
సాఫ్ట్‌వేర్, తప్పుడు దరఖాస్తులతో ఓట్ల తొలగింపు
ఓట్ల చోరులను సీఈసీ జ్ఞానేశ్ కుమార్ కాపాడుతున్నారు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఆగ్రహం
త్వరలో బాంబు పేలుస్తానని వెల్లడి
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ)పై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. ఓట్ల దొంగలకు యథేచ్ఛగా సహకరిస్తోందని మండిపడ్డారు. ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ ఓట్ల చోరులను కాపాడుతున్నారని, ప్రజాస్వామ్యాన్ని ఖూ నీ చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో వ్యవస్థీకృతంగా ఓట్లను తొలగిస్తున్నారని ధ్వజమెత్తారు.
గురువా రం ఢిల్లీలో కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్‌లో రాహుల్ మీడియాతో మాట్లాడారు. ఓట్ల చోరీని బహిర్గతం చేస్తూ తెరపై ప్రజంటేషన్ ఇచ్చారు. ఓటర్ల జాబితా నుంచి తమ పేర్ల తొలగింపు కోసం దరఖాస్తు చేసినట్లుగా ఎన్నికల సంఘం చెబుతున్న వ్యక్తులు సైతం వేదికపైకి వచ్చారు. నిజానికి వారు ఎలాంటి దరఖాస్తు చేయలేదు. వారి పేరిట ఇంకెవరో దరఖాస్తు చేశారు. ఓట్ల చోరీపై తాను బయటపెట్టిన నిజాలు హైడ్రోజన్ బాంబు కాదని రాహుల్ వెల్లడించారు. త్వరలో నిజాలు బయటపెడతానని, బాంబు పేలుస్తానని అన్నారు. రాహుల్ ఏం మాట్లాడారంటే...
ఆటోమేటెడ్ సాఫ్ట్‌వేర్‌తో...
‘‘కర్ణాటకలోని అలంద్ నియోజకవర్గంలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 6,018 ఓట్లను తొలగించే ప్రయత్నం జరిగింది. కాంగ్రెస్‌కు బలం ఉన్న పోలింగ్ బూత్‌లను లక్ష్యంగా చేసుకున్నారు. అక్కడే ఓట్లను తొలగించేందుకు కుట్రలు సాగించారు. ఓట్లు అత్యధికంగా తొలగింపునకు గురైన టాప్–10 బూత్‌లు కాంగ్రెస్‌కు బలం ఉన్నవే. 2018లో ఈ పదింటిలో ఎనిమిది బూత్‌లను కాంగ్రెస్ గెలుచుకుంది. మహారాష్ట్రలోని రాజురా అసెంబ్లీ నియోజకవర్గంలో ఆటోమేటెడ్ సాఫ్ట్‌వేర్ సాయంతో 6,850 మంది ఓటర్లను మోసపూరితంగా చేర్చారు. ఇదే సాఫ్ట్‌వేర్‌ను హరియాణా, ఉత్తరప్రదేశ్, బిహార్‌లోనూ ఉపయోగించారు. దానిపై మావద్ద ఆధారాలున్నాయి.
సీఐడీకి ఆధారాలివ్వడానికి భయమెందుకు?
కర్ణాటకలో ఓట్ల చోరీపై ఫిర్యాదు చేశాం. దీనిపై రాష్ట్ర సీఐడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కొన్ని ఆధారాలు ఇవ్వాలని అధికారులు 18 నెలల్లో ఎన్నికల సంఘానికి 18 లేఖలు రాస్తే ఇప్పటికీ స్పందించలేదు. ఎన్నికల సంఘం ఆధారాలు ఎందుకు ఇవ్వడం లేదు? ఆధారాలిస్తే ఓట్ల దొంగతనానికి పాల్పడుతున్నది ఎవరో తెలిసిపోతుంది కాబట్టి భయపడుతున్నారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఇప్పటికైనా నోరువిప్పాలి. ఆయన సక్రమంగా విధులు నిర్వర్తించాలి. సీఐడీ దర్యాప్తును అడ్డుకొనే ప్రయత్నం చేయొద్దు. సీఐడీకి వారం రోజుల్లోగా ఆధారాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రాజ్యాంగాన్ని హత్య చేయడానికి ఎన్నికల సంఘం సహకరిస్తున్నట్లేనని భావిస్తాం. ఓట్ల దొంగతనాన్ని ఇకనైనా ఆపాలని కోరుతున్నాం.
వ్యతిరేకుల ఓట్లే టార్గెట్
మన దేశంలో ఎన్నికలను ఎలా రిగ్గింగ్ చేస్తున్నారో కొన్ని రోజులుగా యువతకు తెలియజేస్తున్నా. అందులో ఈరోజు మరో మైలురాయి. ఓట్ల తొలగింపు అనేది అనుకోకుండా జరుగుతున్నది కాదు. దేశవ్యాప్తంగా వ్యతిరేకుల ఓట్లను ఒక పద్ధతి ప్రకారం టార్గెట్ చేస్తున్నారు. మైనార్టీలు, దళితుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగిస్తున్నారు. ఇందుకోసం సాఫ్ట్‌వేర్‌ను వాడుకోవడంతోపాటు తప్పుడు దర ఖాస్తులు సమర్పిస్తున్నారు.
ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఫోన్ నెంబర్లను వాడుకుంటున్నారు. ప్రతిపక్షాలకు బలం ఉన్న ప్రాంతాల్లో లక్షలాది ఓట్లు గల్లంతవుతున్నాయి. ఓట్ల తొలగింపు కోసం దరఖాస్తును పూరించడం సాఫ్ట్‌వేర్‌తో సెకండ్లలోనే పూర్తయిపోతోంది. తెల్లవారుజామునే ఇది జరుగుతోంది. మరోవైపు నకిలీ వ్యక్తులు అసలైన ఓటర్ల ముసుగులో రంగ ప్రవేశం చేస్తున్నారు. తమ ఓట్లు తొలగించాలంటూ తప్పుడు పత్రాలతో దరఖాస్తులు సమరి్పస్తున్నారు. ఓట్ల చోరీపై మా దగ్గర 100 శాతం కచ్చితమైన ఆధారాలున్నాయి. నేను నా దేశాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రేమిస్తున్నా. వాటిని కాపాడుకోవడానికి పోరాటం సాగిస్తా’’ అని రాహుల్ గాంధీ పునరుద్ఘాటించారు.
ప్రజాస్వామ్యాన్ని ప్రజలే కాపాడుకోవాలి
దేశంలో రాజ్యాంగబద్ధ సంస్థలు వాటి విధులు సరిగ్గా నిర్వర్తించడం లేదు. అందుకే న్యాయ వ్యవస్థ సహా ఇతర విభాగాలు జోక్యం చేసుకోవాలి. పరిస్థితిని చక్కదిద్దాలి. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఓట్ల చోరులను, రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేవారిని కాపాడుతున్నారు. నేను ప్రతిపక్ష నేతను. ఈ విషయం మామూలుగా చెప్పడం లేదు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థను కొందరు హైజాక్ చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని ప్రజలే కాపాడుకోవాలి. నేను నిజాన్ని మాత్రమే చూపించగలను. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ఖూనీ అవుతున్నాయని ప్రజలు అర్థం చేసుకున్నరోజు వాటిని కాపాడుకోవడానికి వారే నడుం బిగిస్తారు. అందుకు నేను పునాది వేస్తున్నా. ఈ ఉద్యమం కొనసాగుతుంది.