
సేవల్లో వైఫల్యంపై పెరుగుతున్న కంప్లెయింట్లు
సామాజిక మాధ్యమాల్లోనూ కస్టమర్ల ఏకరువు
అంబుడ్స్‌మన్ కూవెల్లువెత్తుతున్న విన్నపాలు
భారతీయ బ్యాంకులకు కస్టమర్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఫిర్యాదులు అందుకోవడంలోనూ ముందుంది. ఈ విషయంలో ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో యాక్సిస్ బ్యాంక్ మొదటి స్థానంలో నిలిచింది. సేవల విషయంలో కొన్ని బ్యాంకులు స్వల్ప మెరుగుదలను చూపించినప్పటికీ మొత్తం ఫిర్యాదుల సంఖ్య గణనీయంగా ఉంది. ఖాతాదారుల తమ సమస్యలను నివేదించేందుకు బ్యాంకులు అందుబాటులోకి తెచ్చిన వేదికలపైనే కాదు.. సేవల్లో విఫలమైతే సామాజిక మాధ్యమాల్లోనూ బ్యాంకులను ఎండగట్టేందుకు వెనకాడటం లేదు.
డిజిటల్ ఎకానమీ మారుమూల పల్లెలకూ విస్తరిస్తుండడంతో బ్యాంకింగ్ సామాన్యులకూ చేరువైంది. బ్యాంకింగ్ విస్తృతితోపాటు అదే స్థాయిలో కస్టమర్లు సమస్యలనూ ఎదుర్కొంటున్నారు దీంతో బ్యాంకులకు అందుతున్న ఫిర్యాదులూ పెరుగుతున్నాయి. 2024–25 సంవత్సరానికిగాను బ్యాంకుల బిజినెస్ రెస్పాన్సిబిలిటీ, సస్టేనబిలిటీ రిపోర్ట్స్ (బీఆర్‌ఎస్‌ఆర్) ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. – సాక్షి, స్పెషల్ డెస్క్
ఎస్‌బీఐలో 29.8 లక్షలు
అనధికారిక ఎలక్ట్రానిక్ డెబిట్ లావాదేవీలకు సంబంధించి వినియోగదారుల నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 6.87 లక్షలకు పైగా ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో మార్చి చివరి నాటికి 1.05 లక్షలు పెండింగ్‌లో ఉన్నాయి. ఖాతాదారుడి అనుమతి లేకుండా మోసపూరితంగా బ్యాంక్ ఖాతా, డెబిట్/క్రెడిట్ కార్డు నుండి డబ్బు తీసుకోవడం, ఆన్ లైన్ కొనుగోళ్లు, ఇతర అనుమానాస్పద కార్యకలాపాలను అనధికార ఎలక్ట్రానిక్ డెబిట్ లావాదేవీలుగా పరిగణిస్తారు.
ఇక రుణాల మంజూరుతో సహా ముఖ్యమైన సేవలను అందించడంలో జాప్యంపై 12,502; సైబర్ భద్రత, ముఖ్యమైన సేవల పంపిణీ మినహా ఇతర ఫిర్యాదుల విభాగం కింద 21.50 లక్షల కంప్లెయింట్లను బ్యాంకు అందుకుంది. అంత క్రితం ఏడాదిలో ‘ఇతర’ విభాగం కింద బ్యాంకుకి 24.02 లక్షల ఫిర్యాదులు వచ్చాయి. మొత్తంగా అన్ని విభాగాల్లో కలిపి 29.8 లక్షల కంప్లెయింట్లు వస్తే పెండింగులో 1.2 లక్షలు ఉన్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకుకి 11.39 లక్షలు, బ్యాంక్ ఆఫ్ బరోడాకు 5.34 లక్షల ఫిర్యాదులు వచ్చాయి.
ప్రైవేటు బ్యాంకుల్లోనూ..
2024–25లో యాక్సిస్ బ్యాంకు 5.90 లక్షల ఫిర్యాదులను అందుకుంది. వీటిలో మార్చి చివరి నాటికి 11,143 పెండింగ్‌లో ఉన్నాయి. ‘ఇతర’ విభాగంలో 76,111, ప్రకటనలకు సంబంధించి 12,744, అన్యాయమైన వాణిజ్య పద్ధతులను అవలంబించిందన్న ఆరోపణలపై 4,438 కంప్లెయింట్లు అందాయి.
» ఐసీఐసీఐ బ్యాంకుకి మొత్తం 5.34 లక్షల కంప్లెయింట్లు వచ్చాయి. వీటిలో మార్చి చివరి నాటికి 45,151 పరిష్కారానికి నోచుకోవాల్సి ఉంది. అంత క్రితం ఏడాది 3.46 లక్షల ఫిర్యాదులు వచ్చాయి. అన్ని మార్గాలలో కస్టమర్ ఫిర్యాదులను స్వీకరించే విధానం మెరుగుపడిందని, ఫలితంగా సంఖ్య పెరిగిందని బ్యాంకు తెలిపింది.
» హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు 4.57 లక్షల ఫిర్యాదులను స్వీకరించింది. వీటిలో 16,306 పెండింగ్‌లో ఉన్నాయి. ఏడాది క్రితం 4.85 లక్షల కంప్లెయింట్లు వచ్చాయి.
అంబుడ్స్‌మన్కూ..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు (ఆర్‌బీఐ) చెందిన అంబుడ్స్‌మన్ కార్యాలయాలకు 2024–25లో వివిధ బ్యాంకుల ఖాతాదారుల నుంచి 2.96 లక్షల ఫిర్యాదులు వచ్చాయి. అంత క్రితం ఆర్థిక సంవత్సరంలో వీటి సంఖ్య 2.93 లక్షలు. రుణాలు, అడ్వాన్సులు, డిజిటల్ బ్యాంకింగ్ ఉత్పత్తులకు సంబంధించిన కస్టమర్లు లేవనెత్తిన సాధారణ సమస్యలు వీటిలో ప్రధానంగా ఉన్నాయి. ఈ కంప్లెయింట్లలో ఎక్కువ భాగం బ్యాంకులపైనే ఉన్నాయి. ఆ తరువాతి స్థానంలో బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్‌సీలు), నాన్–బ్యాంక్ సిస్టమ్ పార్టిసిపెంట్స్, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలు ఉన్నాయి.
సోషల్ మీడియాలో చురుగ్గా..
సామాజిక మధ్యమాల్లో కస్టమర్ ఫిర్యాదులు, ప్రశ్నలకు పరిష్కారం, స్పందించడంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అత్యంత చురుగ్గా ఉన్నాయని సోషల్ మీడియా రిసెర్చ్ సంస్థ ‘సింప్లిఫై360’ ఇటీవలి నివేదిక వెల్లడించింది. జూన్ 13–28 మధ్య తొమ్మిది ప్రముఖ బ్యాంకుల సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది.
» ఫేస్‌బుక్‌లో రోజుకు 3 పోస్టులతో ఎస్‌బీఐ అత్యంత చురుకైన బ్యాంకుగా నిలిచిందని ఈ నివేదిక వివరించింది.
» ఫేస్‌బుక్, ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 45 శాతం, ఎస్‌బీఐ 41 శాతం ప్రశ్నలకు సమాధానం ఇచ్చాయి.
» యాక్సిస్, ఐసీఐసీఐ, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ 80 శాతం ప్రశ్నలను పరిష్కరించడంలో విఫలమయ్యాయి.
» ఫేస్‌బుక్‌లో ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకులు ఉత్తమ ప్రదర్శన కనబరిచాయి. కానీ ఇవి ఎక్స్‌లో పెద్దగా రాణించలేదు.
» హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఎక్స్‌లో చాలా చురుకుగా ఉన్నప్పటికీ బ్యాంక్ తన ప్రయత్నాలకు పెద్దగా గుర్తింపు పొందలేదని నివేదిక వివరించింది.