కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ.. రిలీజ్‌పై స్టే | Delhi Liquor Scam Case: Delhi High Court Stay On Kejriwal Trial Court Bail Order | Sakshi
Sakshi News home page

కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ.. రిలీజ్‌పై స్టే

Published Fri, Jun 21 2024 11:11 AM | Last Updated on Fri, Jun 21 2024 1:32 PM

Delhi High Court stay on Krejiwal trial court Bail order

న్యూఢిల్లీ, సాక్షి: న్యూఢిల్లీ, సాక్షి: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఎదురు దెబ్బ తగిలింది. లిక్కర్‌ కేసులో ఆయన రెగ్యులర్‌ బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు  స్టే విధించింది. దీంతో కాసేపట్లో జైలు నుంచి విడుదల కావాల్సిన ఆయన.. బయటకు రాకుండా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.  

లిక్కర్‌ కేసులో ట్రయల్‌ కోర్టు ఆయనకు బెయిల్‌ మంజూరు చేయడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ శుక్రవారం ఉదయం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. అత్యవసరంగా పిటిషన్‌ను విచారించాలని కోరింది. దీంతో పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు.. తాము విచారణ జరిపేంతవరకు కేజ్రీవాల్‌ రిలీజ్‌ను నిలిపివేయాలని ఆదేశాలిచ్చింది. మరికాసేపట్లో ఈ పిటిషన్‌పై వాదనలు జరగనున్నాయి.

లిక్కర్‌ కుంభకోణంలో నగదు అక్రమ చలామణి అభియోగాలను ఎదుర్కొంటున్న అరవింద్‌ కేజ్రీవాల్‌కు నిన్న పెద్ద ఊరట లభించింది. ఢిల్లీ స్పెషల్‌ కోర్టు గురువారం సాయంత్రం ఆయనకు సాధారణ బెయిల్‌ మంజూరు చేసింది. రూ.లక్ష వ్యక్తిగత బాండు సమర్పించిన తర్వాత ఆయన్ని విడుదల చేయవచ్చని న్యాయమూర్తి న్యాయ్‌ బిందు ఆదేశించింది. అలాగే.. తీర్పుపై పైకోర్టులో అప్పీలు దాఖలు చేయడానికి వీలుగా దానిని 48 గంటలపాటు పక్కనపెట్టాలని  ఈడీ చేసిన వినతిని న్యాయమూర్తి తోసిపుచ్చారు.

ఈ క్రమంలో.. విచారణకు ఆటంకం కలిగించరాదని, సాక్షుల్ని ప్రభావితం చేయకూడదని కేజ్రీవాల్‌పై ఆంక్షలు విధించింది ట్రయల్‌ కోర్టు. ఎప్పుడు అవసరమైతే అప్పుడు కోర్టుకు హాజరై విచారణకు సహకరించాలని ఆదేశించింది. అయితే ఈ ఉదయం కేజ్రీవాల్‌ విడుదల నేపథ్యంలో.. నీటి సంక్షోభంపై పోరాటం చేద్దామని ఉత్సాహంతో ఉన్న ఆప్‌ శ్రేణులకు ఆయన రిలీజ్‌పై స్టే ఢిల్లీ హైకోర్టు స్టే విధించడంతో ఒక్కసారిగా ఢీలా పడిపోయింది.

ఈడీ వాదనల్ని పట్టించుకోని కోర్టు
కేసులో సహనిందితులు పొందిన డబ్బుతో కేజ్రీవాల్‌కు సంబంధం ఉందని ఈడీ వాదించింది. 2021 నవంబరు 7న కేజ్రీవాల్‌ గోవాలోని గ్రాండ్‌హయత్‌ హోటల్లో బస చేసినప్పుడు ఆయన తరఫున రూ.లక్ష బిల్లును చెల్లించిన చరణ్‌ప్రీత్‌ సింగ్‌ కూడా సహ నిందితుడేనని తెలిపింది. వేర్వేరు మార్గాల ద్వారా చరణ్‌ప్రీత్‌కు రూ.45 కోట్లు అందినట్లు ఆరోపించింది. కేజ్రీవాల్‌కు ఎన్నిసార్లు సమన్లు ఇచ్చినా ఉద్దేశపూర్వకంగా వాటిని పట్టించుకోలేదని, తొమ్మిదిసార్లు అలా జరిగినా తాము అరెస్టు చేయలేదని తెలిపింది.

ఇక.. సౌత్‌ గ్రూప్‌ నుంచి రూ.100 కోట్లు అందాయని ఆరోపించినా దానికి ఆధారాలు లేవని,  కొందరి వాంగ్మూలాల ఆధారంగానే కేసు నడుస్తోందని కేజ్రీవాల్‌ తరఫు న్యాయవాదులు వాదించారు. అయితే ట్రయల్‌కోర్టు ఆ వాదనల్ని పరిగణనలోకి తీసుకోలేదు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement