హాజీపూర్: బీహార్ రాజకీయ దిగ్గజం, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల వేళ బీహార్ మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ ఈ విధంగా వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. కొద్ది నెలల క్రితమే పార్టీ నుంచి బహిష్కృతుడైన తేజ్ ప్రతాప్ పలు అంశాలలో వివాస్పదునిగా వార్తల్లో కనిపిస్తున్నారు.
జనశక్తి జనతా దళ్ పార్టీని స్థాపించి, మహువా అసెంబ్లీ నియోజకవర్గం నుండి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగిన తేజ్ ప్రతాప్ యాదవ్ తన తమ్ముడు తేజస్విపై కూడా సంచలన ఆరోపణలు చేశారు. ఇండియా కూటమి సీఎం అభ్యర్థిగా తేజస్విని ప్రకటించడాన్ని ఆయన తప్పుబట్టారు. అధికార పీఠాన్ని దక్కించుకునేందుకు ప్రజల ఆశీర్వాదం అవసరం అని తేజ్ ప్రతాప్ పేర్కొన్నారు. ‘ఆర్జేడీ పార్టీలోకి తిరిగి వెళ్లేకంటే చావడమే నయం. నాకు అధికార దాహం లేదు. మానవీయ సూత్రాలు, ఆత్మగౌరవం అత్యున్నతమైనవి’ అని తేజ్ ప్రతాప్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
ప్రజల కోసం పనిచేయడమే తనకు సంబంధించిన పెద్ద విషయం అని, నిజాయితీగా అదే పని చేస్తానని, అప్పుడే ప్రజలు తనను ప్రేమిస్తారు.. నమ్ముతారని తేజ్ ప్రతాప్ పేర్కొన్నారు. ఆయన 2015లో ఎన్నికల అరంగేట్రం చేసిన మహువా స్థానాన్ని తిరిగి దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తాను రాజకీయాల్లోకి రావడానికి ముందు నుండే ఈ నియోజకవర్గంతో అనుబంధం కలిగి ఉన్నానని తేజ్ ప్రతాప్ పేర్కొన్నారు. తన తమ్మునికి నమ్మకస్థుడైన సిట్టింగ్ ఆర్జేడీ శాసనసభ్యుడు ముఖేష్ రౌషన్‌ను తాను పోటీదారుగా భావించడం లేదన్నారు.
తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్నారా? అని మీడియా అడిగినప్పుడు ఆయన మాట్లాడుతూ తాము చాలా కాలంగా మాట్లాడుకోవడం లేదని, కానీ వారి ఆశీర్వాదాలు ఉంటాయని నమ్ముతున్నానని అన్నారు.ఇండియా కూటమి సీఎం అభ్యర్థిగా తేజస్విని ఎంపిక చేయడం తనకు నచ్చలేదన్నారు. పలు రకాల ప్రకటనలు చేయడం రాజకీయ నాయకుల లక్షణమని, కానీ ప్రజల ఆశీస్సులు పొందిన వ్యక్తి మాత్రమే అధికారాన్ని చేజిక్కించకుంటాడని తేజ్ ప్రతాప్ అన్నారు.


