PIL: ప్రజా ప్రయోజన వ్యాజ్యం అనే కాన్సెప్ట్‌ తొలగిస్తే.. | Centre Says Time To Remove PIL As A Concept, Then SC Says This | Sakshi
Sakshi News home page

PIL: ప్రజా ప్రయోజన వ్యాజ్యం అనే కాన్సెప్ట్‌ తొలగిస్తే..

Apr 9 2026 6:52 AM | Updated on Apr 9 2026 9:09 AM

Centre Says Time To Remove PIL As A Concept, Then SC Says This

ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) అనే కాన్సెప్ట్‌ను తొలగించాల్సిన సమయం వచ్చిందంటూ సుప్రీం కోర్టు వద్ద కేంద్ర ప్రభుత్వం ప్రస్తావించింది. శబరిమల కేసు సమీక్ష పిటిషన్ల సందర్భంగా ఇది చోటు చేసుకుంది. అయితే సుప్రీం కోర్టు మాత్రం తొందరపాటు నిర్ణయం మంచిది కాదన్న రీతిలో వ్యాఖ్య చేసింది. 

పిల్‌(Public Interest Litigation) తరచుగా వ్యక్తిగత ప్రయోజనాల కోసం దుర్వినియోగం అవుతున్నాయన్నది కేంద్రం వాదన. బుధవారం శబరిమల కేసు విచారణ సందర్భంగా సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ.. పిల్‌లు ఇప్పుడు తమ అసలు ఉద్దేశ్యాన్ని కోల్పోయాయి అన్నారు. నేటి పరిస్థితుల్లో న్యాయ సహాయం, లీగల్ ఎయిడ్, కోర్టులకు సులభమైన ప్రాప్యత పెరిగినందున పిల్‌ అవసరం తగ్గిందని కేంద్రం అభిప్రాయపడుతోందని తెలిపారాయన. అయితే.. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం మాత్రం ప్రజా ప్రయోజన వ్యాజ్యల విషయంలో తాము జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాం అని స్పష్టం చేసింది. 

చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ స్పందిస్తూ.. కోర్టులు పిల్‌ను స్వీకరించడంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి అన్నారు. అవి దాఖలు చేసే సమయంలో కఠినమైన ప్రమాణాలు అమలు చేస్తున్నాం. ప్రతి పిటిషన్‌ను పరిశీలించి మాత్రమే స్వీకరిస్తున్నాం అని సాలిసిటర్‌ జనరల్‌కు గుర్తు చేశారు. అలాగే.. శబరిమల కేసులో భక్తులు కాని వ్యక్తులు వేసిన పిటిషన్లు ఎందుకు స్వీకరించబడ్డాయి? అనే ప్రశ్న కూడా ఆయన లేవనెత్తారు.

అసలు పిల్‌ అంటే..
పిల్‌ అనేది 1980లలో భారత న్యాయవ్యవస్థలో ప్రవేశపెట్టబడిన ఒక ప్రత్యేక పద్ధతి. దీని ఉద్దేశ్యం పేదలు, అక్షరాస్యులు, శారీరక వైకల్యం ఉన్నవారు, సామాజికంగా వెనుకబడినవారు న్యాయస్థానాలకు చేరుకోలేని పరిస్థితుల్లో వారి తరఫున ఇతరులు పిటిషన్ వేసే అవకాశం కల్పించడం. తద్వారా సామాజిక న్యాయం, పర్యావరణ పరిరక్షణ, మానవ హక్కులు వంటి అంశాలు కోర్టు దృష్టికి వస్తున్నాయి.

ప్రస్తుత పరిస్థితి
గతంలో సామాజిక మార్పు సాధనంగా పిల్‌ ఉపయోగపడినప్పటికీ.. ఇప్పుడు అవి అధిక సంఖ్యలో దాఖలు అవుతున్నాయి. తద్వారా కోర్టు సమయాన్ని వృథా చేస్తున్నాయి అనే విమర్శలు ఉన్నాయి. అందుకే కేంద్రం తొలగింపు కోరుకుంటోంది. అయితే.. సామాజిక న్యాయం కోసం PILలు ఇంకా అవసరమే అని న్యాయవేత్తలు, పౌరసమాజం భావిస్తోంది. కాబట్టే.. కేంద్రం PILలను తొలగించాలని కోరుకుంటున్నప్పటికీ.. సుప్రీం కోర్టు వాటిని జాగ్రత్తగా పరిశీలిస్తూ కొనసాగిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement