న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బుధవారం ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఓటు చోరీ ఆరోపణలతో పాటు ‘హెచ్’ ఫైల్స్‌ను బహిర్గతం చేశారు. హర్యానాలో 25,41,144 లక్షల ఓటు చోరీ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. ‘మా దగ్గర ‘హెచ్’ ఫైల్స్ ఉన్నాయి. రాష్ట్రంలో ఓటు చోరీ ఎలా జరిగిందో దానిలో ఉంది. ఇది రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో జరుగుతోందని అనుమానిస్తున్నాం. హర్యానాలోని మా అభ్యర్థులు.. ఏదో తప్పు జరిగిందంటూ ఫిర్యాదులు విరివిగా చేశారని రాహుల్ గాంధీ (Rahul Gandhi) పేర్కొన్నారు.
హర్యానా ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ ఆరోపించిన రాహుల్ .. కాంగ్రెస్ విజయాన్ని బీజేపీ విజయంగా మార్చేందుకు ఒక ప్రణాళికను అమలు చేశారని ఆరోపించారు. హర్యానాలో 25 లక్షల ఓట్లు చోరీ అయ్యాయని, ఇందులో 5.21 లక్షల నకిలీ ఓటర్లు, 93,174 చెల్లని ఓటర్లు, 19.26 లక్షల బల్క్ ఓటర్లు ఉన్నారని రాహుల్ పేర్కొన్నారు. తాను చెబుతున్న దానికి 100 శాతం రుజువు ఉందని, వారు కాంగ్రెస్ విజయాన్ని ఓటమిగా మార్చడానికి వ్యవస్థాగత తారుమారుకు పాల్పడ్డారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
హర్యానాలో రెండు కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 25 లక్షల మంది నకిలీ ఓటర్లు అని విలేకరుల సమావేశంలో రాహుల్ తెలిపారు. తన బృందం 5.21 లక్షల నకిలీ ఓటరు నమోదులను బయటపెట్టిందని, హర్యానాలో ప్రతి ఎనిమిది మంది ఓటర్లలో ఒకరు నకిలీవారున్నారు. ఓటరు జాబితాలో వ్యత్యాసాలను చూపించే స్లయిడ్‌లను రాహుల్ ప్రదర్శించారు. ఓటు చోరీ కోసం బ్రెజిలియన్ మోడల్ వాడారని ఆరోపించారు. ప్రజాస్వామ్య ప్రక్రియను అణిచివేసేందుకు బీజేపీ ప్రణాళికాబద్ధమైన ఆపరేషన్‌ను నిర్వహిస్తోందని రాహుల్ ఆరోపించారు.
అన్ని ఎగ్జిట్ పోల్స్ హర్యానాలో కాంగ్రెస్ విజయాన్ని సూచించాయని గుర్తుచేశారు. హర్యానా చరిత్రలో తొలిసారిగా, పోస్టల్ బ్యాలెట్లు వాస్తవ ఓట్లతో సరిపోలలేదని, ఇది ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదని, కాంగ్రెస్ అఖండ విజయాన్ని ఓటమిగా మార్చడానికి ఒక ప్రణాళికను అమలు చేశారని రాహుల్ ఆరోపించారు. అయితే ఎన్నికల కమిషన్ వర్గాలు రాహుల్ గాంధీ వాదనలను తోసిపుచ్చాయి. రాష్ట్ర ఓటర్ల జాబితాకు వ్యతిరేకంగా “సున్నా అప్పీళ్లు” దాఖలు అయ్యాయన్నారు.
ఇది కూడా చదవండి: నెహ్రూను గుర్తు చేసుకున్న మమ్దానీ


