
కర్ణాటక రాష్ట్రం: ఇటీవలే నిశ్చితార్థం జరిగింది, త్వరలో పెళ్లయి సంతోషంగా కొత్త జీవితంలోకి అడుగుపెట్టాల్సిన యువతి.. ప్రాణాలు తీసుకుంది. పెళ్లి రద్దు కావడమే దీనికి కారణం. మండ్య జిల్లాలోని కేఆర్‌పేటె తాలూకాలోని కిక్కేరిలో ఈ విషాదం జరిగింది. వివరాలు.. స్థానిక వ్యవసాయ శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగిని కావ్య (28)కు, 15 రోజుల క్రితం హాసన్‌కు చెందిన కరణ్ అనే యువకునితో పెద్దలు నిశి్చతార్థం జరిపించారు.
కరణ్ డిగ్రీ పూర్తి చేసి ఏదో కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు చెప్పాడు. యువతి కుటుంబీకుల పరిశీలనలో ఇది అబద్ధమని తేలింది. దాంతో పనీపాటా లేని వ్యక్తితో పెళ్లి వద్దని కావ్య తండ్రి తేలి్చచెప్పాడు. మరోవైపు పెళ్లి ఖరారైందని స్నేహితులకు, సహోద్యోగులకు చెప్పుకొన్న కావ్య ఈ పరిణామంతో విరక్తి చెందింది, 4వ తేదీన కిక్కేరిలో వ్యవసాయ ఆఫీసులో పురుగుల మందు తాగిపడిపోయింది. సిబ్బంది స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స చేసి బిజీఎస్ ఆస్పత్రికి తరలించగా ఆమె శనివారం కన్నుమూసింది. పెళ్లి వాయిద్యాలు మోగాల్సిన ఇంట విషాదం తాండవించింది.