర్‌ ప్రస్తావనతో సాయుధ దళాలను రాహుల్‌ అవమానించారని దుయ్యబట్టారు. ఆయన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని కోరారు. 

మోదీకి, నాకు భార్య బాదరబందీ లేదు 
లోక్‌సభలో నవ్వులు పూయించిన రాహుల్‌ 
మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణ బిల్లుపై ప్రసంగం సందర్భంగా ప్రధాని మోదీని, తనను ఉద్దేశించి రాహుల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తామిద్దరికీ భార్య తాలూకు బాదరబందీ లేదంటూ సభలో నవ్వులు పూయించారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్‌ రిజిజు చేసిన సరదా వ్యాఖ్యలు ఇందుకు నేపథ్యమయ్యాయి. ‘‘కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రాం మేఘ్వాల్‌ ఆయన భార్యపై అందమైన కవిత అల్లారు. దాంతో నా భార్య తనకోసం నేనలా కవిత చెప్పలేదని నాపై అలిగింది’’అని రిజిజు చెప్పుకొచ్చారు. దీనిపై రాహుల్‌ స్పందిస్తూ, ‘‘జాతి నిర్మాణంలో మహిళలే ప్రధాన చోదక శక్తి. మగవాళ్లను వాళ్లెంతగానో ప్రభావితం చేస్తారు. 

తల్లి, సోదరి, భార్య నుంచి ఎంతో నేర్చుకుంటాం. అయితే ప్రధానికి, నాకు భార్య బాదరబందీ లేదనుకోండీ! కాకపోతే తల్లి, సోదరి ఉన్నారు’’అనడంతో సభికులంతా గొల్లున నవ్వారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాపైనా ఈ సందర్భంగా రాహుల్‌ సరదా వ్యాఖ్యలు చేశారు. ‘‘గురువారం సభలో నా సోదరి ప్రియాంక గొప్పగా ప్రసంగించింది. ఆ క్రమంలో 20 ఏళ్ల రాజకీయ జీవితంలో నేను సాధించలేని దాన్ని తను కేవలం ఐదే నిమిషాల్లో చేసి చూపించింది. అదేమిటో తెలుసా? అమిత్‌ షాను నవ్వించడం!’’అనడంతో సభంతా మరోసారి నవ్వుల్లో మునిగిపోయింది.  

ఏమిటా ‘16 పజిల్‌’? 
లోక్‌సభలో ప్రసంగం సందర్భంగా రాహుల్‌ పేర్కొన్న ‘16 పజిల్‌’ఏమై ఉంటుందా అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. అసలు మర్మమంతా 16 సంఖ్యలోనే దాగుందని, అదేమిటో ఎవరికైనా అర్థమైతే చెప్పాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పలు ఊహాగానాలకు తెర తీశాయి. బహుశా అధికార ఎన్డీఏ కూటమికి చెందిన 16 మంది టీడీపీ లోక్‌సభ సభ్యులు రాజ్యాంగ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేస్తారన్నది ఆయన ఉద్దేశం కావచ్చని కొందరు అభిప్రాయపడ్డారు. 16 సంఖ్య ‘ఎప్‌స్టీన్‌’లా ధ్వనిస్తోందంటూ కాంగ్రెస్‌ పార్టీ తన అధికారిక ఎక్స్‌ ఖాతాలో ఆసక్తికర పోస్టు చేసింది. తద్వారా, ఆ సెక్స్‌ కుంభకోణానికి సంబంధించి విడుదలైన 16 నిమిషాల వీడియో టేప్‌ను ఉద్దేశించి రాహుల్‌ ఆ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని సంకేతమిచ్చింది. 

Advertisement
 
Advertisement
Advertisement