మోదీపై డాక్యుమెంటరీ..కేంద్రం దెబ్బకు ఆ లింకులన్నీ బ్లాక్‌

Centre Blocks Sharing Links BBC Documentary On PM Modi - Sakshi

ఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీని విమర్శిస్తూ.. బీబీసీ తీసిన డాక్యుమెంటరీలను షేర్‌ చేసే పలు యూట్యూబ్‌ వీడియోలను, ట్విటర్‌లోని ట్వీట్లను బ్లాక్‌ చేసినట్లు కేంద్ర సమాచార ప్రసార మత్రిత్వ శాఖ పేర్కొంది. అలాగే సంబంధిత యూట్యూబ్‌ వీడియోలు కలిగి ఉన్న 50కి పైగా ట్వీట్‌లను బ్లాక్‌ చేయాలని ట్విట్టర్‌ని కేంద్రం ఆదేశించింది.

ఐటీ నిబంధనల ప్రకారం.. విశేషాధికారాలను ఉపయోగించి సమాచార ప్రసార కార్యదర్శి ఈ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఐతే యూట్యూబ్‌, ట్విట్టర్‌ రెండూ ప్రభుత్వ ఆదేశాలకు కట్టుబడి ఉన్నట్లు ప్రసార మంత్రిత్వ శాఖ పేర్కొంది. బీబీసీ భారత్‌లోకి డాక్యుమెంటెరీని అందుబాటులోకి తీసుకురానప్పటికీ కొన్ని యూట్యూబ్‌ ఛానెల్‌లు భారత్‌ వ్యతిరేక ఎజెండాను ప్రచారం చేయడానికి అప్‌లోడ్‌ చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది.  అలాగే మళ్లీ తన ఫ్లాట్‌ఫామ్‌లో ఈ వీడియోలను అప్‌లోడ్‌ చేస్తే బ్లాక్‌ చేయమని యూట్యూబ్‌కు సూచించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అంతేగాదు ఇతర ఫ్లాట్‌ఫామ్‌లలో ఈ వీడియో లింక్‌ను కలిగి ఉన్న ట్వీట్‌లను కూడా గుర్తించి బ్లాక్‌ చేయమని అదేశించినట్లు పేర్కొన్నాయి.

వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన ఉన్నత ప్రభుత్వాధికారులు ఈ డాక్యుమెంటరీని పరిశీలించి.. దేశ ప్రతిష్టను దెబ్బ తీసేలా, భారత సుప్రీం కోర్టు అధికారం విశ్వసనీయతపై దుష్ప్రచారం చేసేలా, పైగా.. వివిధ భారతీయ వర్గాల మధ్య విభేదాలను కలిగించేలా ఉన్నట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. బీబీసీ డాక్యుమెంటరీపై కేంద్రం ఫైర్‌ అయ్యింది. ఈ డాక్యుమెంటరీ భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను దెబ్బతీసే విధంగా ఉందని, ప్రధాని మోదీ వ్యక్తిత్వాన్ని కించపరిచేదిగా ఉందని, విదేశాలతో భారత్‌కు ఉన్న స్నేహపూర్వక సంబంధాలను దెబ్బతీసేలా ఉందని కేద్రం అభిప్రాయపడింది. ఇంతకు ముందు బీబీసీ నరేంద్ర మోదీపై చేసిన వివాదాస్పద డాక్యుమెంటరీని విదేశాంగ మంత్రిత్వశాఖ తీవ్రంగా ఖండించింది.

ఇదిలా ఉండగా, యూకే నేషనల్ బ్రాడ్‌కాస్టర్ బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న ప్రధాని మోదీ గురించి వ్యతిరేకంగా రెండు భాగాల సిరీస్‌ను ప్రసారం చేసింది. ఈ డాక్యుమెంటరీపై దుమారం రేగడంతో.. ఎపిసోడ్‌ లింక్‌లను తొలగించమని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. 

చదవండి: మోదీపై డాక్యుమెంటరీలో ఏముంది? రిషి సునాక్‌ ఎలా రియాక్ట్‌ అయ్యారు?

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top