కాంగ్రెస్‌ మనస్తత్వంతోనే ఈశాన్యానికి హాని: ప్రధాని మోదీ | Congress Mindset Caused Significant Harm to Arunachal PM Modi | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ మనస్తత్వంతోనే ఈశాన్యానికి హాని: ప్రధాని మోదీ

Sep 22 2025 1:01 PM | Updated on Sep 22 2025 1:18 PM

Congress Mindset Caused Significant Harm to Arunachal PM Modi

ఇటానగర్: ‘సూర్యకిరణాలు ముందుగా పడే ప్రదేశం అరుణాచల్ ప్రదేశ్ అయినప్పటికీ, వేగవంతమైన అభివృద్ధి కిరణాలు ఇక్కడికి చేరుకోవడానికి చాలా దశాబ్దాలు పట్టింది. ఆ సమయంలో ఢిల్లీ నుంచి దేశాన్ని నడిపిన వారు అరుణాచల్‌ అభివృద్ధిని విస్మరించారు. కాంగ్రెస్ లాంటి పార్టీలు.. ఇక్కడ కేవలం రెండు లోక్‌సభ సీట్లు మాత్రమే ఉన్నాయని..అలాంటప్పుడు అరుణాచల్‌పై ఎందుకు దృష్టి పెట్టాలి? అని భావించాయని ప్రధాని ఆరోపించారు. కాంగ్రెస్  మనస్తత్వం కారణంగానే అరుణాచల్‌తో పాటు ఈశాన్య ప్రాంతాలకు తీవ్రమైన హాని జరిగిందన్నారు. సోమవారం ఇటానగర్‌లో జరిగిన ర్యాలీలో ప్రధాని ప్రసంగించారు.  

‘2014లో నాకు దేశానికి సేవ చేసే అవకాశం కలిగినప్పుడు, దేశాన్ని కాంగ్రెస్ మనస్తత్వం నుండి విముక్తి చేయాలని నిర్ణయించుకున్నాను. మా మార్గదర్శక సూత్రం.. ఏ రాష్ట్రంలోనైనా ఓట్ల సంఖ్య లేదా సీట్ల సంఖ్య కాదు.. ‘తొలుత దేశం’. మా ఏకైక మంత్రం నాగరిక్‌ దేవో భవ (పౌరుడే దేవుడు). కాంగ్రెస్ పాలనలో నిర్లక్ష్యానికి గురైన అరుణాచల్ ప్రదేశ్ 2014 నుండి తమ పాలనలో అభివృద్ధి  ప్రాధాన్యతా కేంద్రంగా మారింది’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కాగా అరుణాచల్ ప్రదేశ్‌లో రూ. 5,125.37 కోట్ల విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించారు.
 

ఇటానగర్‌లోని ఇందిరా గాంధీ పార్క్‌లో జరిగిన కార్యక్రమంలో రెండు ప్రధాన జలవిద్యుత్ ప్రాజెక్టులకు, తవాంగ్‌లోని ఒక కన్వెన్షన్ సెంటర్‌కు ప్రధాని మోదీ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. యార్జెప్ నదిపై అభివృద్ధి చేయనున్న ఈ ప్రాజెక్టులు.. అరుణాచల్ ప్రదేశ్ జలవిద్యుత్ సామర్థ్యాన్ని పెంపొందించనున్నాయని, ప్రాంతీయ ఇంధన భద్రతకు గణనీయంగా దోహదపడనున్నాయని సంబంధిత అధికారులు తెలిపారు. కనెక్టివిటీ, ఆరోగ్యం, అగ్నిమాపక భద్రతతో సహా వివిధ రంగాలకు సంబంధించిన రూ. 1,290 కోట్లకు పైగా విలువైన అనేక ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను  ప్రధాని ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో గవర్నర్ కేటీ పర్నాయక్, ముఖ్యమంత్రి పెమా ఖండు, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు తదితరులు పాల్గొన్నారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement