మోదీపై డాక్యుమెంటరీ దుమారం! బ్రిటన్‌ పార్లమెంట్‌లో నోరు మూయించిన ప్రధాని రిషి సునాక్‌

Britain PM Rishi Sunak Reacts BBC Documentary On PM Modi - Sakshi

న్యూఢిల్లీ/లండన్‌: భారత ప్రధాని నరేంద్ర మోదీపై.. ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ తీసిన ఓ డాక్యుమెంటరీ పెను దుమారాన్ని రేపుతోంది. ‘ఇండియా ది మోదీ క్వశ్చన్‌’ పేరుతో రెండు పార్ట్‌ల సిరీస్‌గా డాక్యుమెంటరినీ రూపొందించింది బీబీసీ. అయితే ఈ సిరీస్‌పై భారత ప్రభుత్వం, మరోవైపు ప్రవాస భారతీయులు తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. 

డాక్యుమెంటరీ.. దానిని రూపొందించిన ఏజెన్సీకి ప్రతిబింబంగా ఉంది. అపఖ్యాతి పాలుజేసేందుకు ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రచార భాగం అని మేము భావిస్తున్నామని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ వెల్లడించారు. పక్షపాతం, నిష్పాక్షికత లేకపోవడం,  వలసవాద మనస్తత్వం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అలాంటి చేష్టలను గౌరవించలేం అని బాగ్చీ పేర్కొన్నారు.  ఈ సిరీస్‌ను ప్రసారం చేయడంలో ఎజెండా ఏమిటని బీబీసీని నిలదీశారు.

బ్రిటిష్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌ బీబీసీ (BBC) మోదీపై రెండు భాగాలుగా ఓ డాక్యుమెంటరీని ప్రసారం చేసింది. 2002 అలర్లకు సంబంధించిన మోదీ పాత్ర అంటూ డాక్యుమెంటరీలో హైలైట్‌ చేసింది బీబీసీ. ఆ టైంలో మోదీ ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారని చెప్తూ విమర్శలు గుప్పించింది. మోదీ, భారతదేశంలోని ముస్లిం మైనారిటీల మధ్య ఉద్రిక్తతలను పరిశీలించడం, వెయ్యి మంది వరకు మరణించిన గుజరాత్ 2002 అల్లర్లలో ప్రధాని మోదీ పాత్ర గురించి వాదనలను పరిశీలించడం లాంటి ఉద్దేశాలను ప్రముఖంగా చూపించడంతో.. దుమారం మొదలైంది.

భారత సంతతి మండిపాటు
అపఖ్యాతిపాలు చేసే కథనాన్ని ప్రచారం చేయడం కోసమే ఈ విశ్వసనీయత లేని డాక్యుమెంటరీని ప్రసారం చేశారని బీబీసీని భారత ప్రభుత్వం దుయ్యబట్టింది. బ్రిటన్‌లోని అంతర్గత నివేదిక ఆధారంగా రూపొందించిన ఈ డాక్యుమెంటరీలో వలసవాద మనస్తత్వం, ఆలోచనా ధోరణి కనిపిస్తోందని పేర్కొంది. మరోవైపు భారతీయ మూలాలుగల బ్రిటన్ పౌరులు ఈ డాక్యుమెంటరీని తీవ్రంగా ఖండించారు. లార్డ్ రమి రేంజర్ మాట్లాడుతూ, 100 కోట్ల మందికిపైగా గల భారతీయుల మనోభావాలను బీబీసీ తీవ్రంగా గాయపరిచిందన్నారు. వలసవాద ఆలోచనా ధోరణిని ప్రతిబింబించే డాక్యుమెంటరీ అంటూ బీజేపీ శ్రేణులు సైతం మండిపడుతున్నాయి. 

రిషి సునాక్‌ స్పందన
మోదీపై బీబీసీ తీసిన డాక్యుమెంటరీపై బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ పార్లమెంట్‌లో స్పందించారు. పాక్‌ సంతతికి చెందిన ఎంపీ ఇమ్రాన్‌ హుస్సేన్‌ బ్రిటన్‌ పార్లమెంట్‌లో ఈ డాక్యుమెంటరీపై మాట్లాడుతూ.. మోదీపై విమర్శలు గుప్పించారు. అయితే.. హుస్సేన్‌కు బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ వెంటనే కౌంటర్‌ ఇచ్చారు. ప్రధాని మోదీకి మద్ధతుగా స్పందించారు. ‘‘దీనిపై UK ప్రభుత్వ వైఖరి స్పష్టంగా ఉంది. దీర్ఘకాలంగా ఉన్న ఆ వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. అలాగని ఎక్కడైనా హింసను సహించబోం.’’ అంటూ రిషి సునాక్‌ పాక్‌ సంతతి ఎంపీ నోరు మూయించారు. 

ఆ కామెంట్లపై అభ్యంతరాలు 
ఈ డాక్యుమెంటరీలో బ్రిటన్ మాజీ సెక్రటరీ జాక్ స్ట్రా చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. జాక్ స్ట్రా ఏదో అంతర్గత బ్రిటన్ నివేదికను ప్రస్తావించినట్లు కనిపిస్తోందని, అది తనకు ఏవిధంగా అందుబాటులో ఉంటుందని ప్రశ్నలు తలెత్తుతోంది. పైగా అది ఇరవయ్యేళ్ళ క్రితంనాటి నివేదిక అని, దానిపైన ఇప్పుడు ఎందుకు స్పందించాలని, జాక్ చెప్పినంత మాత్రానికి అది సరైనదని బీబీసీ ఎలా ప్రసారం చేసిందని అభ్యంతరాలతో ఏకిపడేస్తున్నారు కొందరు.

గుజరాత్‌ అల్లర్ల నేపథ్యం
2002 ఫిబ్రవరి నెలలో అయోధ్య నుంచి తిరిగి వస్తున్న సబర్మతి ఎక్స్ ప్రెస్ రైలులో కరసేవకులు ఉన్న బోగీకి గోద్రా రైల్వేస్టేషన్ లో నిప్పు పెట్టడంతో 59 మంది చనిపోయారు. ఈ ఘటనతో గుజరాత్ వ్యాప్తంగా హిందూ-ముస్లింల మధ్య ఘర్షణలు తలెత్తాయి. మూడు నెలల పాటు గుజరాత్ రాష్ట్రం అట్టుడికింది. ఈ ఘర్షణలో వెయ్యి మరణించారు. ఆ సమయంలో గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. సీఎంగా నరేంద్ర మోదీ ఉన్నారు. అయితే ఈ అల్లర్లపై ఏర్పాటు చేసిన సిట్ 2012లో ప్రధాని మోదీకి క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ అల్లర్లలో ప్రభుత్వ ప్రమేయం లేదని చెప్పింది. కొంతమంది మాత్రం నరేంద్రమోదీ పాత్ర ఉందని తప్పుడు ఆరోపణలు చేశారని వెల్లడించింది. 

ఇక తీస్తా సెతల్వాడ్ అనే హక్కుల కార్యకర్త నరేంద్ర మోదీని తప్పుడు ఆరోపణలతో ఇరికించే ప్రయత్నం చేసినట్లు తేలింది. దీనికి కాంగ్రెస్ పార్టీ, దివంగత కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ ప్లాన్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. కిందటి ఏడాది.. గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి గతంలో హైకోర్టు ఇచ్చిన క్లీన్ చిట్‌ను సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ మేరకు ఆ హింసాకాండలో మరణించిన కాంగ్రెస్ ఎంపీ ఈషాన్ జ‌ఫ్రీ భార్య జాకియా జఫ్రీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు అర్హత లేనిదిగా పేర్కొంది కూడా.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top