40 ఏళ్ల క్రితం 100కుపైగా స్థానాలు గెలుపు
ఇప్పుడు అత్యంత అధ్వాన స్థితికి చేరుకున్న దిగ్గజ పార్టీ
న్యూఢిల్లీ: సరిగ్గా 40 ఏళ్ల క్రితం బిహార్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 100కుపైగా స్థానాల్లో విజయపతాక ఎగరేసింది. శుక్రవారం వెలువడిన ఎన్నికల్లో కేవలం ఆరు చోట్ల గెలిచింది. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ భవిష్యత్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. 1952 ఎన్నికల్లో 41.38 శాతం ఓట్లను ఒడిసిపట్టిన కాంగ్రెస్ ప్రభ 1990వ దశకం నుంచి తగ్గుతూ వస్తోంది. ఈసారి 50కిపైగా స్థానాల్లో పోటీచేసిన కాంగ్రెస్.. అసదుద్దీన్ ఒవైసీ సారథ్యంలోని ఏఐఎంఐఎం, జితన్ రామ్ మాంఝీ సారథ్యంలోని హిందుస్తానీ అవామ్ మోర్చా(హెచ్‌ఏఎం)ల స్థాయికి పడిపోయింది. ఎంఐఎం, హెచ్‌ఏఎంలు చెరో 5 చోట్ల గెలిచాయి.
15 ఏళ్ల క్రితంతో పోలిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ ఓటు షేరు కాస్తంత పెరిగింది. 2010లో పోలైన ఓట్లలో కాంగ్రెస్‌కు 8.17 శాతం ఓట్లు పడితే ఈసారి కాస్తంత ఎక్కువగా 8.75 శాతం ఓట్లు పడ్డాయి. తిరుగుబాటు నేతలను దారి తెచ్చుకోవడం, కీలక నేతల మధ్య సమన్వయం పెంచడం, ఓడిన స్థానాల్లో తిరిగి పట్టుసాధించి విజయం సాధించే క్రమంలో కాంగ్రెస్ ఘోరంగా విఫలమవుతోంది. 1985లో వందకుపైగా సీట్లు గెలిచిన పార్టీ తర్వాత 1990లో కేవలం 71 స్థానాలకు పరిమితమైంది. అప్పటి నుంచి గెలుపు కోత మొదలైంది. 1995లో 29 చోట్ల, 2000లో 23 చోట్ల గెలిచింది. ఇక 2005లో పదంటే పది చోట్ల విజయం సాధించింది.
శుక్రవారం ఫలితాలను చూస్తే హెచ్‌ఏఎం(సెక్యులర్) నేత చేతిలో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేశ్‌కుమార్ సైతం ఓడిపోయారు. ‘కుటుంబ’నియోజకవర్గంలో హెచ్‌ఏఎం అభ్యర్థి లలన్‌రామ్ .. రాజేశ్ కంటే 21,525 ఓట్లు ఎక్కువ సాధించారు. రాహుల్‌గాంధీ తలకెత్తుకున్న ఓటు చోరీ నినాదం బిహార్‌లో ఏమాత్రం పనిచేయలేదు. రాహల్ చేసిన ఓటర్ అధికార్ యాత్ర, ఓటర్లజాబితా సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్)పై విమర్శలు, ప్రజాస్వామ్యాన్ని జెన్ జెడ్ యువతరం కాపాడాలన్న పిలుపులకు ఓటర్ల నుంచి ఎలాంటి స్పందనాలేదు.
గతంతో పోలిస్తే బిహార్‌లో మౌలికవసతుల అభివృద్ధి వేగంగా జరగడంతో ఓటర్లు ఎన్‌డీఏ వైపు మొగ్గుచూపడంతో కాంగ్రెస్ ఓటమి రూపంలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. కొన్ని చోట్ల ఆర్జేడీ, కాంగ్రెస్ ఉమ్మడి అభ్యరి్థని నిలపలేకపోవడం, ఉన్న కొన్ని ఓట్లను కొత్తగా వచ్చిన జనసురాజ్ పార్టీ చీల్చడంతో మరికొన్ని స్థానాలు కాంగ్రెస్ చేతుల్లోంచి జారిపోయాయి. ఇప్పటికైనా కాంగ్రెస్ అధిష్టానం విప్లవాత్మకంగా సంస్థాగత సంస్కరణలకు తెగించకపోతే అధికారాలను కోల్పోయే పరంపర కొనసాగుతుందని రాజకీయ పండితులు విశ్లేíÙంచారు.


