కులాల వారీగా విడిపోయిన ఓటు బ్యాంకు
అదే లెక్కన రాజకీయ పార్టీలు
ఆర్జేడీ వెంట యాదవులు, ముస్లింలు
జేడీయూకు కుర్మీలు, ఈబీసీల మద్దతు
అగ్రవర్ణాలు, పట్టణ ప్రాంత హిందువులపై బీజేపీ ఆశలు
కుల వ్యవస్థ..! ప్రపంచంలో ఏ దేశంలోనూ లేని ట్యాగ్ భారత్‌కు మాత్రమే సొంతం..! ఇంకా చెప్పాలంటే.. భారత్‌లో ఓ వ్యక్తి పుట్టగానే.. అతనికి కులం అనే ట్యాగ్‌ని తగిలించేస్తారు..! కన్ను తెరిస్తే కులం.. కన్ను మూస్తే కులం.. జీవితమంతా కులం కులం కులం..! ఆ కులమే ఇప్పుడు రాజకీయాలకు మూలాధారమైంది. ముఖ్యంగా బిహార్ లాంటి కడు పేద రాష్ట్రాల్లో రాజకీయాలను సైతం కులం మాత్రమే శాసిస్తోంది. బిహార్ వెనకబాటుకు కారణం నిరుద్యోగితో.. పరిశ్రమల లేమి కారణం కాదు..! కేవలం కుల రాజకీయాలే ఆ రాష్ట్ర పరిస్థితికి కారణమనేది నిర్వివాదాంశం..! ప్రజలు కులాల వారీగా చీలిపోవడమే ఆ రాష్ట్ర ఆర్థిక దుస్థితికి కారణం..! ‘ధనమేరా అన్నిటికీ మూలం’ అని ఓ సినీ కవి అన్నాడు.. బిహార్‌లో మాత్రం ‘కులమేరా అన్నిటికీ మూలం’ అనే పరిస్థితులు ఉన్నాయి. కులగణన పేరుతో సర్వే నిర్వహించి చూపించిన తొట్టతొలి రాష్ట్రం కూడా బిహారే..! ఇక్కడ ప్రజలు కులం పేరుతో విడిపోతారు. రాజకీయనాయకులు కులం అనే అంశాన్ని ఓటు బ్యాంకుగా మలచుకుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. బిహార్‌లో కులం అనేది ఒక పదం కాదు.. ప్రజల మధ్య ఒక గోడ. ఈ కులం ట్యాగ్ కొందరికి అదృష్టాన్ని తెచ్చిపెడతే.. మరికొందరికి అవకాశాలను మూసివేస్తోంది. భారతదేశంలోనే కుల రాజకీయాలు అత్యంత ప్రభావం చూపే రాష్ట్రం బిహార్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.

2023లో బిహార్ కులగణన తర్వాత షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ రాష్ట్ర జనాభా 13 కోట్లు అయితే.. వీరిలో అత్యంత వెనుకబడిన వర్గాలు(EBC) 36%, ఇతర వెనుకబడిన వర్గాలు(OBC) 27%, ఎస్సీ ఎస్టీలు 19%, ముస్లింలు 17%, అగ్రవర్ణాలుగా ఉన్న బ్రాహ్మణులు, రాజ్‌పూత్‌లు, భూమిహార్లు, బనియాలు 15% ఉన్నట్లు తేలింది. ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే.. బిహార్‌లో ప్రతీ 10 మంది ఓటర్లలో 8 మంది వెనకబడిన వర్గాలకు చెందినవారే..! ఇప్పుడు ఊహించండి.. కులం ఓ బలమైన గోడగా ఉన్న బిహార్‌లో ఎన్నికలు ఎలా ఉంటాయో..? అక్కడ ఏ రాజకీయ పార్టీ అయినా.. నాయకుడు అయినా.. కులం అనే పజిల్‌ని అర్థం చేసుకోకపోతే.. విజయం కాదు కదా.. విజయపుటంచులను చేరడం కూడా అసాధ్యమే..! అందుకే.. బిహార్‌లో ప్రతి రాజకీయ నాయకుడి ప్రసంగం, ప్రతి కూటమి, అభ్యర్థులకు ఇచ్చే ప్రతి టికెట్ కుల సమీకరణల చుట్టే తిరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు..!
కలసికట్టుగా ఉన్నారా??
బిహార్‌లో ఓబీసీలంతా కలసి కట్టుగా ఉన్నారా? ఈ ప్రశ్నకు ఇదమిత్థంగా కూడా అవుననే సమాధానం చెప్పలేం. ఈబీసీల్లోనే 125 వేర్వేరు సమూహాలున్నాయి. దళితులు పాస్వాన్, ముసహార్, చమార్‌లుగా చీలిపోయారు. ఓబీసీలు కూడా యాదవ, కుర్మీ, కోయిరీ, ఈబీసీలుగా విడిపోయారు. వీరంతా వేర్వేరు రాజకీయ పార్టీలకు ఓటు బ్యాంకుగా మారిపోయారు. బిహార్‌లో కులాలంటే.. దక్షిణాది రాష్ట్రాల్లో మాదిరిగా సామాజిక గుర్తింపు కాదు..! రాజకీయ ఆయుధం మాత్రమే!. ఎన్నికల్లో అభ్యర్థి ఎవరు? ఎవరు గెలవాలి? ఎవరిని ఓడించాలి? అన్నదాన్ని కూడా ఇక్కడ కులమే నిర్ణయిస్తుంది. ఇక్కడ ప్రతి ఎన్నిక.. ప్రతి కూటమి.. ప్రతి నినాదం కుల గణాంకాలపైనే ఆధారపడి ఉంటుంది. ఇతర రాష్ట్రాల్లో ‘ఈ ప్రభుత్వం ఏం చేసింది?’ అనే ప్రశ్న ఉత్పన్నమైతే.. బిహార్‌లో మాత్రం.. ‘ఈ ప్రభుత్వం ఏ కులానికి చెందినది?’ అనే ప్రశ్న వినిపిస్తుంది. భారత్‌లో ప్రజాస్వామ్యం ఫరిడవిల్లుతున్నా.. ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్యానికి మన దేశం కేంద్ర బిందువు అయినా.. బిహార్‌లో మాత్రం కులమే అత్యంత శక్తిమంతమైన రాజకీయ పార్టీగా ఉంది.

90వ దశకం నుంచి..
బిహార్ కుల వ్యవస్థను.. కులాధిపత్యాన్ని అర్థం చేసుకోవాలంటే.. 90వ దశకానికి, అంటే.. మండల్ కమిషన్ యుగానికి వెళ్లాల్సిందే..! అప్పటి ప్రధాని వీపీ సింగ్ మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ ఒక్క నిర్ణయంతో భారత రాజకీయాల డీఎన్ఏ మారిపోయినట్లయింది. వెనకబడిన వర్గాల కోసం ప్రభుత్వం రిజర్వేషన్లను ప్రకటించగానే.. ఓ విప్లవానికి కేంద్ర బిందువుగా బిహార్ మారింది. లాలూ ప్రసాద్ యాదవ్ అణగారిన వర్గాల స్వరంగా ఎదిగారు. ఆయన తన రాజకీయ సామ్రాజ్యాన్ని ‘ఎం-వై సమీకరణం’.. అంటే ముస్లింలు, యాదవులతో నిర్మించారు. ఆ తర్వాత నితీశ్ కుమార్ వచ్చారు. ఆయన కుర్మీలు, ఇతర అత్యంత వెనకబడిన వర్గాల తరఫున మాట్లాడారు. 2023లో కులగణన చేయించింది కూడా ఆయన సర్కారే. కేంద్రం కులగణనను వ్యతిరేకిస్తే.. ఆయన స్వతంత్రంగా సర్వే నిర్వహించారు. దాంతో.. బిహార్‌లో ‘కుల గుర్తింపుల యుద్ధం’ మరింత ముదిరింది.
కులాల వారీగా పార్టీలు
బిహార్‌లో రాజకీయ పార్టీలు కులాల వారీగా ఉన్నాయి. కులగణనతో వచ్చిన లెక్కల ప్రకారం బిహార్ ఎన్నికల్లో ఎవరూ.. ఏ పార్టీ ఒంటరిగా గెలిచే పరిస్థితి లేదు. అభ్యర్థి ఎంపిక ప్రక్రియ కూడా కుల సమీకరణాలతో ముడిపడి ఉంటుంది. రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ యాదవులు, ముస్లిం ఓటు బ్యాంకుతో ముందుకు వెళ్తోంది. జనతాదళ్ (యూ) కుర్మీలు, ఈబీసీలపై ఆధారపడుతోంది. బీజేపీ అయితే.. అగ్రవర్ణాలు, పట్టణ ప్రాంతాల్లోని హిందువులపై ఆధారపడి ఉంది. అంటే.. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో పరిస్థితులు ఎలా ఉన్నా.. బిహార్‌లో మాత్రం రాజకీయ పార్టీలు సిద్ధాంతాలను కాకుండా.. కులాలను నమ్ముకుంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్నికల విశ్లేషకులు కూడా చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థి కులాన్ని బట్టి గెలుపోటములను విశ్లేషిస్తారు.
అంటే.. ఓటర్లు కూడా కులం ఆధారంగానే ఓట్లు వేస్తారే తప్ప.. పార్టీల సిద్ధాంతాలను బట్టి కాదని స్పష్టమవుతోంది. అంటే.. గ్రామంలో పరిస్థితులు.. బడుల్లో టీచర్ల నియామకాలు, భూవివాదాల పరిష్కారం వంటి అంశాలు కాకుండా.. తమ కులస్థుడు ఎమ్మెల్యే అయితే.. తమ మాట వింటాడనే భావన ఓటర్లలో బలంగా నాటుకుపోయింది. బిహార్‌లో రాజకీయ నాయకులు, పార్టీలు నియోజకవర్గాల వారీగా కులాల మ్యాప్‌ను అధ్యయనం చేయడం పరిపాటిగా మారింది. ఏ కులం వారు ఎక్కువగా ఓటు హక్కును వినియోగించుకుంటారు? ఏ అభ్యర్థి అయితే ఆధిపత్యాన్ని నిలబెట్టుకోగలడు? అనే లెక్కలను సమతుల్యంగా ఉండేలా చూసుకుంటూ.. కూటములు కట్టడం ఆనవాయితీగా మారింది.

ఈ విషయంలో కాస్త తెలివిగా ఆలోచించే నితీశ్‌కుమార్ తరచూ కూటములను మార్చడం వెనక కుల సమీకరణాలే ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఆయన అయితే ఆర్జేడీ.. లేదే బీజేపీ అన్నట్లుగా మిత్రపక్షాలను మార్చేస్తుంటారు. అంటే.. బిహార్‌లో సిద్ధాంతాలను కాకుండా.. కుల సమీకరణాలను నమ్ముకోవాలనే విషయాన్ని ఆయన చక్కగా ఒంటబట్టించుకున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో కూడా ప్రతీ నియోజకవర్గంలో అభ్యర్థుల ఎంపిక కుల గణాంకాల చుట్టే తిరుగుతుండడం గమనార్హం..! అంటే.. అభ్యర్థి ప్రజాసేవకుడా? ప్రజలకు మంచి సేవ చేస్తూ.. పాలనను అందిస్తాడా? అనే విషయాన్ని పక్కనబెట్టి.. అతని కులం ఏది అనేదే అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తోంది.
ఆ నియోజకవర్గాల్లో మార్పు..!
కుల రాజకీయాల వ్యవహారం కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం తగ్గుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా పట్నా, గయా, ముజఫర్‌పూర్ వంటి పట్టణాల్లో కొత్త ఓటర్లు తమ పంథాను మార్చుకున్నట్లు వివరిస్తున్నారు. ఈ నియోజకవర్గాల్లో అక్షరాస్యత పెరగడం, యువ ఓటర్లు బిహార్ వెలుపల చదువుకున్న వారు కావడం వంటి అంశాలను ప్రస్తావిస్తున్నారు. ఈ నియోజకవర్గాల్లో 40% యువత ఉద్యోగాలు, ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెల్లడం కూడా ఈ మార్పునకు కారణమంటున్నారు. ఢిల్లీలో, తమిళనాడులో రోజుకూలీలుగా.. ముంబైలో రిక్షావాలాలా.. సూరత్‌లోని కర్మాగారాల్లో కార్మికులుగా పనిచేస్తున్న యువత.. మార్పును కోరుకుంటోందని స్పష్టమవుతున్నట్లు చెబుతున్నారు. అయితే.. బిహార్ వెలుపల ఉన్నంత కాలం వారు కుల ఛట్రం నుంచి బయట ఉన్నా.. తిరిగి రాష్ట్రానికి వచ్చేసరికి వెనక్కి వెళ్లే ప్రమాదం కూడా ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే.. కులం అనేది బిహార్ వెలుపల అదృశ్యమైనా.. రాష్ట్రంలోకి వచ్చేసరికి తిరిగి పుంజుకుంటుందన్నట్లే..! అయితే.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ వర్గం.. ఇప్పుడు కులాలుగా విడిపోతుందా? సిద్ధాంతాలకు లోబడి ఓట్లు వేస్తుందా? అనేవి మిలియన్ డాలర్ల ప్రశ్నలుగా మారాయి.
మార్పునకు నాంది పలుకుతున్న మహిళలు..
బిహార్ మహిళలు మాత్రం కులం విషయంలో వ్యతిరేకంగా ఉన్నట్లు తాజా పరిణామాలు, గత ఎన్నికల గణాంకాలు చెబుతున్నాయి. నితీశ్ కుమార్ సర్కారు పంచాయతీల్లో మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చింది. మద్య నిషేధాన్ని అమలు చేసింది. దీని ఫలితంగా మహిళలు మాత్రం స్వతంత్రంగా ఓటు వేస్తున్నట్లు తెలుస్తోంది. పురుషుల కంటే మహిళల ఓటింగ్ శాతం ఎక్కువగా ఉండడంతో ఈ సారి మార్పు కనిపించే అవకాశాలుంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు. 2020 ఎన్నికల్లోనూ మహిళల ఓటింగ్ 60 శాతాన్ని దాటింది. ముఖ్యంగా మహిళా ఓటర్లు కులం కోసం కాకుండా.. భద్రత, విద్య, సమాజంలో గౌరవం కల్పించే అభ్యర్థుల వైపు మొగ్గుచూపుతున్నారు.
ఈ ఎన్నికల్లో కూడా బిహార్ ఓటర్లు కులాల వలయంలో చిక్కుకుని, ఓటుహక్కును వినియోగించుకుంటారా? అభివృద్ధి గురించి ఆలోచిస్తారా? విద్యావంతులు, యువత, మహిళలు, వలస కార్మికులు మార్పును తీసుకొస్తారా? ఈవీఎం బటన్ నొక్కడానికి ముందు ఒక ఆలోచన.. నొక్కేప్పుడు కులం ఆలోచనతో మళ్లీ వెనక్కి వెళ్తారా? కుల రాజకీయాలకు కేంద్ర బిందువు అని బిహార్‌కు ఉన్న అపవాదును తొలగిస్తారా? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే.. ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఆగాల్సిందే..! దీనిపై మీరేమంటారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో రాయండి.
- హెచ్.కమలాపతిరావు


