ప్రెస్‌మీట్‌లో పగలబడి నవ్విన పోలీస్‌ అధికారిని ఎవరంటే? | Coimbatore Girl Tragedy: Press Meet Sparks Public Outrage | Sakshi
Sakshi News home page

ప్రెస్‌మీట్‌లో పగలబడి నవ్విన పోలీస్‌ అధికారిని ఎవరంటే?

May 25 2026 5:56 PM | Updated on May 25 2026 7:03 PM

Coimbatore Girl Tragedy: Press Meet Sparks Public Outrage

సాక్షి,చెన్నై: కోయంబత్తూర్ జిల్లాలో 10 ఏళ్ల బాలికపై జరిగిన అమానుష ఘటన రాష్ట్రాన్ని కలచివేసింది. బాలికను అపహరించి దారుణంగా హత్య చేసిన ఈ సంఘటనపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్ట్ చేశారు.

ఈ ఘటనపై ముఖ్యమంత్రి విజయ్ వెంటనే స్పందించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, ఘోరమైన నేరాలకు పాల్పడిన వారిపై తక్షణమే కేసులు నమోదు చేసి, ఫాస్ట్-ట్రాక్ కోర్టులో విచారణ జరిపి కఠిన శిక్షలు విధించాలని ఆయన అధికారులను ఆదేశించారు. మహిళలు, పిల్లల భద్రతపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు.

అయితే కేసు పురోగతిని వివరించేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెస్ట్‌ జోన్‌ ఐజీ ఆర్వీ రమ్యా భారతి, డీఐజీ సమీనాథన్, ఎస్పీ పవన్ కుమార్ రెడ్డి నవ్వుతూ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన నేపథ్యంలో అధికారులు ఇలా వ్యవహరించడం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మహిళా ఐజీ రమ్యా భారతి నవ్వుతూ గోళ్లు గిల్లుకోవడం మరింత వివాదాస్పదంగా మారింది.

 

 

ఈ వ్యవహారం సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీసింది. ‘ఒక కుటుంబం కన్నీటిలో మునిగిపోయి ఉంటే, బాధ్యతాయుత పదవుల్లో ఉన్న అధికారులు నవ్వుతూ కనిపించడం మానవత్వానికి విరుద్ధం’ అంటూ నెటిజన్లు మండిపడ్డారు. రాష్ట్ర మహిళా మంత్రులు ఎస్‌.కీర్తన, కే.జగదీశ్వరి కూడా నవ్వుతూ మాట్లాడినందుకు విమర్శలు ఎదుర్కొన్నారు.బాధిత బాలిక తల్లి కూడా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ‘నా బిడ్డను కడసారి చూడనీయలేదు, పోస్టుమార్టం తర్వాత కూడా చూపించలేదు’అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం,ఈ కేసు విచారణ కొనసాగుతుండగా ప్రెస్‌మీట్‌లో నవ్వుతూ కనిపించిన ముగ్గురు పోలీసు ఉన్నతాధికారులపై తమిళనాడు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

కోయంబత్తూర్ చిన్నారి హత్య కేసులో ఇద్దరు నిందితులు కార్తిక్ (33), మోహన్ (30) అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం వారు కోర్టు ఆదేశాల ప్రకారం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. కార్తిక్ గాయాల కారణంగా కోయంబత్తూర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు, మోహన్ జైల్లో రిమాండ్‌లో ఉన్నాడు.

ప్రధాన నిందితుడు కార్తిక్ బాధిత కుటుంబానికి పరిచయం ఉన్న వ్యక్తి. బాలికను లాక్కెళ్లి లైంగిక దాడి చేసి హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. అరెస్ట్ సమయంలో పారిపోవడానికి ప్రయత్నించి భవనం నుంచి దూకడంతో చేతి, కాలి ఎముకలు విరిగాయి. ప్రస్తుతం కోయంబత్తూర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. మోహన్.. కార్తిక్‌కు సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. అతన్ని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపించారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement